Begin typing your search above and press return to search.

అవినాష్ రెడ్డి వైపే వేలు!.. నాటి పులివెందుల సీఐ వాంగ్మూలం

By:  Tupaki Desk   |   23 Feb 2022 10:30 AM GMT
అవినాష్ రెడ్డి వైపే వేలు!.. నాటి పులివెందుల సీఐ వాంగ్మూలం
X
దివంగత ముఖ్యమంత్రి.. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత సోదరుడు..నాటి విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి అత్యంత దారుణంగా ఆయన ఇంట్లోనే హత్యకు గురైన వైనం పెను సంచలనంగా మారటం తెలిసిందే. ఈ ఉదంతంపై విచారణకు సీబీఐ రంగంలోకి దిగింది. అనూహ్యంగా ఈ ఉదంతంలో అసలు నిందితుడు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డియే అన్న అనుమానం మొన్నటి ఛార్జిషీట్ ద్వారా బయటకు రావటం ఒక ఎత్తు అయితే.. తాజాగా నాడు పులివెందులకు సీఐగా వ్యవహరించిన శంకరయ్య సీబీఐకు అసలు విషయాన్ని వెల్లడించారు.

సీఐ శంకరయ్య ఇచ్చిన వాంగ్మూలంలో.. వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని చెప్పింది అవినాష్ రెడ్డేనని పేర్కొనటమే కాదు.. ఉదయాన్నే తనను రమ్మన్నారని.. రక్తపు వాంతులు చేసుకున్నారని తనకు చెప్పారన్నారు. గుండెపోటు కాదు డెడ్ బాడీని తరలించొద్దని చెప్పిన తనను బెదిరించారని.. వీడియో తీస్తుంటే వద్దన్నారని.. వారి అధ్వర్యంలో సాక్ష్యాధారాల్ని చెరిపేసిన వైనాన్ని వెల్లడించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామం ఎంపీ అవినాశ్ రెడ్డిని అడ్డంగా బుక్ చేయటమే కాదు.. కొత్త సందేహాలకు తెర తీసినట్లుగా చెబుతున్నారు. ఇంతకూ సీబీఐకు నాటి పులివెందుల సీఐ ఇచ్చిన వాంగ్మూలంలో ఏముంది? అన్నది కొన్ని మీడియా సంస్థల్లో ప్రముఖంగా ప్రచురితమైంది. అందులో పేర్కొన్న విషయాల్ని చూస్తే..

- వివేకానంద రెడ్డి మృతి చెందిన రోజు ఉదయం అవినాశ్‌ రెడ్డి పీఏ రాఘవరెడ్డి నుంచి ఫోన్‌ వచ్చింది. ఆ తర్వాత నాతో అవినాశ్‌ రెడ్డి మాట్లాడారు. ఒక బ్యాడ్‌ న్యూస్‌... అంటూ వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పారు. వెంటనే పోలీసు సిబ్బందిని వివేకా ఇంటి వద్దకు తీసుకురావాలన్నారు.

- ఈ విషయాన్ని నేను స్థానిక డీఎస్పీకి తెలియజేసి ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లకు ఫోన్లు చేస్తుండగా... ఐదు నిముషాల్లోనే దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి మరోసారి నాకు ఫోన్‌ చేశారు. ఎందుకు ఆలస్యం అవుతోందంటూ కోప్పడ్డారు.

- నేను సిబ్బందితో అక్కడికి వెళ్లే సమయానికి... లోపల వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, మనోహర్‌ రెడ్డి, ప్రతాప్‌ రెడ్డి, యర్ర గంగిరెడ్డి, దొండ్లవాగు శంకర్‌ రెడ్డి, కాంపౌండర్లు వెంకటేశ్‌ నాయక్‌, జయప్రకాశ్‌ రెడ్డితో పాటు రాజారెడ్డి.. గంగిరెడ్డి ఆసుపత్రుల్లో పని చేసే శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

- అక్కడ ఫొటోలు తీసి ఏడు గంటల ప్రాంతంలో ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మకు వాట్సాప్‌ ద్వారా పంపాను. బాత్‌ రూమ్‌ లోపల టైల్స్‌పై రక్తం, బెడ్‌ రూమ్‌లో దుప్పటిపై రక్తపు మరకలు, వివేకానందరెడ్డి తలపై బలమైన గాయాలు కనిపించడంతో... ఇది గుండెపోటు కాదని వాదించాను.

- ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి నోర్మూసుకో.. అని నన్ను బెదిరించారు. సైలెంట్‌గా ఉండకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

- వివేకానంద రెడ్డి గుండెపోటుతో బాత్‌ రూమ్‌లో రక్తపు వాంతులు చేసుకుని పడిపోయినట్లు అవినాశ్‌ రెడ్డి చెప్పారు. తల వెనుక గాయం చూసి నేను ఇనయ్‌ తుల్లా (వివేకా సహాయకుడు)ను సైతం గట్టిగా అడిగాను. ‘అంతా పెద్దోళ్లు చూసుకుంటారు’ అని అన్నాడు. ఇనయ్ తుల్లా కూడా మరణంగా అనుమానం వ్యక్తం చేశారు. మీ సార్ కు ఎవరితో శత్రుత్వం లేదు.. ఆయన్ను ఎవరూ హత్య చేసే అవకాశమే లేదని శివశంకర్ రెడ్డి బెదిరించారు.

- అక్కడ సివిల్‌ డ్రెస్‌లో ఉన్న హోంగార్డు నాగభూషణ రెడ్డిని సెల్‌ఫోన్‌తో సీన్‌ మొత్తం వీడియో తీయిస్తుండగా... శంకర్‌ రెడ్డి కోప్పడ్డాడు. దాంతో రికార్డింగ్‌ ఆపేయాల్సి వచ్చింది. క్రైమ్‌ సీన్‌ పూర్తిగా కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి ఆధీనంలోకి తీసుకున్నారు. గడియ పెట్టుకుని లోపలే ఉన్నారు.

- డెడ్ బాడీని చూస్తామంటూ 400-500 మంది వివేకా ఇంటి లోపలకు వచ్చేందుకు ప్రయత్నించారు. వారందరిని నియంత్రించాం. న్యాయవాది ఓబుల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరిన తర్వాత.. అక్కడున్న రక్తపు మరకలు చూశారు. ఆ తర్వాత బయటకు వచ్చి ఎర్ర గంగిరెడ్డి.. శివశంకర్ రెడ్డిలతో మాట్లాడారు. ఆ తర్వాతే ఆధారాల ధ్వంసం మొదలైంది.

- వైఎస్‌ కుటుంబీకులకు చెందిన రాజారెడ్డి ఆస్పత్రి, సీఎం జగన్‌ సతీమణి భారతి తండ్రికి చెందిన గంగిరెడ్డి ఆస్పత్రి సిబ్బందిని మాత్రం గాయాలు కనిపించకుండా కుట్లు వేసేందుకు లోపలికి అనుమతించారు.

- మధ్య మధ్యలో అవినాశ్‌ రెడ్డి కూడా లోపలికి వెళ్లారు. కుట్లు వేసి, కట్లు కట్టడం పూర్తయ్యాక... మృతదేహాన్ని పెట్టేందుకు రిఫ్రిజిరేటర్‌ బాక్స్‌ తెప్పించారు. అయితే... అందులో వివేకా మృతదేహం పెట్టేందుకు నేను అంగీకరించలేదు. ఫిర్యాదు లేకుండా కుదరదని చెప్పాను. ‘కేసు ఏదీ వద్దు’ అని అవినాశ్‌ రెడ్డి చెప్పారు.

- వైఎస్ అవినాష్ రెడ్డి.. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి.. వీరిద్దరూ అందరికంటే ముందు వివేకా ఇంటి వద్దకు చేరుకున్నారు. డెడ్ బాడీ రక్తపు మడుగులో ఉండటం.. తలపై తీవ్ర గాయాల్ని చూసి కూడా ఆయన గుండెపోటుతో చనిపోయారంటూ ప్రచారం చేశారు. వివేకా ఇంటి వద్ద బందోబస్తుకు రావాలని.. వైసీపీ సన్నిహితులైన న్యాయవాది ఓబుల్ రెడ్డి.. సాక్షి విలేకరి నాపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు.

- నేను అందుకు ఒప్పుకోకపోవడంతో... దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి డిక్టేట్‌ చేసిన విధంగా వివేకా పీఏ కృష్ణా రెడ్డి ఫిర్యాదు రాసిచ్చారు. ఈ కేసులో అవినాశ్‌ రెడ్డి, దొండవాగు శంకర్‌ రెడ్డి, దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి, ఎంవీ కృష్ణా రెడ్డి, ఉమా శంకర్‌ రెడ్డి, సునీల్‌ యాదవ్‌ ప్రవర్తన అక్కడ అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించినట్లుగా 2020 జులై 28న సీబీఐ అధికారుల ఎదుట ఆయన వాంగ్మూలం ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా బయటకు రావటం గమనార్హం.