Begin typing your search above and press return to search.

రూ.10ల‌క్ష‌ల విరాళం అంటే టికెట్ ఓకేనా?

By:  Tupaki Desk   |   25 Oct 2018 5:33 AM GMT
రూ.10ల‌క్ష‌ల విరాళం అంటే టికెట్ ఓకేనా?
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబుపై ఆయ‌న బావ‌మ‌రిది క‌మ్ వియ్యంకుడు బాల‌య్య ప్ర‌భావం చూపిస్తున్నారా? అంటే అవున‌నే మాట బ‌లంగా వినిపిస్తోంది. తెలంగాణ‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టికెట్ల ప్ర‌య‌త్నాలు చేస్తున్న వారు ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్న ప‌రిస్థితి. తెలంగాణ‌లోని విప‌క్షాలు మ‌హాకూట‌మిగా (కాంగ్రెస్‌.. టీడీపీ.. టీజేఎస్.. సీపీఐ) ఏర్ప‌డి బ‌రిలోకి దిగ‌నున్న నేప‌థ్యంలో టీడీపీ అభ్య‌ర్థుల గెలుపు అవ‌కాశాలు పెరిగాయి.

దీంతో.. మొన్న‌టి వ‌ర‌కూ పార్టీని ప‌ట్టించుకోని వారు.. పార్టీకి సంబంధం లేని వారు సైతం ఇప్పుడు టీడీపీ టికెట్ల కోసం ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం చేస్తున్న ప‌రిస్థితి. టీడీపీకి అనుకూలంగా ఉంద‌ని భావించే శేరిలింగంప‌ల్లి అసెంబ్లీ టికెట్ కోసం టీడీపీకి చెందిన మువ్వా స‌త్య‌నారాయ‌ణ ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఆ మ‌ధ్య‌న టీడీపీ నుంచి టీఆర్ ఎస్‌ కు వెళ్లి.. ఈ మ‌ధ్య‌నే తిరిగి టీడీపీలో చేరిన ఆయ‌న‌కు టికెట్ క‌న్ఫ‌ర్మ్ అన్న సంకేతాలు ఎప్పుడో అందాయి. అయితే.. ఈ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో సీమాంధ్రులు అధికంగా ఉండ‌టం.. ఐటీ ఉద్యోగులు ఎక్కువ‌గా ఉండే ప్రాంతం కావ‌టంతో టీడీపీకి అనుకూలంగా ఉంటుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. దీంతో.. కాసింత అర్థ‌బ‌లం.. అంగ‌బ‌లం ఉన్న వారంతా ఇప్పుడు టీడీపీ టికెట్ కోసం ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం చేస్తున్న ప‌రిస్థితి.

తాజాగా టికెట్ రేసులోకి వ‌చ్చారు ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌.. బిల్డ‌ర్ క‌మ్ సినీ నిర్మాత భ‌వ్యా ఆనంద‌ప్ర‌సాద్‌. ఈ మ‌ధ్య‌నే ఆయ‌న బాల‌య్య‌తో పైసా వ‌సూల్ సినిమాను చేశారు. ఆ ప‌రిచ‌యంతో బాల‌య్య ద్వారా టికెట్ ప్ర‌య‌త్నాలు చేసిన ఆయ‌న‌.. బాబు కంట్లో ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. త‌న‌కున్న అర్థ బ‌లాన్ని ప్ర‌ముఖంగా చూపటం.. ఆనంద‌ప్ర‌సాద్‌ కు ఎట్టి ప‌రిస్థితుల్లో టికెట్ ఇవ్వాల‌న్న బాల‌య్య మాట బాబు మీద ప్ర‌భావాన్ని చూపుతుందంటున్నారు.

పార్టీ టికెట్ ఇస్తాన‌న్న మాట‌తో పార్టీలోకి వ‌చ్చి ప‌ని చేస్తున్న మువ్వాకు ఆనంద‌ ప్ర‌సాద్ కార‌ణంగా దెబ్బ ప‌డే అవ‌కాశాలు అంత‌కంత‌కూ పెరుగుతున్న‌ట్లు చెబుతున్నారు. తాజాగా సిక్కోలుపై విరుచుకుప‌డిన తిత‌లీ తుపాను చేసిన తీవ్ర న‌ష్టంగా స్పందించిన ఆనంద‌ప్ర‌సాద్ రూ.10ల‌క్ష‌ల విరాళాన్ని ఇవ్వ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. తిత‌లీ న‌ష్టానికి విరాళంగా ఆనంద‌ప్ర‌సాద్ చేత రూ.10ల‌క్ష‌లు ఇప్పించ‌ట‌మంటే.. టికెట్‌ కు సంబంధించి బ‌ల‌మైన హామీ వ‌చ్చి ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఎంత బాల‌య్య చెబితే మాత్రం.. గ‌తంలో బాబు తానిచ్చిన హామీని మ‌ర్చిపోతారా? అన్న‌ది కిందిస్థాయి నాయ‌కుల మాట‌గా వినిపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ పార్టీ జెండా మోసిన చరిత్ర లేని ఆనంద‌ప్ర‌సాద్‌.. ఇప్పుడు ఉన్న‌ట్లుండి టికెట్ రేసులోకి రావ‌టం.. అధినేత‌కు ద‌గ్గ‌ర‌గా వెళ్ల‌టంపై విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

పార్టీలో ఎప్పుడూ ఇంతేన‌ని.. మొద‌ట్నించి క‌ష్ట‌ప‌డినోళ్ల‌కు ఎలాంటి ఫ‌లితం ఉండ‌ద‌ని.. ఉన్న‌ట్లుండి ఊడిప‌డ్డోళ్లు ప‌ద‌వుల్ని.. అవ‌కాశాల్ని త‌న్నుకుపోతార‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి.. శేరిలింగంప‌ల్లిలో బాబు త‌న మాట‌కు క‌ట్టుబ‌డ‌తారా?. త‌న వియ్యంకుడి మాట‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ద‌క్కుతుందా? అన్న‌ది టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేసే దాంట్లో తేలిపోతుందంటున్నారు.