Begin typing your search above and press return to search.

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు.. ఆదివారం ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   23 Dec 2019 4:56 AM GMT
పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు.. ఆదివారం ఏం జరిగింది?
X
పౌరసత్వ సవరణ చట్టంపై తొలుత ఆందోళనలు చెలరేగింది అసోంలో అయితే.. ఆ తర్వాత అక్కడ సద్దుమణిగితే.. అనూహ్యంగా కొన్ని రాష్ట్రాల్లో అంతకంతకూ పెరిగిన నిరసనలు కాల్పుల వరకూ వెళ్లటమే కాదు..పలు ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాయని చెప్పక తప్పదు. అన్నింటికంటే ఎక్కువగా బీజేపీ పాలిత రాష్ట్రమైన యూపీలో గొడవలు పెద్ద ఎత్తున చోటు చేసుకోవటమే కాదు.. ప్రాణనష్టం తీవ్రత ఈ రాష్ట్రంలోనే ఎక్కువగా చెబుతున్నారు.

లక్నో.. మీరట్.. ఫిరోజాబాద్.. కాన్పూర్.. బిజ్నోర్ తదితర ప్రాంతాల్లో ఆందోళనలు పెద్ద ఎత్తున చెలరేగటం తెలిసిందే. తాను తీసుకున్న నిర్ణయాలను ఏమైనా అమలు చేయాలే తప్పించి వెనక్కి తగ్గేది లేదన్నట్లుగా వ్యవహరించే ప్రధాని మోడీ సైతం.. పౌరసత్వ సవరణ చట్టంపై పెల్లుబుకుతున్న నిరసనలపై ఆదివారం రియాక్ట్ అయ్యారు. కీలక ప్రకటన చేశారు. కోర్టు ఆదేశాలతోనే అసోంలో ఎన్ఆర్సీని అమలు చేశామని.. అసత్యాలతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారన్నారు. ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదన్న భరోసా ఇచ్చిన ఆయన.. దేశ వ్యాప్త ఎన్ ఆర్ సీపైన తాము చర్చించలేదంటూ ఇటీవల పెల్లుబుకుతున్న నిరసనలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.

పౌరసత్వ సవరణ చట్టం కంటే కూడా ఎన్ఆర్సీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయటం ద్వారా.. జంట నిరసనల్లో కీలకమైన దానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారని చెప్పాలి. 130 కోట్ల మంది దేశ ప్రజలకు తాను ఒక్క విషయం చెప్పదలుచుకున్నానని.. 2014లో తాము అధికారాన్ని చేపట్టిన తర్వాత నుంచి ఇప్పటివరకూ ఎప్పుడూ తాము దేశ వ్యాప్త ఎన్నార్సీపై చర్చ జరపలేదని.. అసోంలోనూ సుప్రీం ఆదేశాల కారణంగానే తాము అమలు చేసినట్లు చెప్పటం ద్వారా.. కొద్ది రోజులుగా సాగుతున్న ఆందోళనలు.. నిరసనలకు పుల్ స్టాప్ పెట్టాలన్న రీతిలో వ్యాఖ్యలు చేశారని చెప్పాలి.

ఇదిలా ఉంటే సెలవురోజు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న అల్లర్లు ఆదివారం కాస్త తగ్గుముఖం పట్టాయి. యూపీలోని పలు పట్టణాల్లో ప్రశాంతత నెలకొంది. ఆల్లర్ల కారణంగా బాధితులైన వారిని పరామర్శించేందుకు వచ్చిన బెంగాల్ అధికార పార్టీకి చెందిన తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతల్ని లక్నో ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్తాన్ లో పౌరసత్వ సవరణ చట్టం.. ఎన్నార్సీలకు వ్యతిరేకంగా సీఎం అశోక్ గెహ్లోత్ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని జైపూర్ లో భారీ ర్యాలీని నిర్వహించారు. దీనికి మూడు లక్షల మంది వరకూ పాల్గొన్నట్లు చెబుతున్నారు.

బిజ్నోర్ లో చోటు చేసుకున్న అల్లర్ల కారణంగా బాధితుల కుటుంబాల్ని కాంగ్రెస్ నేత ప్రియాంక పరామర్శించగా.. మహారాష్ట్రలోని నాగపూర్ లో పౌర సవరణ చట్టానికి అనుకూలంగా సాగిన ర్యాలీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోదన్న భరోసాను ఇచ్చారు. వారికి ఎలాంటి అన్యాయాన్ని తాము చేయమన్నారు.

పౌరసవరణ చట్టంపై సాగుతున్న ఆందోళనల వెనుక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా.. సిమి కార్యకర్తల హస్తం ఉందంటూ పశ్చిమబెంగాల్ పోలీసులు వెల్లడించారు. బెంగాల్ లో చోటు చేసుకున్న హింస వెనుక ఉన్నవారిని ఇప్పటికే అరెస్ట్ చేశామన్నారు. ఆందోళనలు నిర్వహించిన ఈశాన్య రాష్ట్రాలతో పాటు.. ఢిల్లీ.. బిహార్.. రాజస్థాన్.. తమిళనాడుల్లో ఆందోళనలు ప్రశాంతంగా ముగిసాయి. మొత్తమ్మీదా గత వారంతో పోలిస్తే.. వారాంతమైన ఆదివారం ఆందోళనలు ప్రశాంతంగా సాగాయని చెప్పక తప్పదు.