Begin typing your search above and press return to search.

ఎట్ట‌కేల‌కు కోదండ‌రాం తేల్చేశాడు బాస్‌

By:  Tupaki Desk   |   12 Nov 2018 4:18 PM GMT
ఎట్ట‌కేల‌కు కోదండ‌రాం తేల్చేశాడు బాస్‌
X
మహాకూటమి చర్చల్లో హై డ్రామా చోటు చేసుకుంటోంది. తమకు తగిన సీట్లు ఇవ్వకపోతే కూటమి నుండి వైదొలుగుతామని టీజేఎస్ - సీపీఐలు కాంగ్రెస్‌ కు అల్టిమేటం జారీ చేశాయి. టీజేఎస్ - సీపీఐ అల్టిమేటం నేపథ్యంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గింది. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడతో ఫోన్‌ లో కాంగ్రెస్ నేతలు ఉదయం నుంచి మంతనాలు జరిపారు. మ‌రోవైపు కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితికి ఈ మధ్యే అగ్గిపెట్ట గుర్తును ఎన్నికల సంఘం కేటాయించిన సంగ‌తి తెలిసిందే, అయితే - ఆ గుర్తు ప్రజల్లోకి ఇంకా వెళ్లలేదు. ఈ నేప‌థ్యంలో మ‌హాకూట‌మికి పెద్ద‌న్న‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న కాంగ్రెస్ పార్టీ కోదండ‌రాంను హెచ్చరిస్తున్న‌ట్లు స‌మాచారం. అగ్గిపెట్టె గుర్తుతో రిస్క్ చేయడం ఎందుకని కోదండ‌రాంను ప్ర‌శ్నిస్తున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి అభ్యర్థులు కాంగ్రెస్ గుర్తుపైనే పోటీ చేయాల‌ని ఒత్తిడి చేస్తోంది. ఇలా ఆస‌క్తిక‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో టీజేఎస్‌ అధినేత - ప్రొఫెసర్ కోదండరాం మీడియా ముందుకు వ‌చ్చారు. తెలంగాణ జనసమితి అభ్యర్థుల జాబితాను నవంబర్ 13న సాయంత్రం లోపు ప్రకటిస్తామని తెలిపారు.

మహాకూటమిలోని అందరిని కలుపుకుని టీజేఎస్ పోటీ చేస్తుందని - సీపీఐని కూడా కలుపుకుని ముందుకు వెళ్లాలని కోదండరాం సూచించారు. ప్రజా - తెలంగాణ ఉద్యమాల్లో సీపీఐ కీలకపాత్ర పోషించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. తమ పార్టీ గురించి బూత్ కమిటీలతో కలిసి విస్తృత ప్రచారం చేస్తామని చెప్పారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది ఇంకా ఫైనల్ కాలేదన్నారు. కామన్ గుర్తుపై కాకుండా తమ పార్టీ గుర్తు అయిన ‘అగ్గిపెట్టె’పైనే పోటీ చేస్తామని చెప్పారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి నేప‌థ్యంలో కోదండ‌రాం క్లారిటీ ఇవ్వ‌డం గ‌మనార్హం. టీజేఎస్‌ కు ఎన్నికల సంఘం అగ్గిపెట్టె గుర్తు కేటాయించినప్ప‌టికీ ఈ గుర్తు గురించి, పార్టీ అభ్య‌ర్థుల గురించి దాదాపుగా 25 రోజులు మాత్ర‌మే ఉన్న ప్ర‌చార స‌మ‌యంలో ఎలా జ‌నాల్లోకి తీసుకువెళ్ల‌గ‌ల‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు భావిస్తూ హ‌స్తం గుర్తుపై పోటీ చేయాలంటున్నారు. ఓట‌ర్లు అగ్గిపెట్టె గుర్తును గుర్తుప‌ట్ట‌క‌పోయి కారు గుర్తును వెంట‌నే గుర్తుప‌డితే టీఆర్ ఎస్‌ కు మేలు జ‌రుగుతుంద‌ని హ‌స్తం పార్టీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. అందుకే సుప‌రిచిత‌మైన హ‌స్తం గుర్తుపై పోటీ చేయాల‌ని కాంగ్రెస్ ఒత్తిడి చేస్తున్న‌ట్లు స‌మాచారం. కాగా, ఈ విష‌యంలో ఎన్నిక‌ల అధికారుల స‌ల‌హా మేర‌కు ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ముందుకు సాగి తాము అగ్గిపెట్టే గుర్తుపైనే బ‌రిలో దిగుతామ‌ని తేల్చిచెప్పారు.