Begin typing your search above and press return to search.

ట్రంప్ కోసం మ‌తం మారుతామంటున్నారు

By:  Tupaki Desk   |   21 Feb 2017 7:03 AM GMT
ట్రంప్ కోసం మ‌తం మారుతామంటున్నారు
X
అమెరికాలోకి ఏడు ముస్లిం దేశాల వలసల నిరోధం విషయంలో రాజీలేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుస‌ర్తిస్తు విధానాలను నిరసిస్తూ వివిధ మతాలకు చెందిన వేలాదిమంది ప్రజలు న్యూయార్క్‌ లోని టైమ్స్ స్క్వేర్ వద్ద కదం తొక్కారు. మేము కూడా ముస్లింలమే అంటూ వారు ముస్లిం మతస్తులకు సంఘీభావాన్ని ప్రకటించారు. త‌మ‌ల్ని మ‌తం మారిన వారిగానే గుర్తించాల‌ని డిమాండ్ చేశారు. ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఏడు దేశాలనుంచి అమెరికాలోకి వలసలను నిరోధించేందుకు ట్రంప్ జారీ చేసిన తాజా ఉత్తర్వులతో తీవ్రమైన అనిశ్చితి - ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ముస్లింలకు సంఘీభావాన్ని తెలియజేసేందుకు ఫౌండేషన్ ఫర్ ఎత్నిక్ అండర్‌ స్టాండింగ్ - నసాంట్రా ఫౌండేషన్ సంయుక్తంగా ఈ ర్యాలీని నిర్వహించాయి. వేలాది మంది ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొని ట్రంప్‌ కు వ్యతిరేకంగా బ్యానర్లు, నినాదాలతో హోరెత్తించారు.ముస్లిం మతస్థులు అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విధించవద్దని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ప్రముఖ రచయిత - పారిశ్రామికవేత్త రసెల్ సైమన్స్ - సినీనటి సుసాన్ సరాండన్ తదితర సెలబ్రిటీలు సహా వివిధ మతాలకు చెందిన వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొని ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం సాగిస్తున్న విచ్ఛిన్నకర రాజకీయాలను ముక్తకంఠంతో ఖండించారు. మ‌రోవైపు ఇటీవ‌లే వ‌ల‌స‌ల విష‌యంలో వెన‌క్కు త‌గ్గేది లేద‌ని ట్రంప్‌ పునరుద్ఘాటించిన సంగ‌తి తెలిసిందే. తొలి ఉత్తర్వు వివాదాస్పదం కావడంతో.. మరో కార్యనిర్వాహక ఉత్తర్వుకు పదునుపెడుతున్నామన్నారు. వచ్చేవారమే దీన్ని జారీ చేయడం ఖాయమని వెల్లడించారు. ‘అమెరికాకు వలసల నిషేధంపై కొత్తగా రూపొందించనున్న ఉత్తర్వులను లోతుగా, గట్టిగా అధ్యయనం చేస్తున్నాం. చట్టపరంగా, న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా ఉత్తర్వు ఉండటం ఖాయం’ అని వైట్‌ హౌస్ న్యూస్ కాన్ఫరెన్స్‌ లో ట్రంప్ స్పష్టం చేశారు.

ఇదిలాఉండ‌గా... అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి నెలరోజులు గడిచినా ట్రంప్‌ కు వ్యతిరేకంగా ఇంకా నిరసన ప్రదర్శనలు కొనసాగుతునే వున్నాయి. శరణార్థులు, వలసవాసులపై నిషేధం విధించడంతో సహా ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను, విధానాలను వ్యతిరేకిస్తూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బోస్టన్‌ లో ఆదివారం వేలాదిమంది చేరి శాస్త్రీయ పరిశోధనకు నిధులు మంజూరు చేసే విషయంలో ప్రభుత్వ బెదిరింపులను నిరసించారు. చికాగో - న్యూయార్క్‌ నగరాల్లో ఆదివారం - లాస్‌ ఏంజెల్స్‌ - శాండియాగోల్లో శనివారం ప్రదర్శనలు జరిగాయి. వేలాది రెస్టారెంట్లు - వ్యాపార సంస్థలు - పాఠశాలలు మూతపడ్డాయి. న్యూయార్క్‌ సిటీ - అట్లాంటా - డెట్రాయిట్‌ - వాషింగ్టన్‌ డిసి - ఫిలడెల్ఫియా - లాస్‌ ఏంజెల్స్‌ - ఆస్టిన్‌ - టెక్సాస్‌ లతో సహా పలు నగరాల్లో ప్రదర్శనలు జరిగాయి. ట్రంప్‌ వ్యతిరేక ప్రదర్శనలకు సంఘీభావంగా పనిచేయడానికి తిరస్కరించిన కార్మికులను విధుల నుండి తొలగించినట్లు వార్తలందాయి. దక్షిణ కరోలినా - డెన్వర్‌ - కొలరాడోల్లో దాదాపు 50మంది కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించారు. నాషవిల్లె - టెన్నెస్సీల్లో స్కూలు ఉద్యోగులను తొలగించినట్లు వార్తలు పేర్కొన్నాయి. సాల్ట్‌ లేక్‌ సిటీ - గ్రీన్స్‌బొరో - నార్త్‌ కరోలినా - రాపిడ్‌ సిటీ - దక్షిణ డకోటా - కన్నాస్‌ సిటీ - మిస్సోరి నగరాల్లో సోమవారం కూడా ప్రదర్శనలు జరిగాయి. చికాగోలోని ట్రంప్‌ టవర్‌ ఎదురుగా ఆదివారం జరిగిన ర్యాలీలో ఆన్సర్‌ కొయిలేషన్‌ - సోషలిస్ట్‌ ఆల్టర్‌ నేటివ్‌ - ది పార్టీ ఫర్‌ సోషలిజం అండ్‌ లిబరేషన్‌ ఇంకా వివిధ సంస్థలు - గ్రూపులు పాల్గొని తమ నిరసన వ్యక్లం చేశాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/