Begin typing your search above and press return to search.

ఆ సైకో దగ్గర 49 వేల మంది అమ్మాయిల డేటా

By:  Tupaki Desk   |   27 Oct 2015 6:07 AM GMT
ఆ సైకో దగ్గర 49 వేల మంది అమ్మాయిల డేటా
X
విద్యా.. ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం.. సలహాలు ఇచ్చే నెపంతో అమ్మాయిలతో పరిచయం పెంచుకోవటం.. వారికి మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకొని వందలాది మంది అమ్మాయిల్ని మోసం చేసిన సైకో మధుకు సంబంధించిన కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జాబ్ కన్సల్టెన్సీ పేరుతో యువకుల్ని వలలో వేసుకోవటమే కాదు.. ఇంటర్నెట్ సెంటర్ నుంచి సేకరించిన సమాచారంతో అమ్మాయిల డేటా బ్యాంక్ ను తయారు చేసి.. టార్గెట్ చేసి మరీ వేధింపులకు గురి చేసే ఇతగాడి భాగోతాన్ని తవ్వుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇతగాడి విపరీత మనస్తత్వానికి పోలీసులు సైతం విస్మయం చెందుతున్న పరిస్థితి.

దాదాపు మూడు వేల మంది అమ్మాయిల ఫోన్ నెంబర్లు సేకరించి.. ఇప్పటివరకూ 300 మంది అమ్మాయిల్ని మోసం చేసిన మధు దగ్గర వాస్తవానికి 49 వేల మంది అమ్మాయిల వివరాలు ఉన్నట్లు చెబుతున్నారు. తాను సేకరించిన డేటాను ఒక క్రమపద్ధతిలో డేటా ఎంటర్ చేయటంతో పాటు.. ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయటం.. పలు రకాల సిమ్ ల సాయంతో వారికి ఫోన్లు చేసి బుట్టలో వేసుకునే ప్రయత్నం చేసేవాడు.

ఎనిమిదేళ్ల క్రితమే ఉద్యోగం వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోవటానికి ఏ మాత్రం ఒప్పుకోని మధుకు సంబంధించిన నేర ప్రవృతి విన్న వారు విస్మయానికి గురి అవుతున్నారు. ఇంట్లో పెళ్లి మాట ఎత్తితే చాలు.. ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లో వాళ్లను బెదిరించిన మధు.. గుట్టుగా మాత్రం వందలాది మంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేయటం గమనార్హం.

గతంలో ఒకసారి పోలీసులు కేసు నమోదు చేసినా.. బయటకు వచ్చేసిన ఇతగాడు.. ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలోనూ.. త్వరలోనే తాను బయటకు వస్తానని.. వచ్చన తర్వాత మళ్లీ తన దందా మొదలు పెడతానని పోలీసుల ఎదుటే బాహాటంగా చెప్పుకున్న ఇతగాడి తెంపరితనంపై దృష్టి సారించిన పోలీసులు.. మధుపై పీడీ యాక్ట్ పెట్టాలని భావిస్తున్నారు. అతగాడ్ని విచారించటానికి ఎనిమిది రోజులు పోలీసుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనున్నారు. ఒకవేళ కోర్టు కానీ ఓకే చెప్పి అనుమతి ఇస్తే.. పోలీసుల విచారణలో చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇలాంటి సైకోల విషయంలో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సాయం చేస్తానని చెప్పటం.. తియ్యగా మాటలు చెప్పే వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరమన్న విషయాన్ని మర్చిపోకూడదు.