Begin typing your search above and press return to search.

ఆ బీజేపీ ఎంపీ లెక్సాస్ ఎస్.యూ.వీ కారును కూడా వదల్లేదు!

By:  Tupaki Desk   |   15 July 2022 11:30 AM GMT
ఆ బీజేపీ ఎంపీ లెక్సాస్ ఎస్.యూ.వీ కారును కూడా వదల్లేదు!
X
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 'పసుపు బోర్డు' తెస్తానని రైతులకు మాట ఇచ్చి ఏకంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఓడించాడు ధర్మపురి అరవింద్. నిజామాబాద్ పార్లమెంట్ పై బీజేపీ జెండా ఎగురవేశాడు. నాడు కవితను ఓడించేందుకు రైతులను పావుగా వాడిన అరవింద్ కు ఇప్పుడు అదే రైతులు ఎదురుతిరుగుతున్నారు. పసుపు బోర్డు ఏదని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల, ఆర్మూర్ రైతులు ఇప్పటికే నిలదీశారు.

తాజాగా ఓ గ్రామస్థులు సైతం ధర్మపురి అరవింద్ కు ఎదురు తిరిగిన పరిస్థితి నెలకొంది. గోదావరి ముంపును పరిశీలించడానికి వెళుతున్న ఎంపీ ధర్మపురి అరవింద్ ను జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండి గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామానికి సంబంధించిన భూవివాదం పరిష్కరిస్తానని మాట ఇచ్చి ఎందుకు నెరవేర్చలేదని ఎంపీ అరవింద్ ను అడ్డుకున్నారు. గ్రామానికి సంబంధించిన భూవివాదం పరిష్కరించకుండా ఎందుకు వచ్చారంటూ నిలదీశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

పోలీసులు వచ్చి అతి కష్టం మీద గ్రామస్థులను పక్కకు తప్పించారు. కానీ బీజేపీ కార్యకర్తలు కొందరు గ్రామస్థులపై దాడి చేశారు. అనంతరం ముంపు గ్రామాలను పరిశీలించి తిరిగి వచ్చిన అర్వింద్ ను మళ్లీ కోపంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. తమపై దాడి చేసినందుకు ప్రతీకారంగా ఏకంగా ఎంపీ అరవింద్ ముచ్చటపడి కోట్లు పోసి కొనుక్కున్న కారుపై దాడి చేసి ధ్వంసం చేశారు.

వేలో, లక్షలో అయితే గమ్మున ఊరుకోవచ్చు. కానీ ఆ కారు విలువ అక్షరాల రూ.2.85 కోట్ల రూపాయలు. అంతటి ఖరీదైన 'లెక్సాస్ ఎస్.యూవీ' లగ్జరీ కారును ఎంపీ అరవింద్ ముచ్చటపడి కొనుక్కున్నాడు. కానీ ఇప్పుడు గ్రామస్థుల ఆగ్రహానికి ఆ కారు అద్దాలు, కారు కూడా ధ్వంసమైంది.

కాస్లీ కారు అని కూడా చూడకుండా గ్రామస్థులు దాడి చేయడంపై బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహించారు. ఇక అన్ని కోట్ల కారు దాడిలో అద్దాలు పగిలి నాశనం కావడంతో అరవింద్ మరింతగా బాధపడిపోయినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిజామాాబాద్ ఎంపీ అరవింద్ తన పార్లమెంట్ పరిధిలో అసలు పర్యటనలే తగ్గించేశాడు. ఎందుకంటే ఓవైపు ఎక్కడికి వెళ్లినా పసుపు రైతులు నిలదీస్తున్నారు. మరోవైపు తను ఇచ్చిన హామీలేవీ నెరవేర్చకపోవడంతో ఆయా గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. ఈక్రమంలోనే భారీ వరదకు పరిశీలనకు వచ్చిన ఎంపీ అరవింద్ కు ఇక్కడ కూడా చేదు అనుభవమే ఎదురైంది.