Begin typing your search above and press return to search.

ఏపీలో ప్ర‌భుత్వ టీచ‌ర్ల ఇబ్బందులు తొల‌గిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   22 Aug 2022 7:30 AM GMT
ఏపీలో ప్ర‌భుత్వ టీచ‌ర్ల ఇబ్బందులు తొల‌గిన‌ట్టేనా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల హాజ‌రుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం యాప్‌ను తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ప‌లుచోట్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ (మ‌న్యం) ప్రాంతాల్లో నెట్‌వ‌ర్క్ స‌మ‌స్య‌ల కార‌ణంగా యాప్ ప‌నిచేయ‌క‌పోవ‌డంతో ఉపాధ్యాయుల హాజరు న‌మోదు చేసుకోలేక‌పోతున్నారు. దీంతో వారు స్కూల్ ను విడిచిపెట్టి సిగ్న‌ల్స్ వ‌స్తున్న చోట‌కు వెళ్లి హాజ‌రు న‌మోదు చేసుకోవాల్సి వ‌స్తుంది. అందులోనూ నిర్దేశిత స‌మ‌యం 9 గంట‌ల‌కు ఒక్క నిమిషం ఆల‌స్య‌మైనా ఆబ్సెంట్ గా న‌మోద‌వుతుంద‌ని ప్ర‌భుత్వం చెప్ప‌డంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళ‌న చెందారు. మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాలు కూడా దీనిపై విమ‌ర్శ‌లు చేశాయి. దీంతో ప్ర‌భుత్వం దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముఖ హాజ‌రును తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న టీచ‌ర్ల‌కు జ‌గ‌న్‌ ప్ర‌భుత్వం కొంత ఊర‌ట‌ను క‌ల్పించింది. స్కూల్ నిర్దేశిత స‌మ‌యం 9 గంట‌ల‌కు ప‌ది నిమిషాల‌ను గ్రేస్ పీరియ‌డ్‌గా నిర్ణ‌యించింది. అంటే.. టీచ‌ర్లు గ‌రిష్టంగా ప‌ది నిమిషాలు ఆల‌స్యంగా వ‌చ్చినా హాజ‌రు యాప్‌లో న‌మోదు చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది.

ఈ మేర‌కు ముఖ హాజ‌రు యాప్‌లో కొన్ని మార్పులు చేస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. నెట్‌వ‌ర్క్ స‌మ‌స్య‌తో ఇంట‌ర్నెట్ లేక‌పోయినా ఆఫ్‌లైన్ విధానంలో హాజ‌రు న‌మోదు చేసుకోవ‌చ్చ‌ని ఈ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

ఉపాధ్యాయులు ఫొటో తీసిన స‌మ‌యాన్ని యాప్ న‌మోదు చేస్తుంది. ఆ త‌ర్వాత‌ సిగ్న‌ల్స్ వ‌చ్చిన వెంట‌నే ఆటోమేటిక్‌గా ఫొటో తీసిన స‌మ‌యం ఆధారంగా హాజ‌రుప‌డుతుంద‌ని ప్ర‌భుత్వం త‌న ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. అలాగే ఎవ‌రైనా ఉపాధ్యాయుల‌కు ఆండ్రాయిడ్ ఫోన్ లేక‌పోతే ప్ర‌ధానోపాధ్యాయులు లేదా ఇత‌ర టీచ‌ర్ల ఫోన్ల ద్వారా హాజ‌రు వేసే వెసులుబాటు కూడా క‌ల్పించింది.

కాగా డిప్యుటేష‌న్, ఆన్ డ్యూటీ, శిక్ష‌ణ త‌దిత‌ర ప‌నుల్లో ఉపాధ్యాయుల‌ హాజ‌రు న‌మోదుకు సంబంధించి లీవ్ మాడ్యుల్‌ను త్వ‌ర‌లో విడుద‌ల చేస్తామని ప్ర‌భుత్వం తెలిపింది. టీచ‌ర్లు, హెచ్ఎంల సెల‌వుల వివ‌రాల‌ను సంబంధిత అధికారులు వెంట‌నే యాప్‌లో న‌మోదు చేయాల‌ని సూచించింది.

ఆగ‌స్టు నెలాఖ‌రు వ‌ర‌కు ముఖ హాజ‌రు విధానాన్ని పైల‌ట్ ప్రాజెక్టుగా ప‌రిగ‌ణిస్తామ‌ని ప్ర‌భుత్వం తెలిపింది. ఏవైనా సాంకేతిక స‌మ‌స్య‌లుంటే త‌మ దృష్టికి తీసుకొస్తే ప‌రిష్క‌రిస్తామ‌ని వెల్ల‌డించింది. టీచ‌ర్లంతా యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని.. హాజ‌రు న‌మోదు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ప్ర‌భుత్వం ఆదేశించింది. ఉపాధ్యాయుల హాజ‌రును త‌ప్ప‌నిస‌రిగా యాప్‌లో మాత్ర‌మే న‌మోదు చేయాల‌ని విస్ప‌ష్ట ఆదేశాలు జారీ చేసింది.