Begin typing your search above and press return to search.

నితీశ్ వెళ్లి రాహుల్ ను కలిస్తే.. రేవంత్ కు ఇబ్బందా?

By:  Tupaki Desk   |   6 Sep 2022 1:58 PM GMT
నితీశ్ వెళ్లి రాహుల్ ను కలిస్తే.. రేవంత్ కు ఇబ్బందా?
X
ఎక్కడో స్విచ్ వేస్తే.. మరెక్కడో బల్బు వెలిగిన చందంగా ఉంటుంది రాజకీయంలో చోటు చేసుకున్న పరిణామాలు. ఒక దానితో మరొకటి సంబంధం లేనట్లుగా ఉంటుంది. కానీ.. అంతర్లీనంగా ఉండే కొన్ని లింకులు కలిసి పరిస్థితులు ప్రతికూలంగా మారే పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా ఆలాంటి ఉదంతమే ఒకటి ఢిల్లీలో చోటు చేసుకుంది. బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. వీరి కలయికపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీని ఢీ కొనాలంటే ప్రాంతీయ పార్టీలతో అయ్యేది కాదు. కచ్ఛితంగా కాంగ్రెస్ తోడు అవసరం. లేనిపక్షంలో బీజేపీపై పైచేయి సాధించటం సాధ్యం కాదు. అందుకే.. కాంగ్రెస్ తో కూడిన ప్రాంతీయ పార్టీల సమాహారంతోనే మోడీ షాలకు దెబ్బేసే అవకాశం ఉంటుందని చెప్పాలి. ఇందులో భాగంగానే నితీశ్.. రాహుల్ తో భేటీ అయి... తాజా రాజకీయ పరిణామాల్ని చర్చించినట్లుగా చెబుతున్నారు.

ప్రాంతీయ పార్టీలను బలహీన పర్చాలనే ప్రయత్నం జరుగుతోందని.. సార్వత్రిక ఎన్నికల నాటికి ఇలాంటి వారిని ఒక్కటి చేయటమే తన ప్రయత్నంగా చెప్పుకొచ్చారు. నిజమే.. నితీశ్ చెప్పినట్లుగా మోడీని వ్యతిరేకించే వారంతా కలిసి కట్టుగా జట్టు కడితే తప్పించి.. బీజేపీ అండ్ కోను ఎదుర్కోవటం అంత తేలికైన వ్యవహారం కాదనే మాట వినిపిస్తోంది. అయితే.. ఇప్పటివరకు జరిగినదంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. ఈ భేటీతో కొత్త సమస్య ఎదురవుతుందన్న మాట తెలంగాణ కాంగ్రెస్ లో వినిపిస్తోంది.

నితీశ్ ను ఈ మధ్యనే టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కావటం.. ఇరువురు మధ్య రాజకీయ చర్చలు జరగటంతో పాటు.. భవిష్యత్తులో అనురించిన విధివిధానాల మీద చర్చలు జరిగిన విషయం తెలిసిందే. దీని సారాంశాన్ని తప్పనిసరిగా రాహుల్ కు నితీశ్ వివరించి ఉంటారు. అంటే.. పరోక్షంగా కేసీఆర్ కు కాంగ్రెస్ సాయం అవసరమైందన్నది ఖాయం.

అలాంటప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ తో కలిసి నడవాలన్న ఆసక్తి ఉన్నప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య పోరులో అర్థం లేదనే చెప్పాలి. అన్నింటికి మించి మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అయిన టీఆర్ఎస్.. కాంగ్రెస్.. బీజేపీల మధ్య పోటీ నడుస్తున్న వైనం తెలిసిందే. ఇలాంటి వేళ.. కాంగ్రెస్ - టీఆర్ఎస్ ల మధ్యన తెర వెనుక ఒప్పందం ఉందన్న వాదనను బీజేపీ వినిపిస్తే.. నమ్మేందుకు వీలుందన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కే ఎక్కువ నష్టం ఉంటుందంటున్నారు.

ఎందుకంటే బీజేపీ వారు సైతం తమను ఓడించటం కోసం.. టీఆర్ఎస్ ను గెలిపించటం కోసం కాంగ్రెస్ పరోక్షంగా సాయం చేస్తుందన్న వాదనను బీజేపీ తెర మీదకు తీసుకొస్తుందని.. మొత్తంగాఈ పరిణామాలన్ని రేవంత్ మీద ఒత్తిడికి గురి చేయటంతో పాటు.. మరో ఓటమి అతడి ఖాతాలో చేరే ప్రమాదం ఉందంటున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ - టీఆర్ఎస్ ల మధ్య జరిగే ఒప్పందం రాష్ట్రంలోని రాజకీ పరిణామాల మీద ప్రభావం చూపటం ఖాయమంటున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.