Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యే పై సొంత పార్టీ నేతల నిరసన ఎంత భారీగా అంటే?

By:  Tupaki Desk   |   3 Jan 2022 4:33 AM GMT
వైసీపీ ఎమ్మెల్యే పై సొంత పార్టీ నేతల నిరసన ఎంత భారీగా అంటే?
X
అనూహ్య పరిణామాలు ఏపీ అధికారపక్షంలో చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా అధికార పార్టీ నేతల అవినీతి.. తప్పుడు కార్యక్రమాల్ని విపక్ష నేతలు చెబుతారు. అందుకు భిన్నంగా ఇటీవల కాలంలో వైసీపీ ఎమ్మెల్యే అవినీతి.. అక్రమాల మీద సొంత పార్టీకి చెందిన నేతలు విరుచుకుపడటమే కాదు.. రోడ్ల మీదకు వచ్చి నిరసన చేస్తున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

పార్టీ ఎమ్మెల్యేలపై వస్తున్న ఈ ఆరోపణలపై వైసీపీ అధినాయకత్వం సత్వరమే స్పందించాల్సిన అవసరం ఉంది. తాజాగా విశాఖ జిల్లా పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తీరును సొంత పార్టీ నేతలే తీవ్రంగా తప్పు పడుతున్నారు.

తమ ఎమ్మెల్యే వసూల్ రాజాలా మారినట్లుగా మండిపడుతున్నారు. ఆయన వ్యతిరేక వర్గం తాజాగా రోడ్ల మీదకు వచ్చి భారీ నిరసనను చేపట్టింది. గడిచిన మూడు నాలుగు రోజలుగా ఎమ్మెల్యే బాబూరావు తీరుపై ఆయన వ్యతిరేక వర్గం పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. ఇలాంటి వేళలో పార్టీ ముఖ్యనేతలు జోక్యం చేసుకొని విషయాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయకుండా ఉండిపోవటంతో.. ఇది మరింత పెరుగుతోంది. ఆదివారం.. జాతీయ రహదారి మీద భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే తీరును తీవ్రంగా తప్పు పట్టారు.

అంతేకాదు.. ఈ వ్యతిరేక వర్గానికి నాయకత్వంవహిస్తున్న ఎంపీపీ బొలిశెట్టి శారదా కుమారి.. ఆమె భర్త గోవిందరావులు.. ఎమ్మెల్యే బాబురావు తీరును తీవ్రంగా తప్ప పడుతున్నారు. ఇంటింటికి బియ్యం పంపిణీ చేసే 68 వాహనాల నుంచి రూ.50వేల చొప్పున వసూలు చేశారని.. సచివాలయం.. వెల్ నెస్కేంద్రాలు.. రైతు భరోసా కేంద్రాల నుంచి వసూళ్లు చేసిన ఘనత ఎమ్మెల్యేకే దక్కుతుందన్నారు.

సీసీ రోడ్లలోనూ పర్సంటేజీని తీసుకున్నారని.. లింగరాజుపాలెం రెసెడెన్షియల్ పాఠశాలలో రెండు ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి రూ.2 లక్షలచొప్పున తీసుకున్నారంటూ ఆయన అవినీతి చిట్టాను విప్పారు. పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఓటమికి ఎమ్మెల్యే కారణమని ఫైర్ అయిన వారు.. ఇప్పటికైనా ఎమ్మెల్యే తన తీరును మార్చుకోవాలంటున్నారు.ఈ ఉదంతం విశాఖ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. సొంత పార్టీ నేతల విమర్శలు.. ఆరోపణలతోపార్టీకి జరిగే డ్యామేజీని కంట్రోల్ చేసే విషయంలో పార్టీ ముఖ్యనేతల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.