Begin typing your search above and press return to search.

రెండున్నర లక్షల కోట్ల లోన్లు రద్దు చేశారట!

By:  Tupaki Desk   |   4 April 2018 11:11 AM GMT
రెండున్నర లక్షల కోట్ల లోన్లు రద్దు చేశారట!
X
ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు.. వంద‌లు కాదు వేలు కూడా కాదు..ఏకంగా 2.41 లక్షల కోట్లు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మూడేళ్లలో రద్దు చేచేశారు. ఇదేదో అంచ‌నా కాదు...సాక్షాత్తు అధికారికంగా ఇచ్చిన వివ‌రాలు. ఏప్రిల్ 2014 నుంచి సెప్టెంబర్ 2017 మధ్య ఈ రుణాలను రద్దు చేసినట్లు ఆర్థిక శాఖ సహాయమంత్రి శివప్రతాప్ శుక్లా పార్లమెంట్ సాక్షిగా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ (నిరర్ధక ఆస్తులు) లేదా వసూలు కాని రుణాలను ప్రతి ఏటా బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్‌ ను తొలగించడం సాధారణ ప్రక్రియే అని శుక్లా రాజ్యసభలో చెప్పారు.

తాజాగా మంత్రి పెద్ద‌ల స‌భ‌లో వివ‌రిస్తూ....రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఈ మూడేళ్లలో రూ.2,41,911 కోట్ల రుణాలను రద్దు చేశారు అని వెల్లడించారు. అయితే లోన్లను బ్యాలెన్స్ షీట్ నుంచి తొలగించినంత మాత్రాన రుణాలు తీసుకున్నవారిని వదిలేది లేదని ఆయన చెప్పారు. ఇప్పటికే రుణాలు వసూలు చేయడానికి బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాయని శుక్లా తెలిపారు. అయితే మూడేళ్లలోనే ఇన్ని లక్షల కోట్ల రుణాలు రద్దు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కేంద్రం ఇచ్చిన ఈ స‌మాచారంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి - బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఓవైపు రుణాలు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ప్రభుత్వం మాత్రం అది పట్టించుకోకపోగా పెద్దోళ్లు తీసుకున్న రుణాలను రద్దు చేస్తారా అంటూ విమర్శించారు. పైగా ఈ రుణాలు ఎవరు తీసుకున్నారన్న విషయాన్ని కూడా మంత్రి చెప్పకపోవడంపై మమతా మండిపడ్డారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారి వివరాలు ఇవ్వడం కుదరదని పార్లమెంట్‌ లోనే ప్రభుత్వం చెప్పడం దారుణమని మమతా అన్నారు. గత ఐదేళ్లలో బ్యాంకుల నిరర్ధక ఆస్తులు రెట్టింపు కావడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ మందగించడంతో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేని స్థితిలో చాలా వరకు సంస్థలు ఉన్నాయి.