Begin typing your search above and press return to search.

ఎంత సింఫుల్ కాకుంటే.. చీపురు పట్టి గదిని ఊడ్చిన ప్రియాంక

By:  Tupaki Desk   |   4 Oct 2021 12:30 PM GMT
ఎంత సింఫుల్ కాకుంటే.. చీపురు పట్టి గదిని ఊడ్చిన ప్రియాంక
X
కొన్ని సందర్బాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అలాంటి వాటికి ఎంత స్పందిస్తే అంతటి మైలేజీ ఉంటుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. తమ ప్రత్యర్థులు చేసే తప్పుల్ని గుర్తించి..రెప్పపాటులో స్పందించే నేతలకు వచ్చే ఇమేజ్ అంతా ఇంతా కాదు. మరికొద్ది నెలల్లో కీలకమైన యూపీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామంలో ఎనిమిది మంది మరణించటం.. అందులో పలువురు రైతులు ఉండటం సంచలనంగా మారింది.

కేంద్ర సహాయ మంత్రి కుమారుడు స్వయంగా కారు నడుపుతూ.. నిరసన చేస్తున్న రైతుల మీదకు పోనిచ్చిన ఉదంతం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారటమే కాదు.. కేంద్రంలోని మోడీ సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. దీంతో.. జరిగిన ఉదంతంపై ఆవేదనను వ్యక్తం చేసిన కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక వాద్రా వెనువెంటనే స్పందించారు. తాజాగా మరణించిన కుటుంబాల వారిని పరామర్శించేందుకు ఆమె వెళ్లారు. ప్రియాంకను సీతాపూర్ లో పోలీసులు అదుపులోకి తీసుకుననారు. ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ప్రియాంక వాద్రాతో పాటు.. పార్టీ ఎమ్మెల్యే దీపేంద్ర సింగ్ హుడా తదితరుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని సీతాపూర్ - లిఖింపూర్ సరిహద్దుల్లోని హర్గావ్ సమీపంలోని ఒక గెస్టు హౌస్ లో ప్రియాంక గాంధీని కస్టడీలో ఉంచినట్లుగా కాంగ్రెస్ వర్గాలు సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో.. ఆమె తన నివాసంలో నిరాహార దీక్షను షురూ చేశారు. బాధిత కుటుంబాలను కలిసేందుకు అనుమతి ఇచ్చే వరకు తాను దీక్ష చేస్తానని చెబుతున్నారు.

ఇందులో భాగంగా స్వయంగా చీపురు పట్టి.. తనను ఉంచిన గదిని శుభ్రం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు యూపీకి చెందిన పలువురు విపక్ష నేతలు బాధిత రైతు కుటుంబాల్ని పరామర్శించేందుకు వెళుతుండటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మొత్తంగా.. యూపీలో బీజేపీ కేంద్రమంత్రికుమారుడు చేసిన పని ఇప్పుడు కొత్త తలనొప్పిగా మారటమే కాదు.. కేంద్రంతో పాటు యూపీలోని యోగి సర్కరు ఆత్మరక్షణలో పడిన పరిస్థితి.