Begin typing your search above and press return to search.

కోదండ‌రాం రెడ్డి... ఇక ఫుల్ టైం ఫ్రీ

By:  Tupaki Desk   |   23 Sep 2015 7:42 AM GMT
కోదండ‌రాం రెడ్డి... ఇక ఫుల్ టైం ఫ్రీ
X
కోదండరామ్ రెడ్డి. అస‌లు పేరుతో కంటే కోదండ‌రామ్ గానే ఆయ‌న సుప‌రిచితుడు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగా జేఏసీ సారథి. ఉద్యోగ సంఘాల్ని - రాజకీయ పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు తీసుకెళ్ళిన ఘనత ఈ ప్రొఫెసర్‌ది. ఆయన సారథ్యంలో జేఏసీ చేపట్టిన ప్రతీ కార్యక్రమంలో కోదండరామ్‌ది కీలక పాత్రయింది. తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత ప్రొఫెసర్‌ గా పిల్లలకు మళ్ళీ పాఠాలు చెప్పడం మొదలుపెట్టిన కోదండరాం ఈ నెలాఖరుకు రిటైర్‌ కాబోతున్నారు. ఆ తర్వాత ఆయన ఏం చేయబోతున్నారు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది .

రాష్ట్రం ఏర్పాటైనా తర్వాత కోదండరామ్‌... టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు దూరం గా ఉంటున్నారు. అధికార పార్టీకి, అధికార పక్షానికి కొంత దూరంగానే ఉంటూ వచ్చారు. ఇప్పుడున్న విపక్షాలు ధీటుగా ఉండటంలేదు కాబ‌ట్టి కోదండరాం ప్రతిపక్ష పోషిస్తారా? తెలంగాణ ప్రభుత్వాన్ని ఎదురించేందుకు సిద్ధమవుతారా అన్నది చర్చనీయాంశమవుతోంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు తన ఉద్యోగం తాను చేసుకుంటూనే రైతు సమస్యలపై తెలంగాణ కోదండ‌రాం అంతటా పర్యటించి వాటిపై గళమెత్తారు. ఉద్యోగ విరమణ చేస్తున్న క్రమంలో అధికార పక్షానికి దగ్గరవ్వాలా? లేక ప్రతిపక్షంగానే ఉండాలా అన్నది ఆయన తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది. రెండు మూడు నెలలుగా ఈ చర్చ జరుగుతున్నా ఇంకా ఆయన ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అయితే కోదండరామ్‌ దూకుడుగా వ్యవహరించకపోవచ్చన్నది ఆయన వ్యవహారశైలి తెలిసిన వారి మాట.

కోదండ‌రాం ఇప్పటివరకైతే ఆయన ప్రజాసంఘాలతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా పనిచేసేందుకు ప్రజాసంఘాలు ధైర్యంచేస్తాయా అన్నది కీలకమే. కోదండరాం మనసులో కూడా టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా పనిచేయాలన్న ఆలోచన లేదని స‌మాచారం. అయితే అధికార పార్టీ వ్యతిరేకి అన్న ముద్రపడకుండా... ప్రజల సమస్యలపై ఫోకస్‌ పెట్టాలన్న అభిప్రాయంతో ఆయన ఉన్నారని సమాచారం.

మొత్తంగా నొప్పించక తానొవ్వక అన్న వైఖరితో ముందుకెళ్లడమే మంచిదని కోదండరాం అనుకుంటున్నారట. రాజ‌కీయ భ‌విష్య‌త్ పై ఇప్పటివరకైతే ఆయనింకా ఏ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. ఉద్యోగ విరమణ సమయానికి సన్నిహితులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.