Begin typing your search above and press return to search.

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం వెనుక పూజారా, రహానే?

By:  Tupaki Desk   |   16 Jan 2022 9:15 AM GMT
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం వెనుక పూజారా, రహానే?
X
భారత క్రికెట్ లో కొద్దిరోజులుగా ఉప్పునిప్పుగా వ్యవహారం నడుస్తోందన్న గుసగుసలున్నాయి. వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని బీసీసీఐ తొలగించి రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించాక వ్యవహారం చెడిందని అంటున్నారు. ఈ మార్పులన్నీ కూడా కెప్టెన్ విరాట్ కోహ్లీ చుట్టూనే జరుగుతున్నాయి. ఇప్పటికే టీమిండియా టీ20, వన్డే కెప్టెన్సీకి దూరమైన కోహ్లీ ఈ నెల 15న టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించి పెను సంచలన సృష్టించాడు.

దీంతో భారత జట్టు అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి కోహ్లీ పూర్తిగా తప్పుకున్నట్లయ్యింది. అంతేకాకుండా టీమిండియాతోపాటు అంతర్జాతీయ క్రికెట్ లో కెప్టెన్ గా విరాట్ శకం ముగిసిందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి గల కొన్ని సంచలన నిజాలు బయటకి వస్తున్నాయి.

జట్టుకు ఎన్ని విజయాలు అందించిన ప్రపంచకప్ ఫైనల్స్ లో టీమిండియా ను గెలిపించలేని కోహ్లీకి చెత్త రికార్డు ఉంది. 2021 వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఓటమితోనే కోహ్లీ కెప్టెన్సీకి ఎసరు వచ్చింది. ఆ ఓటమితో సెలెక్టర్లు కోహ్లీ కెప్టెన్సీపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో అప్పుడే కెప్టెన్సీ మార్పునకు పునాదులు పడ్డాయని తెలుస్తోంది.

వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లో పూజారా, రహానే ఘోరంగా విఫలమయ్యారు. వారు అంతకుముందు సరైన ఫాంలో లేరు. దీంతో ఫైనల్ మ్యాచ్ ఓటమి అనంతరం పూజారా, రహానే వైఫల్యంపై డ్రెస్సింగ్ రూమ్ లో విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. వారిని ఎదురుగానే దూషించాడని తెలుస్తోంది. మీరిద్దరి వల్లే జట్టు భారీ స్కోర్ చేయలేకపోతోందని కోహ్లీ అరిచేశాడట.. దీంతో పూజారా, రహానే లు ఇద్దరూ కోహ్లీపై బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అప్పుడే కోహ్లీని బీసీసీఐ మందలించిందని సమాచారం.

సౌతాఫ్రికా పర్యటనలో పూజారా, రహానే స్థానంలో శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారీని తీసుకోవాలని కోహ్లీ ప్రయత్నించాడట.. కానీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తోపాటు టీం మేనేజ్ మెంట్ అడ్డుపడిందని తెలుస్తోంది. వాళ్లిదర్దూ సౌతాఫ్రికా సిరీస్ లోనూ విఫలం కావడంతో టీమిండియా సిరీస్ గెలవలేకపోయింది.

ఇక హెడ్ కోచ్ రవిశాస్త్రి దిగిపోయాక కోహ్లీ పెత్తనం టీం పై సాగడం లేదని తేలింది. కోహ్లీకి, ద్రావిడ్ కు పొంతన కుదరడం లేదు. ఇక ఆటగాళ్లు కోహ్లీ తీరుపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే కోహ్లీ ఇక చేసేదేం లేక టీం కెప్టెన్సీకి గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది.