Begin typing your search above and press return to search.

అధికారుల టేబుళ్ళ మీద పాములు...విసిరేసినది ఎవరో తెలుసా...?

By:  Tupaki Desk   |   28 Feb 2022 9:32 AM GMT
అధికారుల టేబుళ్ళ మీద పాములు...విసిరేసినది ఎవరో తెలుసా...?
X
కోపం వస్తే కర్ర విసురుతారు, రాయి విసురుతారు. పాములను విసరడం ఏంటి అంటే అది అంతే. వారికి కోపం అలా తెప్పించారు. పైగా సమస్య కూడా తేలనియని తీరున ఒక పెద్దలా పాములా చుట్టేశారు. దాంతో వారు దెబ్బకు దెబ్బ అన్నట్లుగా తమ ఆయుధంగా పాములనే వాడారు. ఇంతకీ ఈ పాముల కధ ఎక్కడ అంటే మహరాష్ట్రలో జరిగింది.

అక్కడ రైతులు విద్యుత్ కోతలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. కోతలు వాతలూ వద్దూ మహాప్రభో అంటూ వారు అధికారుల ఎదుట ఎంతలా ఆందోళన చేస్తున్నా కూడా ఎవరికీ పట్టడంలేదు, అధికారులు అయితే హాయిగా ఏసీ రూముల్లో ఉంటున్నారు, తప్ప రైతుల గోడు ఏంటి అన్నది అసలు పట్టించుకోవడంలేదు.

ఇక రాత్రిపూట సరైన సమయం చూసి మరీ కోతలు విధిస్తూంటే పొలాల్లోకి అదే టైమ్ లో వెళ్తున్న రైతులు పాము కాటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా ఒకరిద్దరు కాదు, చాలా మందే పాముల బారిన పడి అసువులు బాస్తున్నారు.

మరి తమకు వచ్చిన కష్టం అవతల వారికి తెలియాలీ అంటే పాములతోనే కధ నడపాలీ అనుకున్నారేమో. అందుకే రైతులు పాములను తెచ్చి మరీ అధికారులు పనిచేసే ప్రభుత్వ ఆఫీసుల్లో పెద్ద పెద్ద పాములనే వరస‌బెట్టి వదిలేస్తున్నారుట.

రెండు రోజుల క్రితం డిస్కం అధికారుల టేబుళ్ల మీద పాములు కనిపిస్తే బాబోయ్ అని జడుసుకుని పారిపొవడం వారి వంతు అయింది. అంతటితో ఆగని రైతులు నిన్న రాత్రి ఏకంగా కోల్హాపూర్ లోని కలెక్టరేట్ లో కూడా భయంకరమైన పాములను తెచ్చి మరీ విసిరేశారు.

దీంతో పాముల బాధ ఏంటో అధికారులకు అర్ధమైందో లేదో కానీ జడుపు జ్వరంతో ఆఫీసులంటేనే వారు హడలిపోతున్నారుట. ఒక విధంగా ఇది వినూత్న నిరసన. సర్పాలతో చేస్తున్న సమరం. మరి అధికారులు ఇలా మొద్దుబారిపోయి రైతుల కష్టాలను చూసీ చూడనట్లుగా వదిలేస్తూంటే ఇంతకు తెగించారు అని అంటున్నారు

ఇది తప్పా రైటా అన్న చర్చ ఒక వైపు ఉన్నా సాత్వికంగా ఉంటూ అందరికీ అన్నం పెట్టే అన్నదాతను అంతలా కోపానికి గురి చేసిన వారి విషయంలో ఇలాగే చేయాలీ అన్న వాదనలు కూడా వస్తున్నాయి. మొత్తానికి రానున్న రోజుల్లో ఇలాంటి కొత్త ఆందోళలను కూడా పనిచేయని అధికారులు ఎవరైనా చవిచూడాల్సి వస్తుంది అని మహారాష్ట్ర రైతాంగం లోకానికి చాటి చెప్పిందన్న మాట.