Begin typing your search above and press return to search.

5 సెకన్లలో కరోనా గుర్తింపు..ఐఐటీ ప్రొఫెసర్ అద్భుత సృష్టి!

By:  Tupaki Desk   |   24 April 2020 6:30 PM GMT
5 సెకన్లలో కరోనా గుర్తింపు..ఐఐటీ ప్రొఫెసర్ అద్భుత సృష్టి!
X
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వీరవిహారం చేస్తున్న వేళ ఓవైపు పరిశోధకులు వ్యాక్సిన్ తయారీకి తీవ్రంగా శ్రమిస్తుండగా, మరోవైపు వైజ్ఞానికులు వైరస్ ను వేగంగా గుర్తించే సాంకేతికతను అభివృద్ధి చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఐఐటీ రూర్కీకి చెందిన ఓ ప్రొఫెసర్ 5 సెకన్లలో కరోనా వైరస్ ను గుర్తించే సరికొత్త సాఫ్ట్ వేర్ కు రూపకల్పన చేశారు.

కరోనా అనుమానిత రోగికి ఎక్స్ రే స్కాన్ తీయడం ద్వారా స్వల్ప వ్యవధిలోనే రోగ నిర్ధారణ చేయవచ్చని సదరు ప్రొఫెసర్ అంటున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి, వైద్యులు ఒక వ్యక్తి ఎక్స్‌రే చిత్రాల ద్వారా సాఫ్ట్ ‌వేర్ రోగికి న్యుమోనియా లక్షణాలు ఉన్నాయా లేదా అని వర్గీకరించడమే కాదు, అది కరోనాకు సంబంధించిందా లేక ఇతర బ్యాక్టీరియా వల్ల వచ్చిందా అనేది గుర్తించవచ్చన్నారు. తద్వారా ఈ వ్యాధి విస్తరణను అడ్డుకోవచ్చని తెలిపారు. దీని పేటెంట్ కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కు దరఖాస్తు చేసినట్టు తెలిపారు.

ఈ సాఫ్ట్‌ వేర్‌ ను అభివృద్ధి చేయడానికి 40 రోజులు పట్టిందని సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కమల్ జైన్ వెల్లడించారు. కరోనా - న్యుమోనియా - క్షయ రోగులతో సహా 60 వేల మంది రోగుల ఎక్స్-రే స్కాన్ ‌లను విశ్లేషించిన తరువాత మొదట ఒక కృత్రిమ మేధస్సు-ఆధారిత డేటాబేస్ అభివృద్ధి చేసినట్టు వెల్లడించారు. ఈ సాఫ్ట్ వేర్ తో కరోనా పరీక్షల ఖర్చు గణనీయంగా తగ్గడమే కాకుండా, వైద్య సిబ్బందికి కరోనా సోకే ప్రమాదం కూడా తక్కువ అని వెల్లడించారు. అయితే జైన్ వాదనకు వైద్య సంస్థ నుంచి ప్రస్తుతానికి ఎలాంటి ధృవీకరణ రాలేదు. కాగా దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23 వేలను దాటేసింది. మరణాల సంఖ్య 718 కి పెరిగింది.