Begin typing your search above and press return to search.

అమెరికా నిరసనల సెగ భారతీయ దుకాణాలకు తగిలింది

By:  Tupaki Desk   |   3 Jun 2020 10:50 AM GMT
అమెరికా నిరసనల సెగ భారతీయ దుకాణాలకు తగిలింది
X
ఒక పోలీసు అధికారి ఆరాచకం కారణంగా యావత్ అమెరికా రగిలిపోయేలా చేయటమే కాదు.. అన్ని రాష్ట్రాల్లోనూ నిరసనలు.. ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ పట్ల క్రూరంగా వ్యవహరించి.. అతడి మరణానికి కారణమైన పోలీసు అధికారిపై కోపం.. అమెరికాలో పెను విధ్వంసానికి కారణంగా మారింది. నిరసనల్లో భాగంగా పలు షాపుల్ని లూటీ చేయటమే కాదు.. చాలా దుకాణాల్ని దోచేశారు. తమ ఆగ్రహాన్ని ప్రదర్శించుకునేందుకు ఎవరికి తోచిన విధ్వంసానికి వారు పాల్పడినట్లుగా చెబుతున్నారు.

ఇలాంటివేళ.. అమెరికాలోని భారతీయ దుకాణాల సంగతేమిటి? అన్నది చూస్తే.. ఈ విద్వంసంలోచాలానే షాపులు అగ్నికి ఆహుతి అయిపోయినట్లు తెలుస్తోంది. మాయదారి రోగం కారణంగా గడిచిన కొద్దినెలలుగా వ్యాపారాలు దారుణంగా దెబ్బ తింటే.. తాజాగా నెలకొన్న ఆందోళనల కారణంగా దివాళా తీసే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.

మినియాపోలిస్ లో భారతీయులకు చెందిన పలు దుకాణాలు ఉన్నాయి. ఇప్పటివరకూ ఇక్కడి భారతీయుల దుకాణాల్నివందల సంఖ్యలో నష్టపోయినట్లు తెలుస్తోంది. ఒక అంచనా ప్రకారం 308 దుకాణాలు.. రెస్టారెంట్లు విధ్వంసానికి గురైనట్లు స్థానిక మీడియా చెబుతోంది. గాంధీ మహల్ రెస్టారెంట్.. హండీ రెస్టారెంట్.. ఇంటర్నేషనల్ బజార్.. అనన్య డ్యాన్స్ థియేటర్ లాంటి ఎన్నో ప్రవాసీయుల దుకాణాలు.. వాణిజ్య సంస్థలపై దాడి జరిగినట్లుగా చెబుతున్నారు. ఒక భారతీయ కుటుంబానికి చెందిన కార్ల షోరూం కూడా నిరసనల్లో పూర్తిగా కాలిపోయింది. అమెరికా వ్యాప్తంగా నిరసనలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్న ప్రతి చోట భారతీయులకు చెందిన వాణిజ్య సంస్థలకు అంతో ఇంతో నష్టం జరుగుతుందని చెబుతున్నారు.