Begin typing your search above and press return to search.

త‌లాక్ నుంచి కాపాడాల‌ని ఆంజ‌నేయునికి ముస్లింల ప్రార్థ‌న‌

By:  Tupaki Desk   |   11 May 2017 11:01 AM GMT
త‌లాక్ నుంచి కాపాడాల‌ని ఆంజ‌నేయునికి ముస్లింల ప్రార్థ‌న‌
X
ట్రిపుల్ తలాక్ విష‌యంలో తమకు రక్షణ కల్పించాలని ప్రధాని నరేంద్రమోడీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో ముస్లిం మహిళలు ఆంజనేయునికి ప్రార్థనలు జరిపారు. ఆంజనేయస్వామి ఆలయంలో కూర్చుని సామూహికంగా హనుమాన్ చాలీసా పఠించారు. హనుమాన్ చాలీసా పఠిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్న నమ్మకంతో అలా చేశామని ముస్లిం మహిళలు తెలిపారు.

కాగా, తలాక్‌ను సవాలు చేస్తూ దాఖలైన పలు అభ్యర్థనలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇవాళ్టి నుంచి విచారణ చేపట్టనుంది. ముస్లింలలో అమలవుతున్న ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వం వంటివాటికి ఉన్న చట్టబద్ధతను ప్రశ్నిస్తూ వచ్చిన ఏడు పిటిషన్లపై ఉదయం 10.30 గంట ల నుంచి వాదనలు విననుంది. వీటిలో ఐదు పిటిషన్లు ట్రిపుల్ తలాక్‌పై దాఖలైనవే. చీఫ్ జస్టిస్ జే ఎస్ ఖేహర్ నేతృత్వంలో జస్టిస్‌లు కురియన్ జోసెఫ్, ఆర్ ఎఫ్ నారిమన్, యూ యూ లలిత్, అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం సమానత్వం కోసం ప్రశ్నిస్తున్న ముస్లిం మహిళలు శీర్షికన ఈ పిటిషన్లను విచారించనుంది. కీలకమైన, సున్నితమైన అంశాలతో ముడిపడిఉన్న ఈ పిటిషన్ ఈ విచారణకు సుప్రీం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. విషయ తీవ్రత దృష్ట్యా వేసవి సెలవుల్లోనూ విచారణ జరుపుతామని, అవసరమైతే శని, ఆదివారాల్లోనూ బెంచ్ పనిచేస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది.

కాగా, పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన మౌలిక హక్కులకు భంగం కలిగించే పక్షంలో ముస్లిం పర్సనల్ లాలో ఎంతమేరకు జోక్యం చేసుకోవచ్చనే దానిపైనా ధర్మాసనం పరిశీలించనుంది. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని బెంచ్ సహాయకుడిగా, సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్‌ను న్యాయ సలహాదారు (అమికస్ క్యూరీ)గా ధర్మాసనం నియమించింది. అయితే తమ మత విధానాల్లో కోర్టుల జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నామని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు మరికొన్ని సంస్థలు ఇప్పటికే స్పష్టంచేశాయి.