Begin typing your search above and press return to search.

ఏపీ ఎంపీల ప్రోగ్రెస్ కార్డును తయారు చేసిన ఎన్జీవో.. అందులో ఏముందంటే?

By:  Tupaki Desk   |   4 Aug 2021 1:30 PM GMT
ఏపీ ఎంపీల ప్రోగ్రెస్ కార్డును తయారు చేసిన ఎన్జీవో.. అందులో ఏముందంటే?
X
బడుగుల బతుకుల్ని మార్చేస్తామని.. సామాన్యులకు సేవ చేస్తామని.. మొత్తంగా ప్రజల తలరాతలు మారుస్తానని ఎన్నికల వేళ పదే పదే మాటలు చెప్పే నేతలు.. ఎన్నికైన తర్వాత ఎలా పని చేస్తున్నారు? లోక్ సభలో సదరు ఎంపీల పని తీరు ఎలా ఉంది? ప్రజలు ఎన్నుకున్న వారు ఎలా వ్యవహరిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలకు వారి హాజరు మాటేమిటి? రాష్ట్ర ప్రయోజనాల కోసం.. ప్రజలకు అవసరమైన అంశాల మీద వారు సంధిస్తున్న ప్రశ్నల మాటేమిటి? లాంటి అంశాలపై తాజాగా పీఆర్ఎస్ లెజిస్టేటివ్ రీసెర్చ్ సంస్థ ఒకటి తాజాగా అధ్యయనం చేసింది.

లాభాపేక్ష లేకుండా సేవల్ని అందించే ఈ సంస్థ ఏపీకి చెందిన ఎంపీల పని తీరుకు సంబంధించి ఒక రిపోర్టును విడుదల చేసింది. అధికారిక సమాచారాన్ని అసరాగా చేసుకొని ఈ నివేదికను తయారు చేశారు. ఇందులో పేర్కొన్న అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కొందరు ఎంపీల గురించి బయటకు వచ్చిన సమాచారం వారి ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసేలా ఉందని చెప్పాలి. ఇంతకీ ఆ సంస్థ పేర్కొన్న అంశాలేమిటి? ఏపీ ఎంపీల్లో అత్యధికం అధికార వైసీపీకి చెందిన నేతలే ఉన్న విషయం తెలిసిందే. మరి.. సదరు రిపోర్టు ఏం చెప్పిందన్నది చూస్తే..

- ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కమ్ కజిన్ అయిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయానికి వస్తే.. లోక్ సభ హాజరు విషయానికి వస్తే.. ఏపీ ఎంపీల్లో అతి తక్కువ శాతం మాత్రమే అటెండ్ అయినట్లుగా తేల్చారు. ఆయన కేవలం 32 శాతం హాజరు మాత్రమే ఉన్నారు. అంటే.. పది రోజుల పాటు లోక్ సభ జరిగితే.. కేవలం మూడు రోజులు మాత్రమే ఆయన హాజరైనట్లుగా చెప్పాలి. ఏపీకి చెందిన మొత్తం 24 మంది ఎంపీల్లో అవినాష్ రెడ్డి అతి తక్కువగా లోక్ సభకు హాజరైనట్లుగా తేల్చారు.

- ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు తక్కువగా ఉన్నప్పటికి.. సభకు హాజరైన సమయంలో ఆయన ప్రశ్నించే ప్రశ్నలు భారీగా ఉంటాయని తేల్చాలి. ఎందుకంటే.. అత్యధిక ప్రశ్నల్ని సంధించిన ఎంపీగా ఆయన నిలిచారు. మొత్తం 146 ప్రశ్నల్ని ఆయన సభలో అడిగారు.

- బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ విషయానికి వస్తే.. ఆయన తీరుకు నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. హాజరు విషయంలో అవినాష్ రెడ్డితో పోలిస్తే కాస్త బెటర్ గా ఉన్నా.. ఆయన ఇప్పటివరకు లోక్ సభలో ఒక్కటంటే ఒక్క ప్రశ్న అడగని ఘనత ఆయన సొంతంగా తేల్చారు. ఒక్క డిబేట్ లోనే ఆయన పాల్గొన్నట్లుగా పేర్కొన్నారు.

- తరచూ వార్తల్లో కనిపిస్తూ.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘరామకు సంబంధించిన ఆసక్తికర అంశాలు వెల్లడించారు. తన మాటలతో.. చేతలతో స్వపక్షాన్ని తరచూ ఇరుకున పెట్టే ఆయన.. లోక్ సభ సమావేశాల్లో ఆయన హాజరు ఏకంగా 96 శాతం కావటం విశేషం. ఏపీ ఎంపీల్లో ఆయనదే అత్యధిక హాజరుగా చెప్పాలి. ఎంపీ రఘురామ ఇప్పటివరకు మొత్తం 50 డిబేట్లలో పాల్గొనటంతో పాటు.. 145 ప్రశ్నల్ని సంధించినట్లుగా పేర్కొన్నారు.

- విపక్షానికి చెందిన ఎంపీల విషయానికి వస్తే.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ హాజరు 89 శాతం ఉంటే.. 54 డిబేట్లలో పాల్గొని మొత్త 133 ప్రశ్నల్ని సంధించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సైతం హాజరు విషయంలో గల్లా జయదేవ్ కు సమానంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. తాజా నివేదికను చూస్తే.. వైసీపీ ఎంపీల్లో కొందరు తమ పని తీరును మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.