Begin typing your search above and press return to search.

ఉద్యమ నేతపై కాశ్మీరీల కడుపు మండింది

By:  Tupaki Desk   |   7 Oct 2016 4:11 AM GMT
ఉద్యమ నేతపై కాశ్మీరీల కడుపు మండింది
X
దాయాది పాకిస్థాన్ దుర్మార్గంతో కశ్మీరం ఆరని కుంపటిలా మారింది. ఇది చాలదన్నట్లుగా వేర్పాటు నేతల పుణ్యమా అని కశ్మీర్ లో నిత్యం కలకలం రేగే పరిస్థితి. దీనికి తోడన్నట్లుగా కొద్ది నెలల క్రితం (జులై 8న) హిజ్బుల్ ముజాహిదీన్ అనే తీవ్రవాద అధినేత బుర్హాన్ వానీని భద్రతా దళాలు ఎన్ కౌంటర్లో హతమార్చాయి. ఆ ఘటనతో కశ్మీరంలో పెద్ద ఎత్తున కలకలం రేగింది. అప్పటి నుంచి మొదలైన అల్లర్లు నేటికీ సాగుతూనే ఉన్నాయి. జనజీవనం స్థంభించిపోవటమే కాదు.. అల్లర్లతో సామాన్యులు ఉపాధి లేక విలవిలలాడుతున్నారు.

వనీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో వేర్పాటు వాదుల పిలుపుతో కశ్మీర్ ప్రాంతంలో వరుస బంద్ లు నిర్వహిస్తున్నారు. దీంతో.. పేద.. మధ్యతరగతి వారు తీవ్ర అవస్థలకు గురి అవుతున్నారు. చివరకు పిల్లలకు సరైన భోజనం పెట్టలేని దుస్థితిలోకి కూరుకుపోతున్నారు. సహజంగానే కశ్మీరీలు సంపన్నులు. తింటూ కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయన్నట్లుగా.. గడిచిన కొద్ది నెలలుగా కశ్మీరీ వ్యాలీ మొత్తం అల్లర్లతో అట్టుడికిపోతున్న నేపథ్యంలో ఆదాయ మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయి.

ప్రజల ఈతి బాధల్ని ఏ మాత్రం పట్టించుకోని హురియత్ నేతలు.. ఎప్పటి మాదిరే ఏదో ఒక పిలుపుతో బంద్ ల మీద బంద్ లు నిర్వహిస్తుంటారు. వారి మాటలకు ప్రభావితమయ్యే అల్లరిమూకలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రాళ్ల దాడులు చేస్తూ భద్రతా దళాల్ని రెచ్చగొడుతుంటారు. వారి చేష్టలకు ప్రతిగా పోలీసులు లాఠీ ఛార్జ్ చేయటమో.. కాల్పులు జరగటమో చేస్తుంటారు. ఈ ఘటనలతో కొందరు మరణించటం.. మరికొందరు గాయాలపాలు కావటం.. ఈ ఘటనల్ని చూపించి భావోద్వేగాల్ని మరింత రెచ్చగొడుతూ తమ పబ్బం గడుపుకుంటూ ఉంటారు నేతలు.

దుర్మార్గమైన విషయం ఏమిటంటే.. గడిచిన కొన్ని దశాబ్దాలుగా కశ్మీర్ లోయలో జరిగే అల్లర్లలో ఏ వేర్పాటువాద ముఖ్య నాయకుడు మరణించింది లేదు. కానీ.. వారిచ్చే ఆందోళనలు.. బంద్ పిలుపులకు ప్రభావితమైన ఎంతోమంది తమ ప్రాణాల్ని కోల్పోయిన దుస్థితి. ఎవరిదాకానో ఎందుకు.. హురియత్ నేత గిలానీ సంగతే తీసుకోండి. కశ్మీర్ తగలబడిపోతున్నా ఆయనకు పట్టదు. ఆయనకు కావాల్సింది కశ్మీర్ భారత్ నుంచి విడిపోవటం మాత్రమే. అది సాధ్యమయ్యే పని కాదని తెలిసినప్పటికీ.. వేలాది మంది ప్రాణాల్ని పణంగా పెడతారే కానీ.. ఆయన మాత్రం వెనక్కి తగ్గరు. తన కారణంగా ఎన్నో వందల కుటుంబాలు కడుపుకోతకు గురైన విషయాన్ని ఆయన అస్సలు గుర్తించరు. ముదిమి వయసులో తనను ప్రేమించి.. అభిమానించే ప్రజల సౌఖ్యం కంటే కూడా.. సాధ్యం కాని డిమాండ్లను తెర మీదకు తీసుకొచ్చి రెచ్చగొడుతూ ఉంటారు.

కశ్మీర్ లోయలో గిలానీ మాటకు ఉన్న పరపతి చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఆయన నోటి వెంట కానీ ఆందోళనకు కానీ.. బంద్ కు కానీ పిలుపు వచ్చిందంటే చాలు.. తమకు ఇష్టం ఉన్నా.. లేకున్నా.. ఆయన మాటకు గౌరవం ఇస్తూ ఆయన చెప్పినట్లుగా వ్యవహరిస్తారే తప్పించి.. ఎదురు నిలిచి మాట్లాడేందుకు ఏ మాత్రం ఇష్టపడరు. ప్రైవేటు సంభాషణల్లో గిలానీ పట్ల వ్యతిరేకత ప్రదర్శించే ఎంతోమంది.. ఆయన మాటకు విలువ ఇచ్చే విషయంలో మాత్రం వెనక్కి తగ్గరు. అంతటి పరపతి ఉన్న గిలానీకి తొలిసారి ఎదురుదెబ్బ తగిలిన పరిస్థితి. బంద్ ల మీద బంద్ లు ఇస్తున్నన హురియత్ నేతల తీరుపై మండిపడుతూ.. గురువారం శ్రీనగర్ లో ఒక ర్యాలీని నిర్వహించారు. మూడు నెలలుగా బంద్ పాటిస్తూ.. తీవ్ర అవస్థలకు గురి అవుతున్నా.. వేర్పాటు నేతలు తమ వెతల గురించి పట్టించుకోవటం లేదని మండిపడుతూ గిలానీ తీరును వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కశ్మీర్ ప్రజల్లో వేర్పాటు వాదులపై గూడుకట్టుకున్న అసంతృప్తికి నిదర్శనంగా చెప్పొచ్చు. పాక్ ప్రమేయంతో రెచ్చిపోయే గిలానీ లాంటి వారికి ఈ తరహా ర్యాలీ చెంప పెట్టులాంటిదేనని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/