Begin typing your search above and press return to search.

ఆ నిర్మాతకు గెలుపు అంత వీజీ కాదా?

By:  Tupaki Desk   |   29 Nov 2018 4:35 AM GMT
ఆ నిర్మాతకు గెలుపు అంత వీజీ కాదా?
X
ఈ రోజుల్లో ఎన్నికలు వస్తే ఏ ప్రధాన పార్టీ అయినా టికెట్ల కేటాయింపులో ప్రధానంగా చూస్తున్న అంశాలు కులం, డబ్బు. దీన్ని బట్టే టికెట్లు కేటాయిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో కూడా ఈ రెండు విషయాలూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. సినీ నిర్మాత.. భవ్య సిమెంట్స్ అధినేత ఆనంద్ ప్రసాద్‌కు శేరిలింగంపల్లి టికెట్ కేటాయించడంలోనూ ఈ రెండు అంశాలే కీలకమయ్యాయి. నియోజకవర్గంలో కమ్మ ఓట్లు దండిగా ఉండటంతో ఆ సామాజిక వర్గానికి చెందిన ఆనంద్ ప్రసాద్ కు టికెట్ ఇచ్చారు. పైగా ఆయన డబ్బు కూడా బాగా ఖర్చు పెట్టగలరని భావించారు. ఐతే నల్లేరుపై నడకే అనుకున్న ఆయన విజయం అంత తేలిక కాదని క్షేత్రస్థాయిలో పరిస్థితి చూసిన వాళ్లు అంటున్నారు.

ఇక్కడ టీఆర్ ఎస్ తరఫున బరిలో ఉన్న ఆరెకపూడి గాంధీ సైతం కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థే. ఆనంద్ ప్రసాద్ కు దీటుగా ఆయన కమ్మ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. పైగా డబ్బు కూడా బాగానే ఖర్చు చేస్తున్నారు. ఇక అధికార పార్టీకి ఉన్న వేవ్ కూడా ఆయనకు కలిసొస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆనంద్ ప్రసాద్ గెలుపు అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తన విజయం పక్కా అన్న ధీమాతో బరిలోకి దిగిన ఆనంద్ ప్రసాద్.. భారీగా ఖర్చు చేస్తున్నారని.. రోజుకు రూ.50 లక్షల దాకా ప్రచార ఖర్చు వస్తోందని.. మొత్తంగా ఎన్నికలయ్యే సరికి ఆయన రూ.25 కోట్లకు పైగా ఖర్చు చేయొచ్చని అంటున్నారు. మరి ఇంతా ఖర్చు చేసి ఫలితం తేడా వస్తే పరిస్థితి ఏంటో చూడాలి. మహాకూటమికి వచ్చే ఊపు మీదే ఆయన విజయం ఆధారపడి ఉందన్నది స్పష్టం.