Begin typing your search above and press return to search.

పంజాబ్ పీఠ‌ముడి వీడిందా? బిగుసుకుందా?

By:  Tupaki Desk   |   19 July 2021 7:35 AM GMT
పంజాబ్ పీఠ‌ముడి వీడిందా? బిగుసుకుందా?
X
భార‌త రాజ‌కీయాల్లో ఏక‌చ్ఛాత్రాధిప‌త్యం వ‌హించి.. దేశాన్ని ద‌శాబ్దాల పాటు పాలించిన చ‌రిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ ప్ర‌ధాని మోడీ ప్ర‌భ కార‌ణంగా వ‌రుస‌గా రెండు సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ చిత్తుచిత్తుగా ఓడి ప్ర‌తిప‌క్షంలో కాంగ్రెస్ కొన‌సాగుతోంది. అయితే ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మికి కాంగ్రెస్ స్వ‌యంకృతాప‌రాధం కూడా ఉంద‌నేది కాద‌న‌లేని నిజం. జాతీయ స్థాయిలో పార్టీని న‌డిపించే స‌రైన నాయ‌క‌త్వం కొర‌వ‌డ‌డ‌మే అందుకు కార‌ణం. సోనియా గాంధీ పార్టీ చీఫ్‌గా ఉన్న‌పుడు ఆ జోరే వేరుగా ఉండేది. కానీ ఆమెకు వ‌య‌సు మీద ప‌డ‌డంతో కొడుకు రాహుల్ గాంధీకి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గిద్దామ‌నుకుంటే ఇప్పుడాయ‌న అందుకు స‌సేమిరా ఒప్పుకోవ‌ట్లేదు. దీంతో నాయ‌క‌త్వ లేమి పార్టీకి సమ‌స్య‌గా మారిన సంగ‌తి అంద‌రూ చెప్పుకునేదే.

ప్ర‌స్తుతం దేశంలో ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంద‌ని చెప్పుకోవ‌చ్చు. పంజాబ్‌, చ‌త్తీస్‌గ‌ఢ్‌, రాజ‌స్థాన్‌లో సొంతంగానే అధికారంలో ఉన్న ఆ పార్టీ.. మ‌హారాష్ట్ర, జార్ఖండ్‌, త‌మిళ‌నాడులో అధికార ప్ర‌భుత్వ కూట‌మిలో భాగంగా ఉంది. 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తిరిగి కేంద్రంలో అధికారం కోసం పాటుప‌డాల‌నే లక్ష్యంతో ఉన్న ఆ పార్టీ.. ఇప్పుడు అనుస‌రిస్తున్న విధానాలు మాత్రం ఆ దిశ‌గా లేవ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పంజాబ్ పీసీసీ కొత్త అధ్య‌క్షుడిగా మాజీ క్రికెట‌ర్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూను తాజాగా నియ‌మించ‌డ‌మే అందుకు కార‌ణం. అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఆ రాష్ట్రంలో పీఠ‌ముడి వీడిందా? లేదా ఇంకా బిగిసుకుందా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అందుకు కార‌ణం లేక‌పోలేదు.

దేశంలో కాంగ్రెస్‌పై వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్న‌ప్ప‌టికీ పంజాబ్‌లో పార్టీని గెలిపించ‌డంలో ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ విజ‌య‌వంత‌మ‌య్యారు. అక్క‌డ అధికారాన్ని చేతుల్లోంచి జార‌కుండా చూసుకున్నారు. అయితే అమ‌రీంద‌ర్‌కు, మాజీ మంత్రి సిద్ధూకు మ‌ధ్య తీవ్ర‌మైన విభేదాలున్నాయి. దీంతో సిద్ధూకు పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇస్తార‌నే స‌మాచారం ప్ర‌కారం.. ఆయ‌న‌కు ఆ ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌కూడ‌దంటూ అమ‌రీంద‌ర్ సోనియా గాంధీకి లేఖ కూడా రాశారు. హిందూ, ద‌ళిత వ‌ర్గాల‌కు చెందిన సీనియ‌ర్లు, పార్టీని ఎప్ప‌టినుంచో న‌మ్ముకుని ఉన్నవారిని కాద‌ని సిద్ధూను పీసీసీ అధ్య‌క్షుడిగా నియ‌మిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యావ‌కాశాల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డే ప్ర‌మాదం ఉంద‌నీ లేఖ‌లో పేర్కొన్నారు.

అమ‌రీంద‌ర్‌, సిద్ధూ మ‌ధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయ‌నే విష‌యం ఈ లేఖ‌తో వెల్ల‌డైంది. అయిన‌ప్ప‌టికీ అమ‌రీంద‌ర్ అభ్యంత‌రాల‌ను ప‌క్క‌న‌పెడుతూ సిద్ధూకే పంజాబ్ ప‌గ్గాలు అప్పగిస్తున్న‌ట్లు సోనియా నిర్ణ‌యం తీసుకోవ‌డంతో పంజాబ్ కాంగ్రెస్‌లో ఎలాంటి అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయో అనే ఆస‌క్తి మొద‌లైంది. అధిష్ఠానం నిర్ణ‌యంతో ఇప్ప‌టికే అమ‌రీంద‌ర్‌, సిద్ధూ వ‌ర్గాలుగా విడిపోయిన పంజాబ్ కాంగ్రెస్ ఎటువైపు సాగుతుందోన‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నిర్ణ‌యంతో పార్టీ చీలిపోయే ప్ర‌మాదం ఉంద‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి ఈ విష‌యాన్ని తెగేదాకా లాగి కాంగ్రెస్ అధిష్ఠానం భారీ మూల్యం చెల్లించుకుంటుందా? లేదా రెండు వ‌ర్గాల‌తో కూర్చుని స‌మ‌స్య‌ను సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రిస్తుందా అనేదానిపైనే ఆ రాష్ట్రంలో పార్టీ భ‌విష్య‌త్ ఆధార‌ప‌డి ఉంది.