Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్‌లో పంజాబ్ ఫార్ములా.. రేవంత్‌కు షాక్ త‌ప్ప‌దా..!

By:  Tupaki Desk   |   9 Feb 2022 11:30 PM GMT
టీ కాంగ్రెస్‌లో పంజాబ్ ఫార్ములా.. రేవంత్‌కు షాక్ త‌ప్ప‌దా..!
X
తెలంగాణ కాంగ్రెస్ లో పంజాబ్ ఫార్ములా అమ‌లు కానుందా..? ఇదే జ‌రిగితే రేవంత్ కు షాక్ త‌ప్ప‌దా..? రేవంత్ వ్య‌తిరేక వ‌ర్గీయుల‌కు ఇది వ‌రం కానున్న‌దా..? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇంత‌కీ పంజాబ్ ఫార్ములా ఏంటంటే.. ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని ముందుగా ప్ర‌క‌టించ‌డ‌మే. అదీ ద‌ళిత సీఎం అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డం విశేషం.

కాంగ్రెస్ పార్టీలో ఏ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగినా ముందుగా సీఎం అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌రు. ఫ‌లితాల త‌ర్వాతే సీఎల్పీ భేటీ అయి సీఎం అభ్య‌ర్థిని నిర్ణ‌యిస్తుంది. హైక‌మాండ్ సూచ‌న మేర‌కు ఇదంతా జరుగుతుంది. ఏవో కొన్ని చోట్ల మాత్ర‌మే ఇందుకు భిన్నంగా జ‌రిగాయి. కానీ ఇపుడు రాహుల్ గాంధీ డేరింగ్ డెసిష‌న్ తీసుకున్నారు. పంజాబ్ లో ప్ర‌స్తుత సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీనే ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు.

కాంగ్రెస్ పార్టీ మారిన ఆలోచ‌నా విధానానికి ఇది నిర్వ‌చ‌నంగా క‌నిపిస్తోంది. గ‌తంలో కేవ‌లం పార్టీ ఇమేజ్ తోనే ఎన్నిక‌ల‌కు వెళ్లేది. ఇపుడు ఆ పంథా మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది. పంజాబ్ లో బ‌ల‌మైన పీసీసీ చీఫ్ సిధ్దూను కాద‌ని ప్ర‌స్తుత సీఎంనే కొన‌సాగించింది.

అయితే ఇప్పుడు తెలంగాణ‌లో కూడా ఇలా ముందుగానే సీఎం అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తారా అనే అంశం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఇదే జ‌రిగితే సీఎం పీఠం కోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్న రేవంత్ కు ఇబ్బందేన‌ని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

పంజాబ్ లో పీసీసీ చీఫ్ సిద్దూ వివాదాస్ప‌దుడ‌ని.. చాలా పార్టీలు మారి వ‌చ్చార‌ని.. ప‌లు కేసులున్నాయ‌ని ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టారు. ఇక్క‌డా పీసీసీ చీఫ్ రేవంత్ ఒంటెత్తు పోక‌డ‌లు పోతార‌ని.. పార్టీలు మారి వ‌చ్చార‌ని.. ఓటుకు నోటు కేసు ఉన్నాయ‌ని ప‌క్క‌న పెడ‌తార‌న‌నే అనుమానం రేవంత్ వ‌ర్గీయుల్లో మొద‌లైంది. అక్క‌డ ద‌ళిత సీఎంను కొన‌సాగించిన‌ట్లుగానే.. ఇక్క‌డా సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌ను సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తార‌నే గుబులు ప‌ట్టుకోంది.

పార్టీలో చాలా మంది సీనియ‌ర్ నేత‌లు కూడా రేవంత్ కు వ్య‌తిరేకంగానే ఉన్నారు. గ‌తంలో ఎంపీ కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డి కూడా రేవంత్ ముంద‌రి కాళ్ల‌కు బంధం వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ద‌ళితుడిని సీఎం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ అంశాన్నే గుర్తు చేసుకుంటున్నారు పార్టీ నేత‌లు. పంజాబ్ ఫార్ములా ఇక్క‌డా అమ‌లైతే భ‌ట్టికి ల‌క్కు త‌గులుతుంద‌ని.. రేవంత్ కు షాక్ త‌ప్ప‌ద‌ని అంటున్నారు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..?