Begin typing your search above and press return to search.

బీజేపీ, టీఆరెస్ ఫైట్ జస్ట్ మిస్

By:  Tupaki Desk   |   18 Sep 2015 8:27 AM GMT
బీజేపీ, టీఆరెస్ ఫైట్ జస్ట్ మిస్
X
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, టీఆరెస్ శ్రేణులు ఫైటింగ్ కు సిద్ధపడ్డాయి. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేసుకుంటూ... ఒకరినొకరు నెట్టుకునేవరకు వెళ్లారు. ఒక దశలో రెండు పార్టీల కార్యకర్తలు కొట్టుకోవడం ఖాయమని కూడా అంతా భావించారు... అయితే, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో టీఆరెస్ ఎంపీ జోక్యం చేసుకుని అందరినీ చల్లబరిచారు. టీఆరెస్ పార్టీ చేపట్టిన ఓ అభివృద్ధి కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ విషయంలో ప్రోటోకాల్ పాటించకపోవడంతో ఈ వివాదం తలెత్తింది. ఇది చినికిచినికి గాలివానై రెండు పార్టీల కార్యకర్తలు కొట్టుకునే వరకు వెళ్లింది.

మహబూబ్ నగర్ జిల్లా లో మక్తల్ వద్ద రోడ్డు విస్తరణ పనులకు తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే... ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు ప్రోటోకాల్ పాటించలేదని... శిలాఫలకంపై ఆయన పేరు రాయలేదని ఆరోపిస్తూ బిజెపి కార్యకర్తలు నిరసన తెలిపారు. దీనికి సమాధానమేం చెబుతారంటూ వారు మంత్రిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో టీఆరెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. తమ నాయకుడినే అడ్డుకుంటారా అంటూ బీజేపీ కార్యకర్తలపై ఎదురుదాడికి దిగారు. బీజేపీ కార్యకర్తలు కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు ప్రారంభించడంతో... ప్రతిగా టీఆరెస్ వారు కేసీఆర్ జిందాబాద్ అంటూ గొంతెత్తుకున్నారు. దీంతో అక్కడ చాలాసేపు ఏం జరుగుతోందో అర్థంకానంత గందరగోళం ఏర్పడింది. నినాదాలు... అరుచుకోవడాలు శ్రుతిమించి బాహాబాహీకి దిగే పరిస్థితులు కనిపించడంతో అక్కడున్న ఎంపీ జితేందర్ రెడ్డి రెండు వర్గాలకు సర్దిచెప్పారు. దీంతో కాసేపటికి ఉద్రిక్తతలు చల్లారాయి. జితేందర్ రెడ్డే కనుక సకాలంలో చోక్యం చేసుకోకపోతే రెండుపార్టీలవారు తన్నుకునేవారని అక్కడున్నవారు చెబుతున్నారు. అదే కనుక జరిగితే రెండు పార్టీల మధ్య ఇది పెద్ద వివాదమై కూర్చునేది.