Begin typing your search above and press return to search.

గాడ్సేను పొగిడితే ఇక అంతే సంగ‌తులు!

By:  Tupaki Desk   |   4 March 2016 9:31 AM GMT
గాడ్సేను పొగిడితే ఇక అంతే సంగ‌తులు!
X
కొన్ని విష‌యాల మీద త‌ర‌చూ త‌న మీద విమ‌ర్శ‌లు చేసే రాజ‌కీయ ప‌క్షాల‌కు మ‌రింత స్ప‌ష్ట‌త ఇచ్చేందుకు మోడీ స‌ర్కారు న‌డుం బిగించిన‌ట్లుంది. గాడ్సే ను పొగిడే వారిని బీజేపీ స‌ర్కారు ఏమీ చేయ‌ద‌ని.. ఇదేనా దేశ‌భ‌క్తి అంటూ కొన్ని రాజ‌కీయ పార్టీలు త‌మ‌పై విరుచుకుప‌డ‌టంపై ఆ పార్టీ ఆగ్ర‌హంగా ఉంది. జాతీయ‌వాదానికి తామే బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా చెప్పుకునే బీజేపీ నేత‌లు.. గాంధీ మ‌హాత్ముడ్ని హ‌త్య చేసిన క్రిమిన‌ల్ ను ఎలా పొగుడుతారు? అంటూ సూటిగా ప్ర‌శ్నించ‌ట‌మే కాదు.. ఆ విష‌యంపై క‌మ‌ల‌నాథులు కామ్‌ గా ఉంటున్నార‌న్న ఆరోప‌ణలు ఉన్నాయి.

ఈ త‌ర‌హా విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టాల‌ని భావిస్తోంది మోడీ స‌ర్కారు. అందుకే.. జాతిపిత గాంధీని కాల్చి చంపిన నాథూరామ్‌ గాడ్సేని ఎవ‌రైనా పొగిడినా.. గాంధీ మ‌ర‌ణించిన రోజున ఎవ‌రైనా పండ‌గ చేసుకున్నా అలాంటి వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని కేంద్ర‌ హోంమంత్రి రాజ్‌ నాథ్ తాజాగా ప్ర‌క‌టించారు. మ‌హాత్ముడ్ని కాల్చి చంపిన వ్య‌క్తిని గొప్ప వ్య‌క్తిగా ఎలా భావిస్తారంటూ రాజ్ నాథ్ సీరియ‌స్ అవుతున్నారు.

ఇక‌పై గాడ్సేను ఎవ‌రు పొగిడినా వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెబుతున్నారు. హిందూ మ‌హాస‌భ ఆధ్వ‌ర్యంలో గాడ్సేకు గుడి క‌ట్ట‌టం.. బీజేపీ ఎంపీ సాక్షి మ‌హారాజ్ గాడ్సేని పొగ‌డ‌టం లాంటి వాటిని సాకుగా చూపి విమ‌ర్శ‌లు చేయ‌టం స‌రికాదంటున్న రాజ్‌నాథ్‌.. మ‌రి.. అలాంటి పిచ్చి మాట‌లు మాట్లాడుతున్న ఎంపీపై ఎందుకు వేటు వేయ‌టం లేదు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెబితే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

మ‌రోవైపు.. జేఎన్‌ యూ ఇష్యూలో దేశ‌ద్రోహం కేసు న‌మోదు చేసిన నేప‌థ్యంలో.. గాడ్సే ఇష్యూను విప‌క్షాలు తెర‌పైకి తీసుకొస్తుంద‌న్న ఉద్దేశంతోనే ముందుస్తుగా ఇలాంటి ప్ర‌క‌ట‌న‌ల్ని రాజ్‌ నాథ్ చేసి ఉంటార‌న్న మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా గాంధీ హంత‌కుడు గాడ్సే ను పొగుడుతూ వ్యాఖ్య‌లు చేసే వారిపై మోడీ స‌ర్కారు చ‌ర్య‌లు తీసుకుంటే త‌ప్ప రాజ్ నాథ్ మాట‌ల్ని ఒక‌ప‌ట్టాన న‌మ్మ‌రేమో..?