Begin typing your search above and press return to search.

బ్యాడ్మింటన్ గురు.. రాజ్యసభకు వెళ్తున్నాడా?

By:  Tupaki Desk   |   4 April 2017 10:25 AM GMT
బ్యాడ్మింటన్ గురు.. రాజ్యసభకు వెళ్తున్నాడా?
X
భారత బ్యాడ్మింటన్లో పుల్లెల గోపీచంద్ కంటే ముందు ప్రకాశ్ పదుకొనే.. సయ్యద్ మోడీ లాంటి దిగ్గజ ఆటగాళ్లున్నారు. కానీ మన బ్యాడ్మింటన్‌ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి.. దేశంలో బ్యాడ్మింటన్ విప్లవానికి తెరతీసిన ఘనత మాత్రం గోపీచందుదే. ఆటగాడి కంటే కూడా కోచ్ గా ఆటకు అతను చేసిన సేవలు అసమానం. ఈ రోజు సైనా నెహ్వాల్.. పి.వి.సింధు లాంటి ఛాంపియన్లు తయారై రెండు ఒలింపిక్ పతకాలు భారత్ సొంతమయ్యాయన్నా.. దేశంలో లక్షలాది మంది చిన్నారులు బ్యాడ్మింటన్ వైపు అడుగులేస్తున్నారన్నా అందుకు ముఖ్య కారణం గోపీచందే. తన పేరిట హైదరాబాద్ లో బ్యాడ్మింటన్ అకాడమీ పెట్టి అతను దేశంలో బ్యాడ్మింటన్ విప్లవానికి నాంది పలికాడు. ఇప్పుడు పదుల సంఖ్యలో భారత క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో అదరగొడుతున్నారు.

గోపీచంద్ చేసిన ఈ సేవలకు ఇప్పటికే పద్మ పురస్కారంతో పాటు ద్రోణాచార్య అవార్డూ ఇచ్చి సత్కరించిన ప్రభుత్వం.. ఇప్పుడు అతడిని రాజ్యసభకు కూడా పంపించబోతున్నట్లు సమాచారం. గోపీని రాష్ట్రపతి కోటా కింద రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరో వారంలో దీనికి సంబంధించి ప్రకటన రావచ్చట. ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ గోపీ పేరును రాజ్యసభకు ప్రతిపాదించారట. గోపీ స్వతహాగా ఆంధ్రా వ్యక్తి అయినా.. ఉంటోంది తెలంగాణలో. అందుకే ఇద్దరు చంద్రులూ ఆయనకు మద్దతు ప్రకటించాల్సి ఉంటుంది. మరోవైపు ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా గోపీ పేరును ప్రతిపాదించడంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. క్రీడలు.. కళల్లో సేవ చేసిన వారిని రాష్ట్రపతి కోటా కింద రాజ్యసభకు నామినేట్ చేయడం ఆనవాయితీ. దీని కిందే గోపీ ఎంపీ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/