Begin typing your search above and press return to search.

జగన్ బాట పట్టిన పంజాబ్ ముఖ్యమంత్రి

By:  Tupaki Desk   |   29 March 2022 11:30 AM GMT
జగన్ బాట పట్టిన పంజాబ్ ముఖ్యమంత్రి
X
సంచలన విజయాన్ని సొంతం చేసుకోవటం ద్వారా పంజాబ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారాన్ని సైతం ఇప్పటివరకు మరెవ్వరూ చేయని విధంగా చేయటం ద్వారా.. తాను మిగిలిన రాజకీయ నేతలకు భిన్నమన్న విషయాన్ని చేతల్లో చెప్పేశారు భగవంత్ మాన్. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. పాలనా పరమైన అంశాల విషయంలో ఆయన అంచనాలకు మించి పని చేస్తున్న అభిప్రాయాన్ని మూటకట్టుకుంటున్నారు.

పాలనలో మొదటి రోజు నుంచే ఫీల్ గుడ్ భావనను కలిగిస్తున్న భగవంత్ తాజాగా ప్రకటించిన నిర్ణయం ఆసక్తికరంగా మారింది. అయితే.. ఈ విధానాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఏపీలో అమలు చేస్తున్నారు. ఇంతకీ భగవంత్ తాజాగా ప్రకటించిన నిర్ణయం ఏమంటే.. రేషన్ లబ్ధిదారులు ఇక నుంచి రేషన్ కోసం క్యూ లైన్లలో నిలుచోవాల్సిన అవసరం లేకుండా నేరుగా లబ్థిదారుల ఇంటికే రేషన్ వచ్చేలా కొత్త విధానాన్ని ప్రకటించారు. అయితే.. తాను ప్రవేశ పెట్టిన కొత్త విధానాన్ని సరికొత్తగా ప్రచారం చేసుకోవటంతో భగవంత్ మార్కు కనిపిస్తోంది. పేద ప్రజల్ని ఇట్టే ఆకట్టుకునేలా ఆయన చేస్తున్న ప్రచార హడావుడిని చూశాక.. ఏపీ సీఎం జగన్ సైతం ఈ పథకం ప్రచార స్టైల్ ను కాస్త మార్చుకుంటే బాగుంటుందన్న భావన కలుగక మానదు.

ఇంటి గుమ్మం వద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేసే విధానం పంజాబ్ ప్రజలకు కొత్తది. కానీ.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఇది బాగా సుపరిచితం. ఎందుకంటే.. ఏపీలో రేషన్ ను ఇంటికే పంపుతోంది ఏపీ ప్రభుత్వం. తెలంగాణలో మాత్రం రేషన్ ను డీలర్ వద్దకే వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది.

అయితే.. తాను ప్రవేశ పెట్టిన కొత్త పథకానికి భగవంత్ తనదైన స్టైల్లో ప్రచారం చేస్తున్నారు. డబ్బులున్నవాళ్లు ఇంట్లో కూర్చొని అన్ని తమ వద్దకే తెచ్చుకుంటున్నారని.. పేదలు మాత్రం రేషన్ కోసం షాపుల ముందు క్యూ కడుతున్నారన్నారు.

అందుకే.. రేషన్ ను పేదల ఇంటి వద్దకే చేర్చేలా తమ కొత్త విధానం ఉంటుందని ప్రకటించారు. రేషన్ ను తీసుకోవటం కోసం ఇంటిని వదిలేసి.. గంటల కొద్దీ సమయాన్నిరేషన్ షాపుల వద్దే గడపటం.. అందుకోసం కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించాల్సి వస్తోందన్నారు.

అందుకే.. రేషన్ ను లబ్థిదారుల ఇంటికి చేర్చేందుకు నాణ్యమైన గన్నీ బ్యాగులో ప్యాక్ చేసి ఇంటి వద్దకే పంపుతామని ఆయన చెబుతున్నారు. ఏపీ సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి పాటించటం చూస్తే.. జగన్ సంక్షేమం రానున్న రోజుల్లో మరిన్ని రాష్ట్రాల్లో విస్తరించే అవకాశాన్ని కొట్టి పారేయలేం.