Begin typing your search above and press return to search.

సోనియా కుటుంబం నుంచి ట్రంప్ కార్డు

By:  Tupaki Desk   |   2 May 2016 9:53 AM GMT
సోనియా కుటుంబం నుంచి ట్రంప్ కార్డు
X
రాజకీయంగా దారిద్ర్య రేఖకు దిగువకు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ తన పరిస్థితి మెరుగుపరుచుకుని పూర్వవైభవం సాధించడానికి నానా కష్టాలు పడుతోంది. అయితే.. సోనియా - రాహుల్ గాంధీలు ఎంతగా ప్రయత్నిస్తున్నా సరైన దారి కనిపించడం లేదట. మోడీ పట్ల దేశంలో వ్యతిరేకత వచ్చిందని కాంగ్రెస్ భావిస్తున్నప్పటికీ నెలకోసారి వస్తున్న రకరకాల సర్వేలన్నీ కూడా మోడీ హవా ఏమాత్రం తగ్గలేదని.. కాంగ్రెస్ గ్రాఫ్ పెద్దగా పెరగలేదని చెబుతున్నాయి. దీంతో మోడీ పనైపోయింది... నెక్స్టు మనమే అని ఇంతవరకు అనుకుంటున్నదంతా భ్రమేనని సోనియా ఒక నిర్ధారణకు వచ్చారట.

దశాబ్ద కాలానికి పైగా యాక్టివ్ పాలిటిక్సులో ఉంటున్నా ఏమాత్రం డెవలప్ కాని కుమారుడు రాహుల్ వల్ల ఇక లాభం లేదని... ప్రత్యామ్నాయంగా బలమైన నూతన శక్తి అవసరమని సోనియా అనుకుంటున్నారట. ఆ క్రమంలో ప్రియాంకా గాంధీని రంగంలోకి దించడానికి ఆమె ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది వస్తున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక రంగ ప్రవేశం ఉంటుందని కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, ప్రియాంకా గాంధీని సీఎం అభ్యర్థిగా బరిలోకి దించి ముందుకు సాగాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తన టెక్నాలజీ చతురతతో, నరేంద్ర మోదీ ప్రధాని పదవిని చేరుకోవడానికి, ఆపై బీహార్ లో నితీశ్ కుమార్ పీఠాన్ని అధిరోహించడానికి సహకరించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు సోనియా ఆలోచనలను అమలు చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఒకదశలో యూపీలోని అన్ని అసెంబ్లీ స్థానాలనూ దక్కించుకుని సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీకి - ఇప్పుడు రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ పడేందుకు కూడా సరైన అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది. రెండేళ్ల కిందటి సార్వత్రిక ఎన్నికల్లో సోనియా - రాహుల్ గాంధీలు తమ నియోజకవర్గాలైన రాయ్ బరేలీ - అమేథీల్లో గెలువగా - మరే నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ విజయం సాధించలేదు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా, పార్టీలో సంస్థాగత పరమైన మార్పుచేర్పులు పూర్తి చేసి, కొత్త నేత సారథ్యంలో ముందుకు దూకాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ములాయం సింగ్ యాదవ్ - మాయావతి తదితరుల పార్టీలకు పోటీ ఇవ్వడానికి ప్రియాంక తప్ప వేరే గత్యంతరం లేదని సోనియా భావిస్తున్నట్లు చెబుతున్నారు. యూపీలో ప్రియాంక కారణంగా మంచి ఫలితాలు వస్తే, ఆ అనుభవం... కాన్ఫిడెన్సులో ఆమెనే ముందు పెట్టి లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలన్నది సోనియా ప్లాన్ గా తెలుస్తోంది. అయితే.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక రావాలంటూ పార్టీ నేతల పిలుపు.. ఊహాగానాలు చాలాకాలంగా ఉన్నా ఆమె ఇంతవరకు అంగీకరించలేదు. ఇప్పుడు కూడా అంగీకరిస్తుందో లేదో చూడాలి.

ప్రియాంక అంగీకరిస్తుందా లేదా అన్నది పక్కన పెడితే ఒక విషయం మాత్రం స్పష్టమైంది. సోనియాకు రాహుల్ గాంధీపై ఉన్న అంతోఇంతో ఆశ చచ్చిపోయిందని మాత్రం తెలుస్తోంది. ప్రియాంక సక్సెస్ అయితే రాహుల్ ఏ విదేశాల్లోనో సెటిలవ్వాల్సిందే.