Begin typing your search above and press return to search.

అమెరికాలో హిందు దేవాల‌యంపై కాల్పులు

By:  Tupaki Desk   |   20 July 2015 1:33 PM GMT
అమెరికాలో హిందు దేవాల‌యంపై కాల్పులు
X
అమెరికాలో హిందూ దేవాల‌యం నిర్మాణ స్థ‌లంపై కాల్పులు జ‌రిగాయి. దేవాల‌య నిర్మాణం కోసం ప్ర‌తిపాదించిన స్థ‌లంపై జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై స్థానిక హిందువులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండగా... ఈ తీరుపై న‌గ‌ర మాజీ మేయ‌ర్ క్ష‌మాప‌ణ చెప్పారు.

యుఎస్‌లోని ఓం అనే హిందూ సంస్థ నార్త్ కరోలినా రాష్ట్ర పరిధిలో క్లెమాన్స్ అనే ప్రాంతం వద్ద 3,600 చదరపుటడుగుల స్థలంలో ఆలయాన్ని నిర్మించేందుకు 7.6 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ప్రతిపాదిత నిర్మాణానికి సంబంధించిన ఒక సైన్ బోర్డును ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసింది. అయితే ఈ హిందూ ఆలయ నిర్మాణానికి సంబంధించిన సైన్ బోర్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు తూటాల వర్షం కురిపించారు.

హిందూ సంస్థ డైరక్టర్ల బోర్డులో ఒకరైన మంజునాథ్ షామన్న తాజాగా ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు తూటాల వల్ల ఏర్పడిన రంధ్రలతో సైన్ బోర్డు కనిపించింది. సైన్ బోర్డు పరిసరాలలో షెల్ కేసింగ్స్ పడి ఉన్నాయని స్థానిక కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. రెండు వారాల క్రితం జ‌రిగినట్లుగా భావిస్తున్న ఈ ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌పై అమెరికాలోని ప్రవాస భారతీయులు విస్మయానికి గురయ్యారు.

ఈ ఘటనపై క్లెమాన్స్ మాజీ మేయర్ జాన్ బోస్ట్ ఆ జర్నల్ ఫేస్ బుక్ పేజీ ద్వారా క్షమాపణలు చెప్పారు. ఘటనా స్థలానికి దగ్గరలో ఉన్న యూనియన్ హిల్ బాప్టిస్ట్ చర్చి పాస్టర్ రెవరెండ్ క్రిస్టఫర్ దంపతులు విచారం వ్యక్తం చేశారు. మ‌రోవైపు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది.