Begin typing your search above and press return to search.

ట్యాంక్‌ బండ్‌ పై కేసీఆర్ విగ్ర‌హం

By:  Tupaki Desk   |   30 Jun 2016 4:54 AM GMT
ట్యాంక్‌ బండ్‌ పై కేసీఆర్ విగ్ర‌హం
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్‌ జి. హరగోపాల్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. సుదీర్ఘ పోరాటం త‌ర్వాత వ‌చ్చిన తెలంగాణ‌కు ముఖ్య‌మంత్రిగా ఉన్న కేసీఆర్ మంచి ప‌నులు చేయాల‌ని ఆకాంక్షించారు. అలా చేస్తే కేసీఆర్ విగ్ర‌హం ట్యాంక్ బండ్‌ పై పెడ‌తామ‌ని ఆఫ‌ర్ ఇచ్చారు. అయితే తేడా వ‌స్తే గ‌తం పున‌రావృత్తం అవుతుంద‌ని హెచ్చ‌రించారు. అందుకే విగ్ర‌హం కావాలో వ‌ద్దో కేసీఆరే తేల్చుకోవాల‌ని వ్యాఖ్యానించారు.

తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీజేఏసీ) ఆధ్వర్యంలో 'తెలంగాణలో విద్యావ్యవస్థ సమస్యలు-పరిష్కారాలు' అనే అంశంపై విద్యాసదస్సు జరిగింది. ముఖ్యఅతిధిగా హాజరైన హరగోపాల్‌ మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఇలా జరుగుతుందని ఊహించలేదని చెప్పారు. #తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని అందరూ ఆశించారు. ప్రభుత్వ విద్యాలయాలు మెరుగవుతాయని భావించారు. రెండేండ్లయినా కొత్త విద్యావిధానం రూపొందించలేదు. పాలకులకు దూరదృష్టి ఉండాలి. 50 ఏండ్ల తర్వాత తెలంగాణ మొదటి క్యాబినెట్‌ ఏం చేసిందో చరిత్ర చెప్పాలి. ప్రజలు ఆ పనులను గుర్తుంచుకోవాలి. పాలకులు శాశ్వతం కాదు. పాలకులు చేసిన విధానాలు - పాటించిన విలువలు శాశ్వతం. మంచిచేస్తే ట్యాంక్‌ బండ్‌ పై విగ్రహం పెడతారు. లేదంటే గతం పునరావృతం అవుతుంది. విగ్రహం కావాలా - వద్దా అనేది కేసీఆర్‌ ప్రభుత్వం తేల్చుకోవాలి' అని హెచ్చరించారు.

వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సిబ్బంది నియామకాలు టీఎస్‌ పీఎస్సీ నిర్వహించాలా, వద్దా అనే అంశంపై హాల్‌ మీటింగ్‌కు అనుమతి ఇవ్వకుండా పోలీసులు మోహరించడం సమంజసం కాదని హ‌ర‌గోపాల్ అన్నారు. నాలుగున్నర దశాబ్ధాల కాలంలో ఎన్నడూ ఇలాంటి దారుణ పరిస్థితి చూడలేదన్నారు. హాల్‌ మీటింగ్‌ కే అనుమతి ఇవ్వని వారు, బహిరంగ సమావేశాన్ని జరగనిస్తారా అని భయమేసిందని చెప్పారు. వర్సిటీల స్వయంప్రతిపత్తి గురించి జయశంకర్‌ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. తలనొప్పి అంటే తలకాయ తీసేస్తారా - వర్సిటీల నియామకాల్లో వీసీ తప్పుచేస్తే కమిటీ వేసి నిర్ధారించాలని హ‌ర‌గోపాల్‌ సూచించారు. 1983లో ఎన్టీఆర్‌ హయాం నుంచి వర్సిటీల విధ్వంసం ప్రారంభమైందని చెప్పారు. తెలంగాణలో విశ్వవిద్యాలయాలుంటాయా అనే పరిస్థితికి దిగజారాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యాపకుల నియామకాల్లేవని - గ్రాంట్లు పెంచడంలేదని - వీసీల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. వీసీల నియామకాలకు ఎన్నేండ్లు కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో నిపుణులు - విద్యావేత్తలు - మేధావులం దరితో కలిపి కమిటీ వేయాలని విద్యావిధానం రూపొందించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు ఇలాంటి తెలంగాణ కోరుకోలేదని చెప్పారు. కాంగ్రెస్‌ తప్పుడు విధానాలు అవలంబించి 44 లోక్‌ సభ సీట్లకు పడిపోయిందని గుర్తు చేశారు. తెలంగాణ వస్తే శ్రీచైతన్య - నారాయణ వంటి కార్పొరేట్‌ విద్యాసంస్థలుండబోవని సమాజం ఆశించిందని, కనీసం ఫీజులపై నియంత్రణ ఉంటుందని భావించిందని చెప్పారు. తెలంగాణ వచ్చినా పాత విధానాలే కొనసాగిస్తే ప్రత్యేక రాష్ట్రం ఎందుకని హ‌ర‌గోపాల్‌ ప్రశ్నించారు.