Begin typing your search above and press return to search.

ట్రంప్‌పై ఈ నిర‌స‌న గ‌ళాల‌కు రీజ‌నేంటంటే..!

By:  Tupaki Desk   |   24 Jan 2017 5:03 AM GMT
ట్రంప్‌పై ఈ నిర‌స‌న గ‌ళాల‌కు రీజ‌నేంటంటే..!
X
అగ్ర‌రాజ్యంగా ప‌రిగ‌ణిస్తున్న అమెరికా మొన్న‌టిదాకా బాగానే ఉంది. ఆ దేశానికి 45వ అధ్య‌క్షుడిగా ఆ దేశానికి చెందిన రియ‌ల్ ఎస్టేట్ టైకూన్ డొనాల్డ్ ట్రంప్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన మ‌రుక్ష‌ణ‌మే అక్క‌డి ప‌లు ప్రాంతాల్లో నిర‌స‌న‌లు హోరెత్తాయి. ఓ వైపు ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడిగా ప‌దవీ బాధ్య‌త‌లు చేప‌డుతుంటే... మ‌రోవైపు పెద్ద సంఖ్య‌లో రోడ్ల‌పైకి వ‌చ్చిన జ‌నం ఎక్క‌డిక‌క్క‌డ నిర‌స‌న‌ల ప‌ర్వానికి తెర తీశారు. ఈ నిర‌స‌న‌ల్లో పాల్గొన్న వారిలో మ‌హిళ‌ల‌దే అగ్ర తాంబూలం. వ్య‌క్తిగ‌తంగా దూకుడు మ‌న‌స్త‌త్వం క‌లిగిన ట్రంప్‌... ఈ ఆందోళ‌న‌ల‌పై అగ్గి మీద గుగ్గిల‌మ‌య్యారు.

ఏకంగా మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి... మీడియా ప్ర‌తినిధుల‌ను దునుమాడారు. మునుప‌టి వైఖ‌రికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తే... చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని కూడా కాస్తంత ఘాటు హెచ్చ‌రిక‌లే జారీ చేశారు. అయినా ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నికై రెండు నెల‌లు కావ‌స్తోంది. అయితే ఆ దేశ రాజ్యాంగం ప్ర‌కారం ఎన్నికైన రెండు నెల‌ల త‌ర్వాత గాని గెలిచిన వ్య‌క్తి అధ్య‌క్ష ప‌ద‌విని అధిష్టించ‌లేరు. ఎన్నిక‌ల్లో ట్రంప్ విజ‌యం సాధించిన సంద‌ర్భంగా ఆందోళ‌న చెంద‌ని జ‌నం... ఆయ‌న అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టిన మ‌రుక్ష‌ణ‌మే ఆందోళ‌న‌కు దిగ‌డం అమెరికా పాల‌క వ‌ర్గంతో పాటు ఇత‌ర ప్ర‌పంచ దేశాల‌ను కూడా షాక్ కు గురి చేసింద‌నే చెప్పాలి.

ట్రంప్‌ పై అంత వ్య‌తిరేక‌త ఉంటే... ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ఓటేయ‌కుండా ఉండింటే స‌రిపోయేది. ఎన్నిక‌ల స‌మ‌యంలో రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ఆయ‌న‌... ప్రచారంలోనే సంచ‌ల‌న కామెంట్ల‌తో వివాదాల‌కు కేరాఫ్ అడ్రెస్‌ గా నిలిచారు. అయినా... ఏమాత్రం బెద‌ర‌కుండా ట్రంప్ త‌న‌దైన దూకుడును కొన‌సాగించారు. ఎన్నిక‌ల్లో అందరి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి హిల్ల‌రీ క్లింట‌న్‌ ను మ‌ట్టి క‌రిపించారు. ఆ త‌ర్వాత జ‌రిగిన ఎల‌క్టోర‌ల్ కాలేజీ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న‌కు ఎదురే లేకుండా పోయింది. మ‌రి ఎన్నిక‌ల‌ప్పుడు ఏమ‌న‌ని జ‌నం... అధ్య‌క్ష ప‌ద‌విలో ట్రంప్ కూర్చోగానే ఎందుకు ర‌గిలిపోయిన‌ట్లు? ఇందుకు కార‌ణం కూడా లేక‌పోలేదు.

ఆ కార‌ణం వివ‌రాల్లోకెళితే... సాధార‌ణంగా అమెరికాలో ఎప్పుడైనా అధ్య‌క్ష స్థానంలో ఏ పార్టీ అభ్య‌ర్థి ఉన్నా... ఆ దేశ చ‌ట్ట‌స‌భ‌ కాంగ్రెస్‌ లో స‌ద‌రు నేత వైరి వ‌ర్గానికి చెందిన పార్టీకి బ‌లం ఉండ‌టం జ‌రుగుతూ వ‌స్తోంది. అంటే... రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థి అధ్య‌క్షుడైతే... డెమోక్ర‌టిక్ పార్టీకి కాంగ్రెస్‌ లో బ‌లం ఉండేది. డెమోక్ర‌టిక్ పార్టీ అభ్య‌ర్థి అధ్య‌క్షుడైతే... రిప‌బ్లిక‌న్ పార్టీకి కాంగ్రెస్‌ లో బ‌లం ఉండేది. ఫ‌లితంగా ఏ కీల‌క నిర్ణ‌యం తీసుకోవాల‌నుకున్నా స‌గ‌టు అమెరికా పౌరుడికి పెద్ద న‌ష్టం జ‌ర‌గ‌కుండా వ‌చ్చింది. అయితే ప‌రిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.

రిప‌బ్లిక‌న్ పార్టీకి ప్ర‌స్తుతం కాంగ్రెస్‌ లో తిరుగులేని మెజారిటీ ఉంది. అదే స‌మ‌యంలో అదే పార్టికి చెందిన ట్రంప్ ఆ దేశ అధ్య‌క్ష ప‌ద‌విని చేజిక్కించుకున్నారు. దీంతో ఏదేనీ కీల‌క నిర్ణ‌యం తీసుకోవాలంటే... ట్రంప్ ముందూ వెనుకా ఆలోచించాల్సిన అవ‌స‌రమే లేకుండా పోయింది. దూకుడు మ‌న‌స్త‌త్వం క‌లిగిన ట్రంప్ లాంటి నేత‌ల‌కు ఈ త‌ర‌హా వాతావ‌ర‌ణం అందుబాటులోకి వ‌స్తే... వారు తీసుకునే నిర్ణ‌యాల‌తో తామంతా ఇబ్బంది ప‌డ‌క త‌ప్ప‌ద‌ని సామాన్య అమెరిక‌న్ పౌరుడి భావ‌న‌. ఈ భావ‌న నుంచే ఒక్క ఉదుటున ఆందోళ‌న‌లు పెల్లుబికాయి. మ‌రి వీటికి ట్రంప్ ఏ విధంగా చెక్ పెడ‌తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/