Begin typing your search above and press return to search.

త‌మిళ‌నాడులో ప‌ద‌వులు అమ్ముకుంటున్నారు: గ‌వ‌ర్న‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   23 Oct 2022 12:30 AM GMT
త‌మిళ‌నాడులో ప‌ద‌వులు అమ్ముకుంటున్నారు:  గ‌వ‌ర్న‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
తమిళనాడులో ప‌ద‌వులను అమ్ముకుంటున్నార‌ని.. పంజాబ్ గ‌వ‌ర్న‌ర్ బ‌న్వారీలాల్ పురోహిత్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న ప‌రిధికి మించి వ్య‌వ‌హ‌రించింద‌ని అన్నారు. గ‌వ‌ర్న‌ర్ చేయాల్సిన ప‌నిని కూడా.. ప్ర‌భుత్వం చేయ‌డం ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు. నిజానికి త‌మిళ‌నాడు ప్ర‌భుత్వంపై ఎక్క‌డో ఉన్న పంజాబ్ గ‌వ‌ర్న‌ర్ ఇలా విమ‌ర్శ‌లు చేయ‌డం ఏంట‌నే సందేహం వ‌స్తుంది. అయితే.. గ‌తంలో ఆయ‌న త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేశారు. ఈ స‌మ‌యంలో వెలుగు చూసిన అంశాల‌ను తాజాగా ఆయ‌న వెల్ల‌డించ‌డం.. అది కూడా మీడియా ముందు ప్ర‌స్తావించ‌డం.. క‌ల‌క‌లం రేపుతోంది.

యూనివ‌ర్సిటీల‌కు ఉప‌కుల‌ప‌తుల‌ను నియ‌మించే అధికారం.. గ‌వ‌ర్న‌ర్ల‌కే ఉంటుంది. అయితే.. కొన్నాళ్లుగా.. ఈ అధికారాల్లోకి ప్ర‌భుత్వాలు చొచ్చుకొస్తున్నాయి. అదేస‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ చేయాల్సిన ప‌నుల‌ను కూడా.. ప్ర‌భుత్వాలే చేస్తున్నాయి. దీనిపై.. పంజాబ్ ప్ర‌భుత్వానికి.. అక్క‌డ ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న బ‌న్వారీలాల్ పురోహిత్‌కు మ‌ధ్య వివాదాలు న‌డుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తాజాగా త‌మిళ‌నాడు ఇష్యూను తెర‌మీదికి తెచ్చారు. త‌మిళ‌నాడులో తాను గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న‌ప్పుడు.. జ‌రిగిన ఘ‌ట‌న ఇదీ.. అంటూ.. మీడియాకు వెల్ల‌డించారు. ఓ యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవిని రూ.40-50 కోట్లకు విక్రయించారని అన్నారు.

"నేను తమిళనాడు గవర్నర్గా నాలుగేళ్లు పని చేశాను. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఒక్కో వీసీ పోస్ట్ రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లకు అమ్ముడు పోయేది" అని గవర్నర్ వ్యాఖ్యానించారు. తమిళనాడు గవర్నర్ హోదాలో తాను 27 మంది వీసీలను చట్టబద్ధంగా నియమించాన‌ని తెలిపిన బన్వారీలాల్.. పంజాబ్ రాష్ట్రం ఈ నియామకాల నుంచి నేర్చుకోవాల్సి ఉందని తెలిపారు. పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ సత్బీర్ సింగ్ గోసల్‌ను చట్టవిరుద్ధంగా నియమించారని పురోహిత్ ఆరోపించారు. ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించాలని గతంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను కోరారు.

అయితే.. సీఎం మాన్ మాత్రం గ‌వ‌ర్న‌ర్‌పై రివ‌ర్స్ అయ్యారు. యూనివర్సిటీ కార్యకలాపాల్లో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని విమ‌ర్శించారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల కార‌ణంగా.. కొన్నాళ్లుగా గ‌వ‌ర్న‌ర్‌కు సీఎం కు మ‌ధ్య గ్యాప్ పెరిగింది. దీనిపై తాజాగా స్పందించిన గ‌వ‌ర్న‌ర్ సీఎం వ్యాఖ్యలపై స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వాలే గ‌వ‌ర్న‌ర్ విధుల్లో జోక్యం చేసుకోకూడదని హితవు పలికారు. యూనివ‌ర్సిటీల‌కు వీసీల‌ను నియ‌మించే అధికారం గ‌వ‌ర్న‌ర్ల‌దేన‌ని వ్యాఖ్యానించారు. అయితే.. వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ త‌మిళ‌నాడు లొసుగుల‌ను బ‌య‌ట‌కు లాగ‌డం గ‌మ‌నార్హం.