Begin typing your search above and press return to search.

పంజాబ్ లో ఏమవుతోంది?

By:  Tupaki Desk   |   31 Jan 2022 10:42 AM GMT
పంజాబ్ లో ఏమవుతోంది?
X
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా అందరి చూపు ‘ఉత్తరప్రదేశ్’పై నెలకొంది. అయితే యూపీలో బీజేపీ గాలి వీస్తున్న వేళ... కమలదళానికి కొరుకుడు పడని రాష్ట్రంగా పంజాబ్ గా ఉంది. పంజాబ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈసారి రైతుల నిరసనతో బీజేపీకి ఆ రాష్ట్రంలో దారులు మూసుకుపోయాయి. కాంగ్రెస్ సీఎం అమరీందర్ రాజీనామా చేసి బీజేపీ వైపుకు తిరగడంతో కాస్త రాజకీయ సమీకరణాలు మారాయి.

అమరీందర్ సింగ్ ప్రస్తుతం పంజాబ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. గురుగోవింద్ సాహిబ్ లోని మతపెద్దలు ఆయనకు మద్దతుగా నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని అమరీందర్ సింగ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తమకు కలిసి వస్తాయన్నారు. పంజాబ్ ప్రజలు మార్పు కురుకుంటున్నారని పేర్కొన్నారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్ధూ తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్తితి రావడానికి సిద్ధూయే కారణమని మండిపడ్డారు.

ఇప్పటికే పంజాబ్ లో కాంగ్రెస్ కు గట్టి సవాల్ గా మారిన ఆప్ పార్టీ సీఎం చన్నీని తన నియోజకవర్గంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఆరోపణలపై కూడా లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసింది. ఫిబ్రవరి 20న పోలింగ్ జరుగనుండడంతో పంజాబ్ లో తీవ్రమైన ప్రచారానికి మధ్యలో ఈ దాడులు కలకలం రేపుతున్నాయి.

పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ మేనల్లుడిపై అక్రమ మైనింగ్ కేసులకు సంబంధించి ఈడీ దాడులు చేపట్టింది. పలు కేసులు నమోదు చేసిన ఈడీ సీఎం చన్నీ మేనల్లుడి ఇంటితోపాటు పంజాబ్ లోని మరో 10 ప్రాంతాల్లో మంగళవారం ఉదయం సోదాలు చేసింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం మేనల్లుడి ఇంటిపై ఈడీ దాడులు చేయడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనమైంది. ఇది కాంగ్రెస్ కు పెను శాపంగా మారింది.

కాంగ్రెస్ సీఎం పదవిని వదిలేసిన అమరీందర్ సింగ్ బయటకు వచ్చి పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. పంజాబ్ లో గెలిచి అధికార పగ్గాలు దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పంజాబ్ లో ఫిబ్రవరి 20 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడికానున్నాయి. మరి అక్కడ జెండా పాతేది ఎవరన్నది వేచిచూడాలి.

ఇక పంజాబ్ ఎన్నికలపై ఒపినీయన్ పోల్స్, సర్వేలు బయటకొస్తున్నాయి. ఏబీపీ న్యూస్ -సీఓటర్ ఒపినియన్ పోల్ లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ వరుసగా 40 శాతం, 36 శాతం ఓట్లను సాధిస్తాయని అంచనా.. హోరా హోరీ తప్పందంటున్నారు. కాంగ్రెస్ కుమ్ములాటలతో ఈ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీకి బలం పెరిగింది. పంజాబ్ రైతులు వ్యతిరేకిస్తున్న బీజేపీని కాదని.. కాంగ్రెస్ కు ప్రత్యామ్మాయంగా ఆమ్ ఆద్మీ పార్టీని అక్కడి ప్రజలు చూస్తున్నారని తెలుస్తోంది.