Begin typing your search above and press return to search.

భీమ‌వ‌రంలో ఈసారి వైఎస్సార్సీపీకి ఓట‌మి త‌ప్ప‌దంటున్న పృథ్వీ

By:  Tupaki Desk   |   30 Jun 2022 5:30 PM GMT
భీమ‌వ‌రంలో ఈసారి వైఎస్సార్సీపీకి ఓట‌మి త‌ప్ప‌దంటున్న పృథ్వీ
X
ప్రముఖ కమెడియన్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన నేతలపై ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. అంతేకాకుండా అమరావతి రైతుల ఉద్యమంపై పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

ఆ తర్వాత వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో పృథ్వీకి శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఆ పదవిలో ఉంటూ తిరుమలలో మంచి దర్జా అనుభవించారు. ఆ తర్వాత ఒక మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ.. ఆమెతో అసభ్యంగా మాట్లాడారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఆడియోలు వైరల్ గా మారాయి. దీంతో పృథ్వీని వైఎస్సార్సీపీ అధిష్టానం ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి తప్పించింది.

అప్పటి నుంచి పృథ్వీని వైఎస్సార్సీపీలో పట్టించుకున్నవారు లేరు. మరోవైపు వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు చేసిన అతికి సినిమా రంగం నుంచి కూడా అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో తప్పు తెలుసుకున్న పృథ్వీ క్షమాపణ చెప్పారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకునే తాను సినిమాలకు వచ్చానని.. మెగా కుటుంబం అంటే తనకు ఎంతో గౌరవమని చెప్పారు. రాజకీయంగా ఎవరి గురించైనా మాట్లాడి ఉంటే అందుకు క్షమాపణలు తెలుపుతున్నానన్నారు. ప్రస్తుతం పృథ్వీ సినిమాల్లో నటిస్తున్నారు.

మరోవైపు జనసేన పార్టీలో పృథ్వీ చేరతారని వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ మంచి నాయకుడని, ప్రజల కోసం కష్టపడే నాయకుడని, ప్రజలు ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని పలు యూట్యూబ్, టీవీ ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. ఈసారి జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో సంచలన ఫలితాలు సాధిస్తుందని.. పవన్ కల్యాణ్ కింగ్ మేకర్ అవుతారని, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉందని పృథ్వీ ఢంకా బజాయించి చెబుతుండటం విశేషం. మరికొద్ది రోజుల్లో ఆయన జనసేనలో చేరే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.

తాజాగా మ‌రోమారు పృథ్వీ మీడియాతో మాట్లాడుతూ సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. ఈసారి కూడా తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాన‌ని అంటున్నారు. జ‌న‌సేన‌ బీఫామ్ తో భీమ‌వ‌రంలో నిలబ‌డతాన‌ని చెబుతున్నారు. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు దెబ్బతిన్నారో.. అక్కడే పోటీ చేసి.. హిస్టరీ రిపీట్ అని డైలాగ్ కొడతా అంటున్నారు. ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంద‌ని వైఎస్సార్సీపీకి పృథ్వీ హెచ్చ‌రికలు జారీ చేస్తున్నారు.

తాను కేవలం డైలాగ్‌లు చెప్పడం లేద‌ని పృథ్వీ అంటున్నారు. ఈసారి ఏం జరగబోతుందని గ్రౌండ్ లెవల్‌ నుంచి వర్క్ చేసి మరీ చెబుతున్నామ‌ని పృథ్వీ చెబుతుండ‌టం విశేషం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కేవలం జనసేనకు మాత్రమే కలిసి వస్తుంద‌ని ఆయ‌న అంటున్నారు. టీడీపీకి అవకాశం ఉండద‌ని పేర్కొంటున్నారు. ఈసారి బాల్ త‌మ‌ కోర్టులోనే ఉంద‌ని వివ‌రిస్తున్నారు. ఈసారి ప్రజలు జనసేనవైపు మాత్రమే ఉంటారని పృథ్వీ చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.