Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ అమ్ములపొదిలో తాజా అస్త్రమిదే..

By:  Tupaki Desk   |   30 Jun 2019 6:32 AM GMT
కాంగ్రెస్ అమ్ములపొదిలో తాజా అస్త్రమిదే..
X
నోట్ల రద్దు, జీఎస్టీ, కేబుల్ టీవీ చానల్స్ కట్.. ఇలా ప్రజాకంఠక నిర్ణయాలు ఎన్నో తీసుకున్నా కూడా నరేంద్రమోడీని దేశంలో జనాలు అంత మెజార్టీతో మళ్లీ ఎలా గెలిపించారన్న ప్రశ్న మాత్రం ఇప్పటికీ కాంగ్రెస్ వాదులకు అంతుపట్టడం లేదు. ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడైన రాహుల్ ను ఆయన పోటీచేసిన ‘అమేథీ’ నియోజకవర్గంలో ఓడించడం చర్చనీయాంశమైంది.

ఫలితాలు వచ్చినప్పటి నుంచి తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అనర్హుడిని అంటూ రాజీనామా చేసి మెట్టుదిగడం లేదు రాహుల్. కాంగ్రెస్ పాత సీనియర్లను సాగనంపి ప్రక్షాళన చేయాలని పట్టుబడుతున్నాడు. దానికి సోనియా - మన్మోహన్ సహా సీనియర్లు ఒప్పుకోకపోవడంతో తన రాజీనామాను వెనక్కి తీసుకోవడం లేదు.

అయితే ఆశ్చర్యకరంగా రాహుల్ సదాశాయానికి అనుగుణంగా రాష్ట్రాల్లోని పీసీసీల అధ్యక్షులు, ఇతర కార్యవర్గాలను రద్దు చేస్తున్నారు. చాలా మంది స్వతహాగా రాజీనామా చేస్తున్నారు. పొన్నం, రేవంత్ రెడ్డి సహా వివిధ రాష్ట్రాల్లోని పీసీసీ అధ్యక్షులు తాజాగా రాజీనామా బాట పట్టారు. మరి రాహుల్ మాత్రం ఇంకా యాక్టివ్ కాలేరు.

అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ.. రాహుల్ తిరిగి బాధ్యతలు తీసుకునే వరకు కాంగ్రెస్ కు జవసత్వాలు నింపేందుకు ప్రియాంకా గాంధీని రంగంలోకి దింపుతున్నట్టు సమాచారం. ఏపీ సహా దేశవ్యాప్తంగా పాదయాత్ర సెంటిమెంట్ బలపడింది. అది చేసిన వారు సీఎంలు అయ్యారు. నాడు వైఎస్ - తర్వాత చంద్రబాబు.. నేడు జగన్ లు ముఖ్యమంత్రి పీఠాన్ని పాదయాత్రతోనే సాధించారు. ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు - కార్యకర్తలకు కొత్త జోష్ నింపేందుకు.. పార్టీ వీక్ గా ఉన్న చోట్ల బలపడేందుకు ప్రియాంక గాంధీతో దాదాపు 3000 కిలోమీటర్ల పాదయాత్రకు ప్లాన్ చేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనూ ఈ పాదయాత్ర ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో ప్రియాంక ఎన్నికల ప్రచారం చేసి జనాలకు చేరువయ్యారు. మాటల తూటాలు పేల్చి జనాలను ఆకట్టుకున్నారు.

ప్రియాంక పాదయాత్ర వర్కవుట్ అయ్యి రాష్ట్రాల్లో అధికారం దక్కితే వచ్చే 2024 వరకు రాహుల్ కాడివదిలేస్తే ప్రియాంకను భావి ప్రధాని రేసులో నిలబెట్టాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్టు సమాచారం.