Begin typing your search above and press return to search.

చేదు నిజాన్ని చెప్పిన ఆర్థిక ప్రముఖుడు

By:  Tupaki Desk   |   28 April 2020 4:45 AM GMT
చేదు నిజాన్ని చెప్పిన ఆర్థిక ప్రముఖుడు
X
కరోనా వేళ.. దేశాలకు దేశాల ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బ తిన్న వేళ.. భారత ఆర్థిక పరిస్థితి మీదా ప్రభావం తప్పదు. జాతి మెచ్చిన ప్రధాని మోడీ చేతిలో పగ్గాలున్న వేళ.. దేశ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అవినీతి లేదు.. కుంభకోణాలేమీ లేవు. అనవసరమైన ఖర్చు లేవని గొప్పలు చెప్పుకునే వారు.. దేశ ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగ్గా ఎందుకు లేదన్న సందేహానికి మాత్రం సమాధానం చెప్పని పరిస్థితి.

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ పుణ్యమా అని.. భారత వృద్ధి రేటు కనిష్ఠంగా చేరుతుందన్న అంచనాలు ఇప్పటికే వెలువడ్డాయి. లాక్ డౌన్ 1.0 వేళ ఒక అంచనా ఉంటే.. ఎప్పుడైతే లాక్ డౌన్ ను పొడిగించారో అప్పటి నుంచి అంచనాలు మరింతగా తగ్గిపోయాయి. ఇలాంటివేళ.. భారత రిజర్వుబ్యాంకుకు గవర్నర్ గా వ్యవహరించిన ఆర్థిక నిపుణుడు కమ్ తెలుగోడు దువ్వూరి సుబ్బారావు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

లాక్ డౌన్ కారణంగా భారత వృద్ధి రేటు సున్నాకు చేరుకుంటుందని.. మైనస్ కు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇంతటి షాకింగ్ వ్యాఖ్యల్లోనూ ఉపశమనం కలిగించే కొన్ని అంశాల్ని ఆయన చెప్పుకొచ్చారు. ఇతర దేశాల కంటే మెరుగ్గా భారత్ పని తీరు ఉందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే అందరూ పనులకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారని.. దీంతో ఆర్థిక వ్యవస్థ రికవరీ విజయవంతంగా ముందుకు వెళుతుందన్నారు.

ఇతర దేశాలతో పోలిస్తే భారత్ పేద దేశమన్న ఆయన.. అధిక జనాభా ఉన్న కారణంగా కరోనా సంక్షోభం అదే పనిగా సాగితే.. ఇబ్బందులు తప్పవన్నారు. లాక్ డౌన్ ను త్వరగా ఎత్తేయకుంటే లక్షలాది మంది జీవనాధారం కోల్పోతారన్నారు. ఈ సందర్భంగా ఆయనో ఉదాహరణను చెప్పుకొచ్చారు. 2008లో ప్రపంచాన్ని మాంద్యం పట్టి పీడిస్తున్నప్పుడు మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ త్వరగా కోలుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఓపక్క భయాన్ని కలిగించేలా దువ్వూరి వారి మాటలున్నా.. మరోవైపు కొత్త ఆశలు రేపేలా ఆయన అంచనాలు ఉన్నాయని చెప్పాలి.