Begin typing your search above and press return to search.

ప్రియాంక వాద్రా అంత సింఫుల్ గా ఉంటార‌ట‌!

By:  Tupaki Desk   |   30 Oct 2017 5:14 AM GMT
ప్రియాంక వాద్రా అంత సింఫుల్ గా ఉంటార‌ట‌!
X
దేశాన్ని ఏలే హ‌క్కు త‌మ‌కు ఉంద‌న్న భావ‌న గాంధీ ఫ్యామిలీలోని వారి మాట‌ల్లో క‌నిపిస్తుంటుంది. మాట‌ల్లో క‌నిపించే రాజ‌సం.. వ్య‌క్తిగ‌తంగా వారు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారు? అన్న‌ది చూస్తే.. అందుకు సంబంధించిన వివ‌రాలు పెద్ద‌గా బ‌య‌ట‌కు రావు. కొన్నేళ్లుగా మారిన మీడియా స్వ‌రూపంతో అధికారంలో ఉన్న వారికి సంబంధించిన నెగిటివ్ వ్యాఖ్య‌లు.. ప్ర‌తికూల స‌మాచారాన్ని వీలైనంత వ‌ర‌కూ త‌గ్గించే ప్ర‌క్రియ ఎక్కువైంది.

విశ్లేష‌ణ‌ల‌లోనూ ఇలాంటి తీరే క‌నిపిస్తోంది. గ‌తంలో ఏదైనా కీల‌క రాజ‌కీయ నేత మీద ఏదైనా రాజ‌కీయ విశ్లేష‌ణ రాసే స‌మ‌యంలో.. వారి వ్య‌క్తిగ‌త అంశాలు.. వారి టెంప‌ర్ మెంట్స్ లాంటివి ప్ర‌స్తావించేవారు. ఇటీవ‌ల కాలంలో పాత్రికేయుల్లో అలాంటి ప్రాధ‌మిక‌ దృష్టికోణం త‌గ్గింద‌ని చెప్పాలి. దీంతో.. కీల‌క స్థానాల్లో ఉన్న వ్య‌క్తుల‌కు సంబంధించిన వివ‌రాలు చాలావ‌ర‌కూ రిఫైన్ చేసి మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

ప్రియాంక వాద్రా సంగ‌తే చూడండి. ఆమెకు సంబంధించిన వివ‌రాలు పెద్ద‌గా బ‌య‌ట‌కు రావు. వ‌చ్చినా.. చాలావ‌ర‌కూ అంద‌రికి తెలిసిన‌వి మాత్ర‌మే. కాంగ్రెస్ కు భ‌విష్య‌త్ ఆశాజ్యోతిలాంటి ఆమె ఎలా వ్య‌వ‌హ‌రిస్తుంటారు? ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆమె పోషిస్తున్న పాత్ర ఏమిట‌న్న విష‌యాలు బ‌య‌ట‌కు రాని ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. ఒక ఇంట‌ర్వ్యూలో ఆమె తీరు.. వ్య‌క్తిగ‌తంగా ఆమె ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న విష‌యాన్ని ఒక ప్ర‌ముఖుడు చెప్ప‌టం ఆస‌క్తిక‌ర‌మైన అంశంగా చెప్పాలి.

వ్య‌క్తిగ‌తంగా ప్రియాంక వాద్రా ఎలా వ్య‌వ‌హ‌రిస్తారు? త‌న కొడుక్కి ఆరోగ్యం బాగోన‌ప్పుడు ఆమె భావోద్వేగాలు ఎలా ఉంటాయి? ట‌్రీట్ మెంట్ కోసం వ‌చ్చిన ఆమె త‌మ ప‌వ‌ర్ ప్ర‌ద‌ర్శించారా? లాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఒక ఇంట‌ర్వ్యూలో ల‌భించింది.

ఆ మ‌ధ్య‌న ప్రియాంక కుమారుడు క్రికెట్ ఆడుతున్న‌ప్పుడు బంతి కంటికి త‌గిలింది. సెకండ్ ఓపీనియ‌న్ కోసం ఆమె ప్ర‌త్యేక విమానంలో హైద‌రాబాద్ కు వ‌చ్చి ఎల్వీ ప్ర‌సాద్ ఐ ఇనిస్టిట్యూట్ లోని వైద్యుల‌కు చూపించారు. త‌న ప‌ర్య‌ట‌న వివ‌రాలు స్థానిక కాంగ్రెస్ నేత‌ల‌కు తెలీనికుండా జాగ్ర‌త్త ప‌డ‌ట‌మే కాదు.. ముఖ్య‌నేత‌లు సైతం త‌మ‌ను క‌లుసుకోవ‌ద్ద‌ని చెప్ప‌టం అప్ప‌ట్లో వార్త‌ల రూపంలో వ‌చ్చాయి.

అయితే.. ఆసుప‌త్రిలో వైద్యుల‌తో ఆమె ఎలా వ్య‌వ‌హ‌రించార‌న్న విష‌యం మీద ఎలాంటి స‌మాచారం రాలేదు. తాజాగా ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు ఆ ఆసుప‌త్రి వ్య‌వ‌స్థాప‌కులు క‌మ్ ఛైర్మ‌న్ గుళ్ల‌ప‌ల్లి నాగేశ్వ‌ర‌రావు ఒక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఇందులో ప‌లు అంశాల్ని ప్ర‌స్తావించిన ఆయ‌న‌.. ప్రియాంక వాద్రా త‌మ ఆసుప‌త్రికి వ‌చ్చిన వివ‌రాల్ని వెల్ల‌డించారు.

ప్రియాంక కుమారుడి కంటికి దెబ్బ త‌గ‌ల‌టంతో సెకండ్ ఓపీనియ‌న్ కోసం ఆసుప‌త్రికి వ‌చ్చార‌ని.. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ ర‌మేశ్ చూశార‌ని.. అంతా బాగుంద‌ని చెప్పిన‌ట్లు వెల్ల‌డించారు. ఆసుప‌త్రి అపాయింట్ మెంట్ కోసం ప్రియాంకే స్వ‌యంగా మాట్లాడార‌ని.. చాలా మ‌ర్యాద‌గా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు చెప్పారు. సింఫుల్ గా ఉన్న‌ట్లు చెప్పారు. దేశాన్ని ప్ర‌భావితం చేయ‌గ‌లిగిన వ్య‌క్తి త‌న కొడుకు ఆరోగ్యానికి సంబంధించి జాగ్ర‌త్త తీసుకోవ‌ట‌మేకాదు.. ఎక్క‌డా త‌న స్థాయి చూపించే ప్ర‌య‌త్నం చేయ‌కుండా సామాన్యురాలి మాదిరి వ్య‌వ‌హ‌రించ‌టం గుర్తు పెట్టుకోద‌గ్గ అంశంగా చెప్పాలి.