Begin typing your search above and press return to search.

గాంధీయేతరుడు కాంగ్రెస్ కు అధ్యక్షుడవ్వాలి: ప్రియాంక

By:  Tupaki Desk   |   19 Aug 2020 5:33 PM GMT
గాంధీయేతరుడు కాంగ్రెస్ కు అధ్యక్షుడవ్వాలి: ప్రియాంక
X
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన ప్రతిపాదనకు ఒప్పుకున్నారు. తన సోదరుడు, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో అంగీకరిస్తూ కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతరులు నాయకత్వం వహించాలని ఆమె కోరారు. తమ కుటుంబానికి చెందిన వారెవరూ పార్టీ అధ్యక్షుడిగా ఉండకూడదని రాహుల్ తనకు చెప్పారని, దానికి అంగీకరించానని ఆమె అన్నారు.పార్టీ దాని సొంత కాళ్లపై ఎదగాలంటే కుటుంబ ప్రభావాన్ని తొలగించాలన్న వాదనకు తాను ఏకీభవిస్తున్నట్టు తెలిపారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన వేళ.. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఈ వయసులోనూ సోనియాగాంధీనే మోస్తోంది. తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ వర్గాలు ఎంత కోరుతున్నా.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎంత ఒత్తిడి తెస్తున్నా రాహుల్ మాత్రం ససేమిరా అంటున్నారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ కు గాంధీయేతర వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి స్వయంగా ప్రియాంక గాంధీ మద్దతు తెలుపడం విశేషం. గాంధీయేతర వ్యక్తి కింద పనిచేయడానికి తనకు ఎలాంటి సమస్యలు లేవని.. చీఫ్ ఏ పదవిని ఇచ్చినా తాను నెరవేరుస్తానని ప్రియాంక తెలిపారు.

కాగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు గాంధీయేతర వ్యక్తికి అప్పజెప్పడానికి సోనియానే అడ్డుగా ఉన్నారు. ఎందుకంటే ఆమె అప్పట్లో పీవీ నరసింహారావు ప్రధాని అయ్యి స్వతంత్రంగా వ్యవహరిస్తే అణిచివేశారు. ఇప్పుడూ ఎవ్వరినీ కాంగ్రెస్ లో ఎదగనీయడం లేదు. కానీ బీజేపీని ఎదుర్కోవాలంటే ఇప్పుడున్న సోనియా, రాహుల్, ప్రియాంక బలం సరిపోదు. దీంతో గాంధీయేతరుడైన సమర్థవంతమైన వ్యక్తి కోసం కాంగ్రెస్ వెతకాల్సిన అవసరం ఉంది.