Begin typing your search above and press return to search.

సైబరాబాద్ సీపీ సజ్జన్నార్ కు ప్రమోషన్.. ఇప్పుడు ఆయన పొజిషన్ ఏమిటంటే?

By:  Tupaki Desk   |   11 March 2021 6:30 AM GMT
సైబరాబాద్ సీపీ సజ్జన్నార్ కు ప్రమోషన్.. ఇప్పుడు ఆయన పొజిషన్ ఏమిటంటే?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ బాస్ లు చాలామందే ఉండొచ్చు. కానీ.. జాతీయ స్థాయిలో అందరికి సుపరిచితుడు.. సామాన్య ప్రజలు సైతం ఇట్టే గుర్తించే పోలీస్ సెలబ్రిటీ ఎవరంటే.. వీసీ సజ్జన్నార్ పేరు చెబుతారు. అందరికి అందుబాటులో ఉండటంతో పాటు.. తన వద్ద పని చేసే సిబ్బంది మంచి చెడ్డల్ని దగ్గరగా చూసుకోవటంతో పాటు.. వారి సంక్షేమం కోసం ఆయన పడే తపన అంతా ఇంతా కాదని చెబుతారు. అంతేనా.. నిజాయితీ కూడా ఆయనకు మరో ఆభరణంగా చెప్పాలి.

గతంలో ఆయన ట్రాక్ రికార్డుకు.. దిశ ఎపిసోడ్ యాడ్ కావటమే కాదు.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న ఎన్ కౌంటర్ ఆయన పేరును దేశ వ్యాప్తంగా మారుమోగేలా చేసిందని చెప్పాలి. అలాంటి సజ్జన్నార్ ప్రస్తుతం సైబరాబాద్ సీపీగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ మహానగరాన్ని పోలీసింగ్ లో భాగంగా మూడు ముక్కలు చేశారు. అందులో మొదటిది హైదరాబాద్ కమిషనరేట్. రెండోది సైబరాబాద్ కమిషనరేట్. మూడోది రాచకొండ కమిషనరేట్. హైదరాబాద్ కమిషనరేట్ అంటే పాత హైదరాబాద్ గా చెప్పాలి.

సైబరాబాద్ కమిషనరేట్ అంటే.. చాలామంది సైబర్ క్రైంలు మాత్రమే చూస్తుందన్న అపోహ ఉంది. ఇది కొత్త హైదరాబాద్ అంటే.. హైటెక్ సిటీ మొదలు నగరం కొత్తగా వ్యాప్తి చెందిన ప్రాంతాలతోపాటు.. శంషాబాద్ అవతల వరకు దీని పరిధి ఉంటుంది. ఇక.. మిగిలింది రాచకొండ కమిషనరేట్. హైదరాబాద్ లోని ఒక మూల అంటే.. ఎల్ బీ నగర్.. ఉప్పల్.. మల్కాజిగిరి..మొదలుకొని దగ్గర దగ్గర నల్గొండ వరకు ఈ కమిషనరేట్ సరిహద్దులు ఉంటాయి. ఇదంతా ఎందుకంటే.. చాలామందికి హైదరాబాద్.. సైబరాబాద్.. రాచకొండ కమిషనరేట్ అంటే ఒక పట్టాన అర్థం కాదు. అందుకే ఈ క్లారిటీ.

ఇదిలా ఉంటే.. సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జన్నార్ కు తాజాగా ప్రమోషన్ లభించింది. ఆయనతో పాటు మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు కూడా ప్రమోషన్ లభించింది. ప్రస్తుతం ఆయన అడిషనల్ డీజీగా ప్రమోషన్ లభించింది. ఆయనతో పాటు ఇదే ప్రమోషన్ అందుకున్న వారిలో ఒకరు హైదరాబాద్ కమిషనరేట్ ట్రాఫిక్ చీఫ్ గా వ్యవహరిస్తున్న అనిల్ కుమార్ ఒకరైతే.. మరొకరు కేంద్ర సర్వీసుల్లోకొనసాగుతున్న చారుసిన్హా మరొకరు.

తాజాగా వచ్చిన ప్రమోషన్ తో సీపీ సజ్జన్నార్ ఇప్పటికిప్పుడు కొత్త పదవిని చేపట్టే అవకాశం లేదు. ఆయన సైబరాబాద్ సీపీగా పగ్గాలు అందుకొని మూడేళ్లు పూర్తి అయ్యాయి. దీంతో.. ఆయన్ను మార్చే వీలుంది. ప్రభుత్వం కానీ పాజిటివ్ గా రియాక్టు అయితే.. హైదరాబాద్ కమిషనరేట్ కు సీపీగా నియమించే అవకాశం ఉంది. కాకుంటే.. ఇప్పటికిప్పుడు కాకపోవచ్చు. అదే సమయంలో.. భవిష్యత్తులో రాష్ట్ర పోలీస్ బాస్ గా అవకాశం తాజా ప్రమోషన్ తో మెరుగైందని చెప్పక తప్పదు.