Begin typing your search above and press return to search.

బీజేపీ ఎమ్మెల్యేకు ఘోర పరాభవం... బట్టలిప్పి మరీ కొట్టేశారు

By:  Tupaki Desk   |   28 March 2021 4:23 AM GMT
బీజేపీ ఎమ్మెల్యేకు ఘోర పరాభవం... బట్టలిప్పి మరీ కొట్టేశారు
X
ఘోర పరాభవం ఎదురైంది. ప్రజల భావోద్వేగాల్ని పట్టించుకోకుండా రాజకీయం చేయాలన్న అత్యుత్సాహం ఒక బీజేపీ ఎమ్మెల్యేకు జీవితంలో మర్చిపోలేని దారుణ పరాభానికి దారి తీసింది. తమ పార్టీ పట్ల రైతుల్లో నెలకొన్న ఆగ్రహాన్ని తక్కువగా అంచనా వేసిన బీజేపీ ఎమ్మెల్యేకు షాకింగ్ పరిణామం ఎదురైంది. బజార్లో పరుగులు తీయించి.. బట్టలు విప్పదీసి దాడి చేసిన వైనం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మూర్తీభవించిన మొండితనంతో రైతులు చేస్తున్న ఆందోళన విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుతో పంజాబ్ రైతులు ఎంత కోపంతో ఉన్నారన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

పెద్ద ఎత్తున పోలీసులు రక్షణగా నిలిచినా కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. పంజాబ్ లో సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. ముక్తాసర్ జిల్లా మాలోట్ లో పర్యటించారు బీజేపీ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్. వ్యవసాయ చట్టాల విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ.. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు మద్దతుగా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు సదరు ఎమ్మెల్యే.

ఈ విషయాన్ని తెలుసుకున్న రైతులు ఆగ్రహంతోబీజేపీ ఆఫీసుకు చేరుకున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేవారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ముట్టడించిన వారు.. పెద్ద ఎత్తున లోపలకు వెళ్లి రైతులు.. ఎమ్మెల్యేను బయటకు తీసుకొచ్చారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో.. సదరు ఎమ్మెల్యే ఒక దుకాణంలోకి వెళ్లారు. ఆయనకు రక్షణగా పోలీసులు వెంట పరుగులు తీశారు. వారి వెంట రైతులు వెళ్లారు. ఎమ్మెల్యేను చుట్టుముట్టిన రైతులు.. ఆయన చుట్టూ చేరి దాడి చశారు. ఎమ్మెల్యే ప్రయాణించే వాహనానికి నల్లటి ఇంకు పూయటంతో పాటు.. ఎమ్మెల్యేపై ఇంకు విసురుతూ.. కర్రలతో దాడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బట్టలు పూర్తిగా చినిగిపోయాయి.

ప్రాణ భయంతో వీధుల్లో సదరు ఎమ్మెల్యే పరుగులు తీయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఆయన్ను కాపాడేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఒక గదిలోకి ఆయన్ను సేఫ్ గా పంపారు పోలీసులు. ఎమ్మెల్యేపై ఉన్న కోపాన్ని పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టటం ద్వారా రైతులు తీర్చుకున్నారు. ఈ పరిణామంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దాడి చేసిన రైతుల్ని గుర్తించి కేసులు పెడుతున్నారు పోలీసులు.

ఇదిలా ఉంటే రైతుల దాడిని సంయుక్త కిసాన్ మోర్చా ఖండించింది. ఇలాంటి పరిస్థితికి బీజేపీ.. దాని మిత్రపక్షాలేనని ఆరోపించింది. రైతుల సమస్యల్ని తీర్చని కేంద్రం.. వారిని పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిందని.. ఈ కారణంతోనే స్థానిక నేతలకు అవమానాలు ఎదురవుతున్నాయని ఆరోపించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి అమరీందర్ తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీజేపీ విషయంలో రైతులు ఎంత ఆగ్రహంగా ఉన్నారన్న విషయం తాజా ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. ఈ పరిణామం బీజేపీ నేతల వెన్నులో చలి పుట్టించటం ఖాయం.