Begin typing your search above and press return to search.

కేటీయార్ కు ప్రమోషన్ గ్యారెంటీనా ?

By:  Tupaki Desk   |   3 Oct 2022 5:13 AM GMT
కేటీయార్ కు ప్రమోషన్ గ్యారెంటీనా ?
X
ప్రాంతీయ పార్టీగా అయిన టీఆర్ఎస్ తొందరలోనే జాతీయ పార్టీగా మారబోతోంది. జాతీయ పార్టీకి ఎలాగూ అధ్యక్షుడిగా కేసీయార్ ఉంటారనటంలో సందేహం లేదు. మరి జాతీయ పార్టీ అన్నాక వివిధ రాష్ట్రాల్లో అధ్యక్షులుండాలి కదా. ఆపనిని మొదట తెలంగాణాతోనే మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. తెలంగాణా అధ్యక్షుడిగా కేసీయార్ కొడుకు, మంత్రి కేటీయార్ నియమితులు కాబోతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. ఇప్పటికే పార్టీకి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

అంటే తండ్రి, కొడుకులకు ఒకేసారి ప్రమోషన్లు వస్తాయన్నమాట. ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడైన కేసీయార్ కు జాతీయ అధ్యక్షుడుగాను, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ రాష్ట్రానికి పూర్తిస్ధాయి అధ్యక్షుడిగాను నియమితులు కాబోతున్నారు.

అక్టోబర్ 5వ తేదీన విజయదశమి రోజున జాతీయపార్టీ పేరును కేసీయార్ ప్రకటించబోతున్నారు. ఆ తర్వాత జాతీయ కార్యవర్గాన్ని కూడా ప్రకటిస్తారు. 6వ తేదీన టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ జాతీయపార్టీగా మారిన విషయమై లేఖను అందిస్తారు.

పరిశీలన తర్వాత టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా గుర్తించి కమీషన్ నోటిఫికేషన్ ఇవ్వగానే వివిధ రాష్ట్రాలకు మొదట కన్వీనర్లను నియమించబోతున్నారట. మిగిలిన రాష్ట్రాల్లో తమ పార్టీతో కలిసి పనిచేయటానికి ముందుకొచ్చే పార్టీలేవి, నేతలు ఎవరనే విషయమై కేసీయార్ కసరత్తు చేస్తున్నారు. ఆ విషయాలన్నీ ఖాయమైన తర్వాత అప్పుడు కన్వీనర్ పోస్టులను అధ్యక్ష పదవులుగా మార్చబోతున్నారు. ఇప్పటికైతే కేసీయార్ తో చేతులు కలిపి పనిచేయటానికి పలానా పార్టీ సానుకూలంగా ఉందని సరైన సమాచారం అయితే లేదు.

జాతీయ రాజకీయాలపై ఇప్పటికే కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో కేసీయార్ భేటీ అయిన విషయం తెలిసిందే. అలాగే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా, కొందరు రైతు సంఘాల నేతలు కూడా సమావేశమయ్యారు. ఆ సమావేశాల్లో వాళ్ళతో కేసీయార్ ఏమి మాట్లాడారో ఎవరికీ తెలీదు. కాకపోతే జాతీయ పార్టీగా మారిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో కన్వీనర్లుగా పనిచేసేట్లుగా కొందరిని కేసీయార్ ఒప్పించారని మాత్రం పార్టీవర్గాలు చెబుతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.