Begin typing your search above and press return to search.

పవన్.. చిరంజీవిలా కాకుండా చూసుకో!!

By:  Tupaki Desk   |   28 Aug 2016 11:38 AM GMT
పవన్.. చిరంజీవిలా కాకుండా చూసుకో!!
X
తిరుపతిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ పెట్టిన తరువాత ఏపీ రాజకీయాల్లో కదలిక వచ్చింది. దీనిపై రాజకీయంగా పార్టీలు, వ్యక్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నట్లే ప్రజలు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా దీనిపై ఓ ఛానల్ ప్రజాభిప్రాయం తీసుకోగా విశాఖపట్నం ప్రజలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ చొరవను ఆహ్వానిస్తూనే ఇలా అప్పుడప్పుడు మెరుపులా మెరిసి తరువాత మళ్లీ మాయమైపోయే వైఖరిని పవన్ మార్చుకుంటనే ఆయన్ను నమ్ముతామని అన్నారు. తిక్క రేగినప్పుడు సభలు పెట్టి తరువాత లెక్క కుదిరితే మళ్లీ కొన్నాళ్ల పాటు అఙాతంలోకి వెళ్లిపోతానంటే ఆయన్ను తామెలా నమ్ముతామని కొందరు ప్రశ్నించారు. మరికొందరు... పవన్ తన అన్న చిరంజీవిలా కాకూడదని అన్నారు.

ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెతను గుర్తు పెట్టుకుని చిరంజీవిని కూడాకలుపుకొని వెళ్లాలని పలువురు సూచించారు. అలాగే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వానికి సహకరించాలని.. అమరావతి నిర్మాణానికి సహకరించాలని, ఆ తరువాతే సభలు, ధర్నాలు చేయాలని సూచించారు.మరికొందరు మాత్రం పవన్ ప్రసంగం బాగుందంటూనే ఆయన పరిపక్వత పెంచుకోవాలని, పూర్థిస్థాయి రాజకీయ నాయకుడు కాదు కాబట్టి ఆచితూడి అడుగువేయాలని సూచించారు. పలువురు విభజన నాటి పరిణామాలను, అన్యాయాన్ని గుర్తు చేసుకుని బీజేపీ కనుక ఏపీకి అన్యాయం చేస్తే కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఏపీకి స్పెషల్ స్టేటస్, విశాఖకు రైల్వే జోన్ ఇచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు.

ప్రత్యేక హోదా అంశం 2014 నుంచి నలుగుతోందని.. ఆ తరువాత పవన్ రెండు మూడు సార్లు మాత్రమే దీనిపై మాట్లాడారని.. అలా కాకుండా ప్రజల్లో నమ్మకం కలిగేలా పవన్ దీనిపై స్పష్టమైన విధానంలో, నిర్మాణాత్మకంగా నిరంతర పోరాటం చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. మోడీ తనకు తెలుసని చెప్పే పవన్.. ఆ స్నేహంతో నేరుగా మోడీనే వెళ్లి అడగాల్సిన బాధ్యత పవన్ ఉందని కొందరు పేర్కొన్నారు. పవన్ ను ముందుకు తేవడం కూడా రాజకీయ వ్యూహమేనని... పవన్ ఇలాగే చేస్తే ఆయన పార్టీ కూడా చిరంజీవి పార్టీ లాగే గాల్లో కలిసిపోతుందని అంటున్నారు. మరికొందరు మాత్రం నిన్న పవన్ మగాడిలా మాట్లాడారని..నాయకులను నిలదీశారని.. వారువీరని కాకుండా అందరినీ ప్రశ్నించారని పలువురు మహిళలు అభిప్రాయపడ్డారు. ఇదంతా బాగానే ఉన్నా చంద్రబాబు, మోడీలు పవన్ కు నేరుగా పరిచయస్థులు కాబట్టి వారి వద్దే ప్రశ్నించడంలో పవన్ కు మొహమాటమెందుకని ప్రశ్నించారు.

మిగతా పార్టీలు కూడా ప్రత్యేక హోదా సాధన కంటే ఆ అంశంతో తమకెంత మైలేజి వస్తుందన్న లెక్కల్లోనే ఉంటున్నారని.. అలా కాకుండా అందరూ కలిసి పోరాడితే ప్రత్యేక హోదా కచ్చితంగా వస్తుందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఆంధ్రులు అమాయకులు, వారిని దోచుకోవచ్చన్న భావనను పోగొట్టి ప్రత్యేక హోదా సాధించుకుంటే అదే తెలుగువారి ఆత్మగౌరవం సాధించిన విజయమని కొందరు అభిప్రాయపడ్డారు. ఏపీకి అన్యాయం చేస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని కూడా పలువురు హెచ్చరించారు. మొత్తానికి పవన్ సామర్థ్యంపై ప్రజల్లో నమ్మకం కనిపిస్తున్నా ఆయన స్థిరత్వం చూపించాలని.. తన పలుకుబడి, ప్రజాదరణతో ప్రత్యేక హోదా సాధించగలిగే సత్తా ఆయనకు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ రాజకీయ అనుభవం, వయసు తక్కువన్న సమస్యే లేదని... పవన్ లాంటి ఉన్నత భావజాలం ఉన్నవారు రంగంలోకి దిగితే ప్రయోజనమే కానీ ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్లిపోతారో అన్నట్లుగా ఉంటే మాత్రం లాభం లేదని అంటున్నారు. మొత్తానికి పవన్ ప్రత్యేక హోదా చొరవ మాత్రం ప్రజల్లో బాగానే స్ప్రెడ్ అయిందని అర్థమవుతోంది. ప్రజల్లో తన పవర్ పై నమ్మకం.. అదే సమయంలో స్థిరత్వం లేదన్న అభిప్రాయం రెండూ ఉన్న విషయాన్ని అర్థం చేసుకొని పవన్ తన పట్ల ప్రజల్లో ఉన్న దురభిప్రాయాలను తొలగించి, నమ్మకాన్ని పెంచుకుంటే మాత్రం ప్రత్యేక హోదా సొంతమై తెలుగు ప్రజల కల నెరవేరడం ఖాయం.