Begin typing your search above and press return to search.

ఫొటోషాప్ లో ఎవరెస్టు ఎక్కేశారు

By:  Tupaki Desk   |   29 Jun 2016 12:39 PM GMT
ఫొటోషాప్ లో ఎవరెస్టు ఎక్కేశారు
X
సుమారు 20 రోజుల కిందట దేశమంతా ఆ జంట పేరు మార్మోగిపోయింది. పోలీసు కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న మహారాష్ట్రకు చెందిన భార్యాభర్తలు దినేశ్- తారకేశ్వరి ఎవరెస్టు ఎక్కారంటూ ఫొటోలు సహా పత్రికలన్నీ పతాకవార్తలు వేశాయి. వారి సాహసానికి తగిన స్థాయిలో కవరేజి ఇచ్చాయి. కానీ... ఆ జంట ఎవరెస్టు ఎక్కడంలో సాహసం లేదని, ఉన్నదంతా సాంకేతికతేనని... ఎవరెస్టు ఎక్కకుండానే ఎక్కినట్లు మార్ఫింగు బొమ్మలు సృష్టించి కథలు అల్లారని తాజాగా తేలింది.

'సమ్మిట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్' పేరిట సదస్సు జరుగగా, దానికి వెళ్లిన వీరు - అక్కడి నుంచి ఎవరెస్ట్ ఎక్కగా - శిఖరంపై వీరు దిగిన చిత్రాలను దాదాపు అన్ని పత్రికలూ ప్రచురించి, వీరిద్దరినీ ఆకాశానికి ఎత్తాయి. ఇప్పుడు దినేష్ - తారకేశ్వరీలు అదే ఆకాశం నుంచి ఒక్కసారిగా నేలపై పడ్డారు. కారణం, అసలు వీరిద్దరూ ఎవరెస్ట్ ఎక్కలేదని, మార్ఫింగ్ ఫోటోలతో ప్రచారం చేసుకున్నారని తేలడమే. అదే సదస్సుకు మహారాష్ట్ర నుంచి వెళ్లిన పలువురు పర్వతారోహకులు - దినేష్ దంపతులు అసలు సదస్సుకే రాలేదని, మహారాష్ట్ర కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పుణె పోలీసు కమిషనర్ రష్మీ శుక్లా దీనిపై విచారణకు ఆదేశించారు. ఇదే విషయమై స్పందించేందుకు తారకేశ్వరి నిరాకరించారు. పోలీసు విచారణలో అన్ని విషయాలూ వెలుగులోకి వస్తాయని అన్నారు.

కాగా, తాము మే 23న ఎవరెస్ట్ ఎక్కామని ఈ జంట చెప్పుకోగా, జూన్ 6న దేశవ్యాప్తంగా పత్రికలు వీరిని కొనియాడుతూ చిత్రాలను ప్రచురించాయి. మహారాష్ట్ర పోలీసు బాస్ లు వీరిని ప్రత్యేకంగా అభినందించారు కూడా. జూన్ 16న వీరిద్దరూ ఎవరెస్ట్ ఎక్కనే లేదని అంజలీ కులకర్ణి - శరద్ కులకర్ణి - సురేంద్ర షల్కే - ఆనంద్ బన్సోడే తదితర పర్వతారోహకులు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రాధమిక విచారణ జరిపిన అధికారులు 27న స్టేట్ మెంట్లను రికార్డు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. వీరు నిజంగానే మోసం చేశారా లేదంటే.. ఫిర్యాదులు తప్పుడువా అన్నది తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంలో మాత్రం మరోసారి ఫోటోషాప్ సత్తా రుజువైంది. ఇప్పటికే అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తూ పీక్ స్టేజికి చేరుకున్న ఫొటోషాప్ సత్తా ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే అంత్యంత ఎత్తయిన శిఖరం ఎవరెస్టు స్థాయికి చేరిపోయింది.