Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌లోకి దిల్ రాజు.. నిజామాబాద్ నుంచి పోటీ? పొలిటిక‌ల్ గుస‌గుస‌

By:  Tupaki Desk   |   13 Jun 2022 12:30 AM GMT
టీఆర్ ఎస్‌లోకి దిల్ రాజు.. నిజామాబాద్ నుంచి పోటీ?  పొలిటిక‌ల్ గుస‌గుస‌
X
తెలుగు సినీ రంగానికి చెందిన‌ ప్రముఖ నిర్మాత దిల్ రాజు రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని భావిస్తున్న‌ట్లు ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. వాస్త‌వానికి ఇది కొత్తేమీ కాదు. గ‌త ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్ర స‌మితి నుంచి పోటీచేయాల‌ని దిల్ రాజు ప్ర‌య‌త్నించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. త‌ర్వాత ఏమైందోకానీ ఆయ‌న పోటీకి దూరంగా ఉన్నారు. విజ‌య‌వం త‌మైన నిర్మాత‌గా, పంపిణీదారుడిగా పేరు గ‌డించిన దిల్ రాజు స‌క్సెస్ రేట్ చాలా పెద్ద‌ది. ఇప్పుడు ఆయ‌న చూపు రాబోయే ఎన్నిక‌ల‌పై ప‌డింది.

నిజామాబాద్ ప్రాంతంలో ఆల‌యాన్ని నిర్మించి అక్క‌డి స్థానికుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. సొంత జిల్లా నిజామాబాద్ కాబ‌ట్టి ఎన్నిక‌ల్లో పోటీ కూడా అక్క‌డినుంచే ఉండ‌బోతోంది. ఎమ్మెల్యేగా పోటీచేస్తారా? ఎంపీగా పోటీచేస్తారా? అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది. అయితే పార్టీ కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర స‌మితే కావ‌చ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. శాసనమండలి, రాజ్యసభ లాంటివి కాకుండా నేరుగా ప్రజల మధ్యే పోటీచేసి ఎమ్మెల్యేగాకానీ, ఎంపీగాకానీ ఎన్నికవ్వాలనేది దిల్ రాజు ఆలోచన అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఇదిలావుంటే, ఇప్ప‌టి వ‌ర‌కు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వ‌చ్చిన వారిని చూస్తే.. చాలా త‌క్కువ మంది స‌క్సెస్ సాధించా రు. ఎన్టీఆర్ త‌ర్వాత‌.. ఆ రేంజ్‌ను అందుకున్న సినీ ప్ర‌ముఖులు మ‌న‌కు క‌నిపించ‌డం లేదు. చిరంజీవి పార్టీ పెట్టి మ‌రీ.. దానిని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఇక‌, ఆయ‌న సోద‌రుడు ప‌వ‌న్ పార్టీ పెట్టి.. త‌ల‌కింద‌లు ప‌డుతున్నారు. వీరిమాట అలా ఉంచితే.. మిగిలిన వారిలోనూ చాలా మంది పోసాని ముర‌ళి, ఆలీ.. ఇలా ఎంతో మంది వ‌చ్చినా.. రాజ‌కీయంగా నిలదొక్కుకోలేక పోయారు. ఈ ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు దిల్ రాజు వంతు వ‌చ్చింద‌ని చెబుతున్నారు.

వాస్త‌వానికి సినీ రంగంలో ఉండే గ్లామ‌ర్‌..ను రాజ‌కీయంగా వాడుకునేందుకు న‌టులు, నిర్మాత‌లు కూడా ప్ర‌య‌త్నాలు చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. అశ్వ‌నీద‌త్ విజ‌య‌వాడ నుంచి ఎంపీగా టీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఇక‌, విజ‌య‌శాంతి.. ఒకే ఒక్క‌సారి విజ‌యం సాదించారు. అదేస‌మ‌యంలో న‌టుడు ముర‌ళీ మోహ‌న్ కూడా రాజ‌మండ్రి నుంచి ఒక‌సారి ఎంపీగా గెలిచారు. ఇలా .. అతి త‌క్కువ మంది మాత్ర‌మే రాజ‌కీయాల్లో విజ‌యం సాధించినా.. ఎక్కువ కాలం పేరు తెచ్చుకోలేక పోయారు. త‌మ‌కంటూ.. ఒక ప్ర‌త్యేక వేదిక‌ను ఏర్పాటు చేసుకోలేక పోయారు. ఈ నేప‌థ్యంలో దిల్ రాజు అరంగేట్రం ఎలా ఉంటుందోన‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది.