Begin typing your search above and press return to search.

అయోధ్యలో భూమిని చదును చేస్తుంటే ఏమేం దొరికాయంటే?

By:  Tupaki Desk   |   22 May 2020 6:30 PM GMT
అయోధ్యలో భూమిని చదును చేస్తుంటే ఏమేం దొరికాయంటే?
X
రామజన్మభూమి గురించి.. అక్కడున్న వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. ఈ మధ్యనే సుప్రీమ్ కోర్టు ఇచ్చిన చారిత్రతీర్పుతో వందేళ్లకు పైగా సాగుతున్న వివాదానికి పుల్ స్టాప్ పడటంతో పాటు.. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించే అవకాశం లభించింది. ఇదిలా ఉంటే.. అక్కడి స్థలాన్ని చదును చేసే క్రమంలో తాజాగా కొన్ని శిథిలాలు బయటపడటం ఆసక్తికరంగా మారింది.

వివాదాస్పద కట్టటం ఒకప్పటి రామాలయంగా పేర్కొనటం.. దానికి సంబంధించి ఆధారాల మీద..చరిత్ర మీద పెద్ద ఎత్తున వాదనలు జరిగాయి. దీనికి హిందుత్వ వాదులు ఒకలా.. వామపక్షవాదులు మరోలా వాదనలు వినిపించటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా దొరికిన ఆలయనశిథిలాల్లో ఐదు అడుగుల శివలింగం.. చెక్కడాలున్న ఏడు నల్ల గీటురాయి స్తంభాలు.. ఆరు ఎర్ర ఇసుకరాతి స్తంభాలు.. విరిగిన దేవతా విగ్రహాలుబయటపడినట్లుగా చెబుతున్నారు.

ఈ నెల పదకొండు నుంచి ఇక్కడ భూమిని చదును చేసే పనులు చేపట్టారు.ఈ సందర్భంగా అక్కడ పలు వస్తువులు బయపడుతున్నట్లుగా విశ్వహిందూపరిషత్ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ పేర్కొన్నారు. బాబ్రీ మసీదు కింది భాగంలో ఒక ఆలయం ఉందని.. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ రీజనల్ డైరెక్టర్ కేకే మహ్మద్ గతంలోనే చెప్పారు. ఆయన వాదనకు బలం చేకూరేలా తాజా వస్తువులు దొరికినట్లుగా పలువురు చెబుతున్నారు.

వివాదాస్పద కట్టడం మీద సామరస్యపూర్వక పరిష్కారం రాకుండా ఉండేందుకు ఇర్ఫాన్ హబీబ్.. రోమిల్లాథాపర్.. బిపిన్ చంద్ర.. ఎస్.గోపాల్ లాంటి వామపక్ష చరిత్రకారులు అడ్డుకున్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. వివాదాస్పద కట్టడం ఉన్న ప్రాంతంలో టెర్రకోట శిల్పాలు లభించాయని.. అలాంటివి ఇస్లాంలో నిషిద్దం కావటంతో.. గతంలో అక్కడో ఆలయం ఉందనటానికి నిదర్శనాలుగా చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే.. త్వరలో జరిగే బిహార్.. పశ్చిమబెంగాల్.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలవటానికి వీలుగా తాజా ప్రచారాన్ని షురూ చేసినట్లుగా సున్నీ వక్ఫ్ బోర్డు న్యాయవాది జిలానీ ఘాటుగా ఆరోపిస్తున్నారు. రామజన్మ భూమి ప్రాంతంలో తాజాగా బయటపడిన శిథిలాలు ఆసక్తికరంగానే కాదు.. కొత్త రాజకీయానికి తెర తీసేలా మారినట్లుగా చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.