Begin typing your search above and press return to search.

‘ఆచార్య’ పాఠం పెట్టటానికి రెండేళ్లు కావాలా?

By:  Tupaki Desk   |   7 Aug 2016 5:05 AM GMT
‘ఆచార్య’ పాఠం పెట్టటానికి రెండేళ్లు కావాలా?
X
తెలంగాణ రాష్ట్ర సర్కారు విధానాలు చాలా చిత్రంగా కనిపిస్తాయి. చేతిలోఅధికారం ఉండి.. చటుక్కున పూర్తి అయ్యే పనులు పూర్తి చేసేందుకు రెండేళ్లకు పైనే సమయం తీసుకునే తీరు కేసీఆర్ సర్కారులోనే కనిపిస్తుంది. తెలంగాణ ఏర్పాటుకు స్ఫూర్తిదాత.. తెలంగాణ ఉద్యమానికి వ్యూహకర్త అయినా ఆచార్య జయశంకర్ విషయంలో రాష్ట్ర సర్కారు అనుసరించిన తీరును పలువురు తెలంగాణవాదులు తప్పు పడుతున్నారు. జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించినట్లు తెలంగాణ ప్రభుత్వం కనిపించినా.. ఏదైతే చేయాలో ఆ పనిని చేయటం లేదన్నవిమర్శలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ రాక ముందు సాధ్యం కానివెన్నో తెలంగాణ ఏర్పాటుతో సాధ్యమయ్యే వీలుంది. ‘సర్’ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా మార్చటానికి ఎంత సమయం పడుతుంది? దీనికి ఎవరి అనుమతి కావాలి? తెలంగాణ రాష్ట్ర పాఠ్యాంశాలుగా ఆచార్య జయశంకర్ జీవిత చరిత్రకు మించిన పాఠం ఏం ఉంటుంది? కానీ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు ముగిసి రెండు నెలలకు దగ్గర పడుతున్నా.. ఇప్పటికే తెలంగాణ పాఠ్యాంశంగా జయశంకర్ జీవిత చరిత్ర లేకపోవటం ఎంతవరకు సమంజసమన్న ఆరోపణను పలువురు తెలంగాణ వాదులు వినిపిస్తారు.

జయశంకర్ వాదనలు.. సిద్ధాంతాలే తెలంగాణ ఉద్యమానికి కొత్త కిక్కు వచ్చిందని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా మార్చేందుకు వీలుగా వ్యూహాన్ని సిద్ధం చేయటానికి అప్పట్లో కేసీఆర్.. జయశంకర్ మాష్టారితో కూర్చొని ఎంతో మథనం చేశారు. ఆయన చెప్పిన మాటలు.. వేసిన బాటలో అడుగులు వేసిన కేసీఆర్.. తెలంగాణ సాధన పూర్తి చేశారు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ ఎంత కీలకమో.. ఆయన్నుఆ దిశగా నడిచేలా చేసి.. కొండంత స్ఫూర్తినిచ్చిన జయశంకర్ మాష్టారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

అంతటి కీలకమైన వ్యక్తికి సంబంధించిన జీవిత చరిత్రను తెలంగాణ పాఠ్యాంశంగా మార్చటానికి ప్రభుత్వానికి ఏళ్లకు ఏళ్లు ఎందుకు పడుతుంది? జయశంకర్ జీవిత చరిత్రగా పాఠాన్ని రాయటానికి ఏళ్లు అవుసరమవుతాయా? అన్న ప్రశ్న ఎదురవుతోంది. తాజాగా జయశంకర్ జయంతి ఉత్సవాల సందర్భంగా మంత్రి కేటీఆర్ మాష్టారి జీవితచరిత్ర పాఠ్యాంశంపై స్పందించారు. జయశంకర్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకునేందుకు వీలుగా త్వరలో పాఠ్యాంశంగా చేరుస్తామని వ్యాఖ్యానించారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు.. తెలంగాణ రూపురేఖలు మార్చటం రెండేళ్లలో సాధ్యం కాకపోవచ్చు. కానీ.. జయశంకర్ మాష్టారి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేయటానికీ రెండేళ్లకు పైనే పడుతుందా? అన్నదే సందేహం. ఈ డౌట్ ను తీర్చే మొనగాడు తెలంగాణ సర్కారులో ఎవరైనా ఉన్నారా..?