Begin typing your search above and press return to search.

చినబాబును మంత్రి పదవిలోకి ఎలా తెస్తారంటే..?

By:  Tupaki Desk   |   6 April 2016 11:30 AM GMT
చినబాబును మంత్రి పదవిలోకి ఎలా తెస్తారంటే..?
X
కొన్ని విషయాల్లో ఆచితూచి నిర్ణయం ఎంత ముఖ్యమో.. మరికొన్ని విషయాల్లో ఆలస్యం అంతే నష్టం. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించినట్లు కనిపిస్తోంది. తన కుమారుడ్ని అందలం ఎక్కించాలన్న ఆలోచన ఉన్నా.. అలా చేస్తే.. కుటుంబ పాలనలో బందీ అయిపోయాయన్న భావన కలిగి.. విమర్శలు చెలరేగుతాయన్న ఉద్దేశంలో బాబు ఉన్నట్లు చెబుతారు. అయితే.. ఇలాంటి వైఖరి వల్ల లోకేశ్ కు జరిగే నష్టం ఎక్కువని చెప్పటమే కాదు.. యూపీఏ హయాంలో రాహుల్ విషయంలో సోనియాగాంధీ వ్యవహరించిన తీరు మాదిరే.. లోకేశ్ విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్న మాట బాబు దగ్గర బలంగా వాదన వినిపించటంతో.. చినబాబును ఎలా మంత్రిని చేయాలన్న దానిపై పార్టీలో చర్చ స్టార్ట్ అయ్యింది.

అయితే.. దీనిపై ఒక వ్యూహం ఖరారు అయినట్లుగా చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దింపి.. ఈజీగా మంత్రిని చేసేసే వీలున్నప్పటికీ.. అదేమాత్రం సరికాదన్న అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రజలే ఎన్నుకునేలా ఉంటే ఆదరణ ఎక్కువగా ఉండటంతో పాటు.. బలమైన నేతగా అవతరించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అందుకే.. ఉప ఎన్నిక ద్వారా లోకేశ్ ను ఎమ్మెల్యేగా గెలిపించి.. ఏపీ మంత్రి వర్గంలోకి తీసుకురావాలన్నది వ్యూహంగా చెబుతున్నారు. ఇందుకు ఏపీ రాజధాని దగ్గర ప్రాంతాల్లో చంద్రబాబును దేవుడికి ప్రతిరూపంగా భావిస్తున్న ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి.. అందులో లోకేశ్ ను బరిలోకి దింపాలన్న ఆలోచనను చెబుతున్నారు. దీనికి తగ్గట్లే కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గాన్ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తన పదవికి రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.

రాజధాని ఎంపిక నిర్ణయం కారణంగా.. ఇక్కడి ప్రజల బతుకుల్లో అనూహ్య మార్పులు వచ్చిన నేపథ్యంలో.. రాజధాని ప్రాంతంగా తమ ప్రాంతాన్ని ఎంపిక చేయటం పట్ల పెద్ద ఎత్తున సానుకూలత వ్యక్తమవుతోంది. లోకేశ్ బరిలోకి దిగిన పక్షంలో ఈ నియోజకవర్గం పార్టీకి కంచుకోటలా మారుతుందన్న భావన వ్యక్తమవుతోంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే.. లోకేశ్ ను అర్జెంట్ గా ఎమ్మెల్యేని చేసేసి.. మంత్రి పదవి కట్టబెట్టాలన్న ఆలోచనలో అధినేత చంద్రబాబులో ఉన్నట్లుగా చెప్పొచ్చు. అధినేత తలుచుకోవాలే కానీ ఏం జగరకుండా ఉంటుంది చెప్పండి.