Begin typing your search above and press return to search.

వాజపేయితో ప్రియాంకగాంధీ రాయ‘బేరం’

By:  Tupaki Desk   |   16 April 2016 8:19 AM GMT
వాజపేయితో ప్రియాంకగాంధీ రాయ‘బేరం’
X
వ్యాపారం అంటే బేరం ఉంటుంది... గల్లీ స్థాయి వ్యాపారమైనా, ఢిల్లీ స్థాయి వ్యాపారమైనా ఏదోరకమైన బార్గెయినింగ్ తప్పనిసరిగా ఉంటుంది. వ్యాపారవేత్త రాబర్టు వాధ్రాను పెళ్లి చేసుకున్న ప్రియాంకకు కూడా ఆ వ్యాపార లక్షణాలు వచ్చేసినట్లున్నాయి. బేరాలాడడంలో ఆమె తన భర్త రాబర్టును మించిపోయింది. కాంగ్రెస్ రక్తాన్ని అణువణువునా నింపుకొన్న ఆమె ఏకంగా బీజేపీ ప్రభుత్వంతోనే బేరాలాడి అనుకున్నది సాధించుకున్నదట. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీ బీజేపీ అధికారంలో ఉండగా, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి సర్కారుతో బేరమాడిన ఆమె తానుంటున్న విలాసవంతమైన భవంతి అద్దెను భారీగా తగ్గించుకున్న విషయం తాజాగా వెల్లడైంది. దీంతో ఆమెపై పీనాసి ప్రియాంక అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పడుతున్నాయి.

పదమూడేళ్ల కిందటి ఈ సంఘటనను తాజగా ఓ ఆంగ్ల పత్రిక జనానికి తెలియజెప్పింది. 2002లో ఢిల్లీలోని లుటియెన్సు బంగ్లాలో (2,765 చదరపు అడుగుల విస్తీర్ణంలో) భర్తతో కలిసి నివాసముండేది. ప్రభుత్వం దాని అద్దెను రూ.53,421గా నిర్ణయించింది. అప్పటివరకు ఆ బిల్డింగులో ఉన్నవారు అంత అద్దె చెల్లించేవారు. అయితే... ప్రియాంక మాత్రం రూ.50 వేలకు పైబడి అద్దె చెల్లించే స్థాయి తనకు లేదని వాజ్ పేయి సర్కారుకు తెలుపుతూ ఓ లేఖ రాశారు. సాక్షాత్తు ఇందిరా గాంధీ మనవరాలు రాసిన లేఖకు వాజ్ పేయి సర్కారు కూడా నిజమేనేమోనని నమ్మింది. రూ.53,421 అద్దెను అమాంతంగా రూ.8,888కి తగ్గించింది.

అయితే.. అద్దె తగ్గించాలని కోరుతూ ప్రియాంక రాసిన లేఖలో విషయాలు చదివితే ఆశ్చర్యం కలుగుతుంది. తాను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రతలో ఉన్నానని... తన నివాసంలోని ఎక్కువ గదులను వారే వాడుకుంటున్నారని కూడా ఆమె అందులో పేర్కొంది. కాబట్టి అద్దె మొత్తం తానే కట్టడం కరెక్టు కాదని.. పైగా అంతకట్టలేనని కూడా ప్రియాంక వాజపేయికి విన్నవించుకుందట. దీంతో సర్లే ఆడకూతురిని ఏడిపించడం ఎందుకనుకుంటూ వాజపేయి ప్రభుత్వం అద్దెను భారీగా తగ్గించింది. అయితే, ఒక్క ప్రియాంకకే తగ్గిస్తే బాగుండదు కాబట్టి అలాంటి బిల్డింగుల్లో ఉంటున్నవారందరి అద్దెలనూ కూడా అప్పట్లో తగ్గించారట. అదీ ప్రియాంక రాయ‘బేరం’ సంగతి.