Begin typing your search above and press return to search.

అరుదైన ఘనత.. పునీత్ కళ్లతో మరో పదిమంది జీవితాల్లో వెలుగులు!

By:  Tupaki Desk   |   14 Nov 2021 10:42 AM GMT
అరుదైన ఘనత.. పునీత్ కళ్లతో మరో పదిమంది జీవితాల్లో వెలుగులు!
X
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో హఠాత్తుగా మరణించిన విషయం తెల్సిందే. రీల్ హీరోగా తెరమీద... సామాజిక కార్యక్రమాలతో రియల్ హీరోగా ప్రజల హృదయాల్లో చిర స్థాయిలో నిలిచిపోయారు. అయితే నేత్రదానం చేయాలని పునీత్ ఇప్పటికే నిర్ణయించుకోగా... ఆయన మరణానంతరం కుటుంబసభ్యులు పునీత్ కళ్లను దానం చేశారు. ఆయన కళ్లతో ఇప్పటికే నలుగురు చూపును పొందారు. పునీత్ నేత్రాల్లోని కార్నియాతో నలుగురు వ్యక్తులకు కంటిచూపు లభించింది. కాగా మరో పది మంది జీవితాల్లోనూ వెలుగులు నింపనున్నారు. వ్యాయామం చేస్తూ కుప్పకూలి... ఆకస్మికంగా మరణించిన ఆయన కళ్లు చాలా ఆరోగ్యంగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. అందుకే వాటితో తొలిసారి ఓ వినూత్న ప్రయోగం చేయబోతున్నట్లు వెల్లడించారు. పునీత్ నేత్ర దానంతో ఇప్పటికే నలుగురు చూపు పొందగా... మరో పది మందికి ఎలా ఉపయోగిస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

పునీత్ తల్లిదండ్రులు రాజ్ కుమార్, పార్వతమ్మల్లాగే ఆయన కూడా నేత్రం దానం చేశారు. ఈ నేపథ్యంలో పునీత్ మరణాంతరం ఆయన రెండు కళ్లను బెంగుళూరులోని నారాయణ నేత్రాలయం వైద్యులు సేకరించారు. పునీత్ కళ్లలోని కార్నియాతో ఇప్పటికే నలుగురికి కంటిచూపునిచ్చినట్లు వారు తెలిపారు. ఆయన కళ్లు చాలా హెల్దీగా ఉన్నాయని వెల్లడించారు. అయితే కళ్లలోనే స్టెమ్ సెల్స్ తో మరో పది మందికి కంటి చూపునివ్వబోతున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఓ వ్యక్తి కళ్లలోని కార్నియా, స్టెమ్ సెల్స్ ను ఉపయోగించి ఎక్కువ మందికి చూపునిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆస్పత్రి చీఫ్ డాక్టర్ భుజంగ రెడ్డి వెల్లడించారు. అయితే భారత దేశంలో ఈ తరహా ప్రాజెక్టుల్లో ఇదే మొదటిదని పేర్కొన్నారు. ఫలితంగా పునీత్ రెండు కళ్లతో మొత్తం దాదాపు పద్నాలుగు, లేదా పదిహేను మంది దాకా కంటిచూపును పొందనున్నారని వివరించారు.

పునీత్ కంటిలోని స్టెమ్ సెల్స్ పై ప్రయోగాలు జరుగుతాయని వైద్యులు తెలిపారు. వీటికి మరో రెండు వారాల దాకా సమయం పడుతుందని వెల్లడించారు. ఆ తర్వాత వాటిని అవసరమైన వ్యక్తులకు ఉపయోగిస్తామని పేర్కొన్నారు. ఆయన స్టెమ్ సెల్స్ ని గ్రో స్టెమ్ సెల్స్ ల్యాబ్ లో భద్రపరిచినట్లు వివరించారు. పునీత్ స్టెమ్ సెల్స్ తో మరో 5 నుంచి పది మందికి చూపు ప్రసాదించే అవకాశం ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు. కార్నియా చుట్టూ ఉండే తెల్లటి భాగంలో స్టెమ్ సెల్స్ ఉంటాయని తెలిపారు. ప్రమాదాల వల్ల కళ్లలో చీలికలు ఏర్పడటం, రసాయనాల వల్ల కళ్లు దెబ్బతినడం, ప్రమాదాల్లో చూపు కోల్పోవడం వంటి ఇతరత్రా ప్రమాదాల్లో కంటికి గాయాలైన వారికి తిరిగి చూపునివ్వవచ్చు అని వైద్యుడు డాక్టర్ భుజంగ రెడ్డి వివరించారు. అయితే ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే మరో పది మందికి చూపు వస్తుందని పేర్కొన్నారు.

కన్నడ హీరో పునీత్ జిమ్ లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిపోయారు. ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించగా... వ్యాయామం చేస్తుండగా గుండె పోటు వచ్చిందని వైద్యులు వెల్లడించారు. అక్టోబర్ 29న ఆయన ఆకస్మికంగా మరణించారు. పునీత్ హఠాన్మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగారు. రీల్ హీరోనే కాదు రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన ఇలా మరణించడం పట్ల విషాదం వ్యక్తం చేస్తున్నారు. పునీత్ మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.