Begin typing your search above and press return to search.

ఫూణేలో బ‌ర్గ‌ర్ తిన్న వ్య‌క్తి ర‌క్తం క‌క్కున్నాడు!

By:  Tupaki Desk   |   21 May 2019 6:23 AM GMT
ఫూణేలో బ‌ర్గ‌ర్ తిన్న వ్య‌క్తి ర‌క్తం క‌క్కున్నాడు!
X
మీరు బ‌ర్గ‌ర్ తింటారా? అదేం ప్ర‌శ్న‌. ఇవాల్టి రోజున బ‌ర్గ‌ర్ తిననోళ్లు ఉంటారా? అని ఎదురుప్ర‌శ్న వేసే అవ‌కాశం ఉంది. అంతలా ప్ర‌తి ఒక్క‌రి జీవితాల్లోకి వ‌చ్చేసిన బ‌ర్గ‌ర్ కు సంబంధించిన ఒక షాకింగ్ నిజం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఫూణేకు చెందిన స‌జీత్ ప‌ఠాన్ అనే 31 ఏళ్ల వ్యక్తి త‌న స్నేహితుల‌తో క‌లిసి బ‌ర్గ‌ర్ కింగ్ అవుట్ లెట్ కు వెళ్లారు. ఒక బ‌ర్గ‌ర్.. ఫ్రెంచ్ ఫ్రైస్.. సాఫ్ట్ డ్రింక్ ఆర్డ‌ర్ చేశారు. అత‌గాడు వెళ్లిన షాపు మామూలుది కాదు. బ‌ర్గ‌ర్ కింగ్ అనే ఫేమ‌స్ ఛైన్ షాప్కు వెళ్లాడు.

బ‌ర్గ‌ర్ ను నోట్లో పెట్టుకొని ఒక ముక్క తుంచుకొని మింగాడో లేదో.. గాలి పీల్చుకోవ‌టానికి వీల్లేన‌ట్లుగా ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఆ వెంట‌నే నోట్లో నుంచి ర‌క్తం క‌క్కున్నాడు. దీంతో.. కంగారు ప‌డిన అత‌గాడు.. తాను తిన్న బ‌ర్గ‌ర్ ను ప‌రిశీలించ‌గా.. అందులో ప‌గిలిన గాజు ముక్క‌లు ఉన్న‌ట్లు గుర్తించారు. హుటాహుటిన అత‌న్ను ద‌గ్గ‌ర్లోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

విష‌యం తెలుసుకున్న యాజ‌మ‌న్యం.. ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్పొద్దంటూ స‌ద‌రు వ్య‌క్తి చికిత్స‌కు సంబంధించి కొంత మొత్తాన్ని (రూ.15వేలు) ఇచ్చింది. ఆ త‌ర్వాతి రోజు మ‌రో రూ.30వేలు ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. గాజుముక్క గొంతులోకి వెళ్ల‌టంతో అలా జ‌రిగింద‌న్న విష‌యాన్ని గుర్తించిన వైద్యులు త‌గిన చికిత్స చేశారు. గొంతులోకి వెళ్లిన గాజు ముక్క‌.. దానంత‌ట అదే బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని వైద్యులు చెబుతున్నారు.

బాధితుడి ఆరోగ్య ప‌రిస్థితి ప్ర‌స్తుతం బాగానే ఉంద‌ని.. ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ విష‌యం గురించి స‌మాచారం తెలుసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. మెడిక‌ల్ రిపోర్ట్స్ అందిన వెంట‌నే స్టోర్ మీద చ‌ర్య‌లు తీసుకుంటామని చెబుతున్నారు. బ‌ర్గ‌ర్ తినేముందు కాస్త జాగ్ర‌త్త తీసుకుంటే మంచిది.